నల్లగొండ జిల్లా
సాక్షి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన వివిధ ఎన్నికల్లో ఎన్నో ఆసక్తికరమైన అంశాలున్నాయి. శాసనసభకు ఎన్నికై ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు.. పార్లమెంట్‌కు ఎన్నికై ఎంపీలుగా కూడా పనిచేశారు. జిల్లాలో ఆ ఘనత ఐదుగురు నాయకులకు దక్కగా బయటి జిల్లాల నుంచి ఇలా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచిన వారు మరో ఇద్దరున్నారు. తెలంగాణ సాయుధపోరాట యోధులు రావినారాయణ రెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పనిచేశారు. వడ్డేపల్లి కాశీరాం కూడా మొదట ఎంపీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా విజయాలు సాధించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తొలుత ఎంపీగా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా గెలిచారు. అటు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన వారే కాకుండా, ఎమ్మెల్యేలుగా విజయాలు సాధించాక, ఎమ్మెల్సీలుగా శాసన మండలి, రాజ్యసభ సభ్యులుగా పార్లమెంటు గడప తొక్కిన వారూ ఉన్నారు. ఇతర జిల్లాల నుంచి నల్లగొండకు వలస వచ్చి దేవరకొండ ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్రనాయక్ వరంగల్ జిల్లాలో ఎంపీగా పనిచేశారు. మిర్యాలగూడెం ఎంపీగా రెండు పర్యాయాలు వరుసగా గెలిచిన ఎస్.జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్యేగా కూడా పలుమార్లు గెలిచారు. వీరే కాకుండా.. ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పనిచేయగా, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసిన 2009 ఎన్నికల్లోనే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో అదే స్థానంలో ఓడిపోయిన ఆయన స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి శాసన మండలి సభ్యుడిగా విజయం సాధించారు. మరో మూడేళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే రాజీనామా చేసి 2018 శాసన సభ ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు.
వడ్డేపల్లి కాశీరాం
కాంగ్రెస్ టికెట్‌పై వడ్డేపల్లి కాశీరాం నల్లగొండ పార్లమెంట్ స్థానానికి 1960లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన ఆ తర్వాత 1962లో మిర్యాలగూడెం నుంచి పోటీ చేసినా ఓడిపోయారు. కానీ రామన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం (రద్దయింది) నుంచి కాశీరాం 1967, 1972 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు.
బొమ్మగాని ధర్మభిక్షం
సాయుధ పోరాట యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం సైతం రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. ఆయన నకిరేకల్ నియోజకవర్గం నుంచి 1957 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, నల్లగొండ నియోజకవర్గం నుంచి 1962 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయాలు సాధించారు. ఆ తర్వాత నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వరసగా 1991, 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు.
చకిలం శ్రీనివాసరావు
నల్లగొండ ఉమ్మడి జిల్లాకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన చకిలం శ్రీనివాస్‌రావు మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. నల్లగొండ శాసనసభా నియోజకవర్గం నుంచి ఆయన 1967లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1972 ఎన్నికల్లోనూ ఆయన ఇదే రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత నల్లగొండ నుంచి మిర్యాలగూడెం అసెంబ్లీ స్థానం నుంచి 1983 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 1989 పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభా స్థానం (పూర్వపు మిర్యాలగూడెం) నుంచి ఎంపీగా విజయం సాధించారు.
ఎవరెవరు.. ఎక్కడెక్కడ ?
రావినారాయణరెడ్డి
సాయుధపోరాటయోధుడు రావినారాయణరెడ్డి 1952 ఎన్నికల్లో ఎంపీగా అత్యధిక మెజార్టీ సాధించి పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా రెండు పదవులకు పోటీచేసి రెండు చోట్లా గెలిచారు. అయితే ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు. ఆయన 1957 ఎమ్మెల్యేగా, 1962లో రెండోసారి ఎంపీగా విజయాలు నమోదు చేసుకున్నారు.
భీమిరెడ్డి నర్సింహారెడ్డి
సాయుధపోరాట సేనాని భీమిరెడ్డి నర్సింహారెడ్డి శాసన సభ, లోక్‌సభ ఎన్నికల్లో విజయాలు నమోదు చేసుకున్నారు. ఆయన తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1967లో తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత మిర్యాలగూడెం పార్లమెంట్ నియోజకవర్గం (2009 ఎన్నికల నుంచి రద్దు అయింది) సీపీఎం అభ్యర్థిగా 1971, 1984, 1991 ఎన్నికల్లో గెలిచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన నేతగా రికార్డు నెలకొల్పారు.
Comments
Please login to add a commentAdd a comment