మాట్లాడుతున్న రైతు నాయకులు
పెర్కిట్/ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ కాలనీలో గల మినీ స్టేడియంలో 9న నిర్వహించే రైతు ఐక్యత సభకు విద్యార్థులు, యువత, మేధావులు తరలి వచ్చి మద్దతు తెలపాలని రైతు ఐక్య కమిటీ నాయకులు, రైతు ఎంపీ అభ్యర్థులు కోరారు. ఆర్మూర్ మండలం పెర్కిట్ ఎమ్మార్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో శనివారం రైతు నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు ఐక్య కమిటీ నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, అన్వేష్ రెడ్డి, వీ ప్రభాకర్, దేగాం యాదాగౌడ్ రైతు ఎంపీ అభ్యర్థులు గడ్డం సంజీవ్ రెడ్డి, కోల వెంకటేశ్ రైతు ఐక్యత సభ గురించి వెల్లడించారు.
వారు మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటు, పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర ఇవ్వాలనే డిమాండ్‌తో 178 మంది రైతులు నామినేషన్ వేసి తొలిదశలోనే విజయం సాధించామన్నారు. నామినేషన్లతో యావత్తు దేశం నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల వైపు ఉత్కంఠతో చూస్తున్నారన్నారు.ఈసభకు రైతులు, రైతు కూలీలు, వారి కుటుంబ సభ్యులు, విద్యార్థులు, మేధావులు, వ్యాపారులు వేలాదిగా తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
నిజామాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని కోరుతున్నారు. రైతుల ఐక్యతను చాటడానికి నిర్వహిస్తున్న సభను అడ్డుకోవద్దని అధికార పార్టీని వారు వేడుకున్నారు.
ఆర్మూర్‌లో ప్రచారం..
ఆర్మూర్ పట్టణంలోని ఆరు పంతాల సంఘాల వద్ద రైతు నాయకులు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్మూర్‌లో నిర్వహించనున్న రైతు ఐక్యత ప్రచార సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment