సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
సాక్షి, కోదాడ : సారు.. కారు.. పదహారు ఏమోగాని టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలు వట్టి బేకార్‌లని, వారిని చిత్తుగా ఓడించాలని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కోరారు. శుక్రవారం కోదాడలోని డేగబాబు ఫంక్షన్ హాలులో నిర్వహించిన కోదాడ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 1994లో ఎమ్మెల్యేగా తన రాజకీయ జీవితాన్ని కోదాడనుంచే ప్రారంభించానని ఐదుసార్లు కోదాడ, హుజూర్‌నగర్‌లలో ఎమ్మెల్యేగా గెలిపించిన ఈ ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. శుక్రవారం ఎంపీగా నామినేషన్ దాఖలు చేసి తొలిఎన్నికల ప్రచారం కూడా కోదాడ నుంచే ప్రారంభిస్తున్నానని తెలిపారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థి భూ కబ్జాదారుడు...
నల్లగొండ టీఆర్‌ఎస్ అభ్యర్థి గతంలో మునుగోడు ఎంపీపీగా పోటీచేసి ఓడిపోయాడని, మునుగోడులో చెల్లని రూపాయి.. నల్లగొండలో ఎలా చెల్లుతుందో వారికే తెలియాలన్నారు. హైదరాబాద్‌లో తాను ఉంటున్న ఇంటి పక్కనే ఐదు ఎకరాలు ఆక్రమించాడని, బ్యాంక్‌పెట్టి సామాన్యులను మోసం చేశాడని ఆరోపించారు. 16 మంది ఎంపీలను గెలిపిస్తే ఏదో సాధిస్తానని కేసీఆర్ చెపుతున్నాడని కానీ 2014 నుంచి ఒక్క నంది ఎల్లయ్య తప్పా మిగతా ఎంపీలంతా ఆయన పక్కనే ఉన్నారని, అయినాబయ్యారం స్టీలు ప్లాంట్, కాజీపేట కోచ్‌ప్యాక్టరీ సాధించలేక పోయారని, అసలు కేంద్రం నుంచి ఆయన ఏమి సాధించారో చెప్పాలని ప్రశ్నించారు.
ఎంపీ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించినవి కావని, కేవలం రాహుల్‌గాంధీ–నరేంద్రమోదీల మధ్య జరుగుతున్న ఎన్నికలని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ప్రతి కార్యకర్త రాహూల్‌గాంధీ వలె కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే ఎన్.పద్మావతి, నాయకులు లక్ష్మీనారాయణరెడ్డి, వంగవీటి రామారావు, పారా సీతయ్య, డేగబాబు, నల్లపాటి శ్రీనివాస్, తెప్పని శ్రీనివాస్, మునావర్, పాలకి అర్జున్, కత్రం నాగేంధర్‌రెడ్డి, బషీర్, బాగ్ధాద్, ఎజాజ్, చల్లా కొండల్‌రెడ్డి, కందుల కోటేశ్వరరావు, ముల్కా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముస్లీం యువకులు ఆయనను ఘనంగా సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment