లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రావడంతోనే ఉమ్మడి జిల్లాలో రాజకీయ వేడి పెరిగింది. ఇప్పటికే అన్ని పార్టీల ఆశావహులు టికెట్ల కోసం ఎవరి ప్రయత్నం వారు చేసుకుంటున్నారు. రెండు మూడు రోజుల్లో అన్ని పార్టీలూ తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. అభ్యర్థులు కూడా నామినేషన్ల దాఖలు నుంచే ప్రచారంపై పూర్తి దృష్టి పెట్టనున్నారు. ఇదిలా ఉండగా, ఓటర్లను ప్రసన్నం చేసుకునే ట్రెండుల్లో సోషల్ మీడియా పాత్ర నేడు కీలకంగా మారింది. ప్రతీ పార్టీ, అభ్యర్థి సామాజిక మాధ్యమాల ద్వారానే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ విస్తృతంగా సోషల్ మీడియాను వాడుకోవడం కూడా దాని విజయానికి ఓ కారణమని పలు సర్వేలు చెప్పాయి.
ఇప్పుడు ఇతర పార్టీలూ ఇదే పంథాలో నడుస్తున్నాయి. ఎన్నికల వేళ అభ్యర్థులు చేసే హామీలు, నాయకులు, కార్యకర్తలు ప్రత్యర్థులపై చేసే విమర్శలు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల సందడే కనిపిస్తుంటుంది. సాధారణ సమయాల్లో వీటిని ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. కానీ, ఎన్నికలప్పుడు అభ్యర్థులు గానీ, పార్టీలు గానీ ఇలాంటి పోస్టులపై అభ్యంతరం వ్యక్తం చేసి, పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆ పోస్టులు పెట్టిన అడ్మిన్‌లపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తారు. ఎన్నికల వేళ ప్రత్యేకంగా ఎన్నికల సంఘం, పోలీసు అధికారులు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న సందేశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ ‘సోషల్ మీడియా’ పలు చోట్ల రచ్చరచ్చ చేసిన ఘటనలూ వెలుగుచూశాయి. ఉమ్మడి జిల్లాలోనూ అభ్యంతరకరమైన పోస్టులపై ఫిర్యాదులు, కేసుల నమోదయ్యాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని సామాజిక మాధ్యమాల్లో మెసెజ్‌లు, ఫొటోలు పెట్టడం, షేర్ చేయడంపై తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది.
గత ఎన్నికల్లో..
సామాజిక మాధ్యమాల్లో వివిధ పార్టీల కార్యకర్తలు పెడుతున్న సందేశాలు ఈమధ్య చాలానే వివాదాస్పదం అవుతున్నాయి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సోషల్ మీడియాలో వివాదాస్పద పెట్టడంతో, ప్రత్యర్థులు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సందేశాలపై ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు సంఘటనలున్నాయి. పార్టీలకు సంబంధం ఉన్న వారితోపాటు పార్టీలకు సంబంధం లేని వారు సైతం కేసుల్లో ఇరుక్కున్న పరిస్థితి గత అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది.
చట్టాలు ఏం చెబుతున్నాయంటే..
సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు ఎక్కువగా సాగుతుండటంతో అధికారులు సైతం ఈ పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. కొన్ని గ్రూపుల్లో పోలీసు అధికారులు, సిబ్బంది ఉండి మరీ పరిశీలిస్తున్నారు. ఎవరైననా సైబర్ నిబంధనలకు విరుద్ధంగా పోస్టు పెడితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం కోకొల్లలు. ఇలాంటి చర్యలపై చట్టలు సైతం కఠినంగా ఉన్నాయి. అంతేకాకుండా.. అశ్లీల సమాచారం, ఫొటో మార్ఫింగ్, తప్పుడు సమాచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు చేస్తే ఇన్ఫర్మేమేషన్ టెక్నాలజీ యాక్ట్–2000 ప్రకారం సెక్షన్ 67 కింద జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తారు. అదే నేరం రెండోసారి పాల్పడినట్లు గుర్తిస్తే పదేళ్ల జైలుపాటు రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. పోస్టులు పెట్టే అడ్మిన్‌లతోపాటు వాటిని షేర్ చేసే వారిని కూడా ఒక్కోసారి బాధ్యులను చేసే అవకాశముంది.
అడ్మిన్ బాధ్యతలు..
- సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాలకు చట్ట ప్రకారం ఆయా గ్రూప్‌లకు సంబంధించిన అడ్మిన్లే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.
- గ్రూప్‌లో ఉండే ప్రతీ సభ్యుడు కచ్చితంగా అడ్మిన్‌కు తెలిసి ఉండేలా చూసుకోవాలి. అపరిచితులను గ్రూప్‌లో చేర్చుకోవద్దు.
- ఎవరైనా గ్రూప్ సభ్యులు అభ్యంతరకరంగా ప్రవర్తించినా.. వివాదస్పద పోస్టులు, కామెంట్లు చేసినా.. ఆ సభ్యుడిని వెంటనే తన గ్రూప్ నుంచి తొలగించడం ఉత్తమం.
- అడ్మిన్‌తోపాటు గ్రూప్‌లోని సభ్యులు వివాదాస్పద పోస్టులు చేస్తే ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేస్తారని తెలుసుకోవాలి.
- ఇవి పెట్టొద్దు.. షేర్ చేయొద్దు..
- విద్వేషాలు రెచ్చగొట్టే విషయాలు ∙తప్పుడు సమాచారం, తెలియని అంశాలు
- మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు ∙ఓ వర్గాన్ని బాధించే కార్టూన్సు
Comments
Please login to add a commentAdd a comment