Admin
-
వాట్సాప్ గ్రూప్‌లకు లైసెన్స్.. ఫీజు కూడా!
అక్కడ వాట్సాప్ గ్రూప్‌ను నిర్వహించడమంటే ఆషామాషీ కాదు. గ్రూప్ అడ్మిన్‌కు లైసెన్స్ ఉండాలి. ఇందుకోసం ఫీజు కూడా చెల్లించాలి. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? పూర్తి వివరాల కోసం ఈ కథనంలో చదివేయండి..వాట్సాప్ గ్రూప్ నిర్వహణకు సంబంధించి జింబాబ్వే ప్రభుత్వం కొత్త నిబంధనను అమలు చేసింది. దీని ప్రకారం ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లందరూ జింబాబ్వే పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (POTRAZ)లో నమోదు చేసుకోవాలి. వారి గ్రూప్ నిర్వహణకు లైసెన్స్ పొందాలి. ఈ లైసెన్స్ కోసం ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇందు కోసం కనీసం 50 డాలర్లు (సుమారు రూ.4,200) ఖర్చవుతుంది. ఈ విషయాన్ని జింబాబ్వే సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ, పోస్టల్ అండ్ కొరియర్ సర్వీసెస్ (ICTPCS) మంత్రి తటెండా మావెటెరా ప్రకటించారు.కొత్త రూల్ ఎందుకంటే..తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా, దేశంలో శాంతి నెలకొనేందుకు ఆ దేశ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఈ కొత్త వాట్సాప్ నిబంధనను రూపొందించారు. ఈ చట్టం ప్రకారం, ఒక వ్యక్తిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గుర్తించడానికి ఉపయోగించే ఏదైనా సమాచారాన్ని వ్యక్తిగత సమాచారంగా పరిగణిస్తారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల వద్ద సభ్యుల ఫోన్ నంబర్లు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ప్రకారం, వారు డేటా ప్రొటెక్షన్ యాక్ట్ పరిధిలోకి వస్తారు.ఇదీ చదవండి: డిసెంబర్ 14 డెడ్‌లైన్.. ఆ తర్వాత ఆధార్ కార్డులు రద్దు! -
పంజాబ్ విద్యార్థుల ‘కెనడా చదువులు’ ఏం కానున్నాయి?
2024 జనవరి 8 నుంచి కెనడాలో నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఈఏడాది పంజాబ్‌కు చెందిన 36 వేల మంది విద్యార్థులు కెనడాలోని వివిధ విద్యాలయాల్లో అడ్మిషన్ తీసుకున్నారు. వీరిలో 70 శాతం మంది విద్యార్థులకు వీసాలు వచ్చాయి. విమాన టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అయితే కెనడా- భారత్ మధ్య క్షీణిస్తున్న సంబంధాల కారణంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కెనడాలో 2,09,930 మంది భారత విద్యార్థులు వివిధ కళాశాలల్లో చదువుతుండగా, 80,270 మంది విశ్వవిద్యాలయాలలో చదువుతున్నారు. కెనడాలోని వివిధ కళాశాలలను డిప్లొమా కోర్సులను అందిస్తాయి. విశ్వవిద్యాలయాలు బ్యాచిలర్, మాస్టర్స్ డాక్టోరల్ డిగ్రీలను అందిస్తాయి. ఇమ్మిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ బోర్డు స్టాండింగ్ కమిటీ నుండి వచ్చిన డేటా ప్రకారం కెనడాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు అక్కడి ఆర్థిక వ్యవస్థకు సంవత్సరానికి 22.3 బిలియన్ కెనడియన్ డాలర్లకు మించిన అధిక మొత్తాన్ని అందిస్తున్నారు. తీవ్రతరమవుతున్న దౌత్య సంక్షోభం కెనడా విద్యావ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఇది ఉన్నత విద్య కోసం వలస వచ్చే భారతీయ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయనుంది. వీసా వ్యవహారాల నిపుణుడు సుకాంత్ తెలిపిన వివరాల ప్రకారం భారతీయ విద్యార్థులు కెనడియన్ విద్యార్థుల కంటే రెండింతల మొత్తాన్ని ఆ దేశ విద్యా వ్యవస్థకు అందిస్తున్నారు. అంటారియో ప్రభుత్వం అందించే నిధుల కంటే ఇవి అధికంగానే ఉంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా కెనడాలో చెల్లుబాటు అయ్యే స్టడీ వీసాతో ఆ దేశంలో నివసిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగింది. వచ్చే ఏడాది జనవరిలో తరగతులకు హాజరయ్యేందుకు కెనడా వెళ్లనున్న సర్బ్జిత్ కౌర్ మాట్లాడుతూ తమకు జనవరి నుండి క్లాసులు ప్రారంభం కానున్నాయని, కెనడాలోని వాంకోవర్‌లో అడ్మిషన్ పూర్తయిందని, టిక్కెట్ కూడా బుక్ అయిందని తెలిపారు. అయితే ఇప్పుడు కెనడా- భారత్ మధ్య క్షీణించిన సంబంధాలు కారణంగా తనతో పాటు తన కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. భారతదేశం- కెనడాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా కెనడాలో తమ పిల్లల చదువుపై తీవ్ర ప్రభావంచూపుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖల్సా వోక్స్ నివేదిక ప్రకారం పంజాబ్ నుండి ప్రతి సంవత్సరం 68,000 కోట్ల రూపాయలు అక్కడి విద్యా వ్యవస్థకు చేరుతాయని తెలిపారు. గత సంవత్సరం రెఫ్యూజీ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్సీసీ) కింద కెనడా నుంచి మొత్తం 226,450 వీసాలు ఆమోదం పొందాయి. త్వరలో కెనడాకు వెళుతున్నవారిలో దాదాపు 1.36 లక్షల మంది విద్యార్థులు పంజాబ్‌కు చెందినవారే కావడం గమనార్హం. వీరు రెండు నుంచి మూడేళ్ల వ్యవధి కలిగిన వివిధ కోర్సులను అభ్యసించనున్నారు. ఇది కూడా చదవండి: ‘జో నెహ్రూ’ ఎవరు? ఇందిర, సోనియా, ప్రియాంకలకు ఏమి బహూకరించారు? -
సీఎంను కించపరుస్తూ పోస్టులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అరెస్టు..
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కించపరుస్తూ పోస్టులు చేసిన వ్యవహారంలో ఓ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వాట్సాప్ గ్రూప్‌కు షాహబుద్ధీన్ అన్సారీ అనే వ్యక్తి అడ్మిన్‌గా ఉన్నాడు. ఆ గ్రూప్‌లో సీఎం యోగిని అవమానపరుస్తూ పోస్టూ చేశాడో వ్యక్తి. దీంతో గ్రూప్ అడ్మిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం యోగిపై ఓ పోస్టు విపరీతంగా వైరల్ అయిందని.. ఈ అంశంలో ఓ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ను అదుపులోకి తీసుకున్నామని కోత్వాలీ పోలీసు స్టేషన్ అధికారి కుమార్ సేత్ తెలిపారు. గ్రూప్ అడ్మిన్‌ను షాహబుద్ధీన్గా గుర్తించారు. పోస్టు చేసిన వ్యక్తిని ముస్లిం అన్సారీగా గుర్తించారు. అయితే.. సీఎం యోగికి కించపరుస్తూ పోస్టు చేసిన వ్యవహారంపై ఫిర్యాదులు అందిన తర్వాత చర్యలు తీసుకున్నామని తెలిపారు. వాట్సాప్ గ్రూప్ పేరు 'నగర పాలిక పరిషత్ బదోనీ'గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బదోనీకి సంబంధించిన నగరపాలిక కార్పోరేటర్లు, స్థానికులు ఆ గ్రూప్‌లో ఉన్నారని వెల్లడించారు. స్థానికంగా సమస్యలను పరిష్కరించుకోవాలనే ఉద్యేశంతోనే ఆ గ్రూప్‌ను క్రియేట్ చేసినట్లు చెప్పారు. ఇది కార్పోరేటర్లకు సంబంధించిన అధికారిక గ్రూప్ కాదని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: దేశంలో 508 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణ పనులకు ప్రధాని శంకుస్థాపన -
వాట్సాప్ గ్రూపుల్లో అశ్లీల పోస్టులు.. అడ్మిన్ బాధ్యతపై హైకోర్టు వ్యాఖ్యలు ఇవే..
తిరువనంతపురం: వాట్సాప్ గ్రూపుల్లో అభ్యంతరకర కంటెంట్ పోస్టులపై గ్రూపు అడ్మిన్ బాధ్యత వహించడంపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి పోస్టులకు అడ్మిన్ బాధ్యులు కాదంటూ హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి కౌసర్ ఎడప్పగత్ తన తీర్పును వెలువరించారు. అయితే, మార్చి 2020లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన కేసు విచారణ జరిగింది. ఈ కేసులో పిటిషనర్ ‘ఫ్రెండ్స్’ అనే వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశాడు. ఈ గ్రూపులో అతడితో పాటు మరో ఇద్దరు అడ్మిన్లు ఉండగా.. వారిలో ఒకరు గ్రూపులో అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 బి, పోక్సో చట్టంలోని సెక్షన్ 13, 14, 15 ఆధారంగా గ్రూప్ అడ్మిన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పిటిషనర్ గ్రూపును క్రియేట్ చేసినప్పటి నుంచి ఈ కేసులో ఏ2గా ఉన్నాడు. ఈ పోస్టు విషయంలో తనకు ప్రమేయం లేదంటూ అతను కోర్టును ఆశ్రయించాడు. కాగా, ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా హైకోర్టు.. గ్రూప్‌లోని మెంబర్ పోస్ట్ చేసిన అభ్యంతకర పోస్టులకు గ్రూపు అడ్మిన్ బాధ్యులుకారని పేర్కొంది. అలా వారిని బాధ్యులుగా పరిగణించడం క్రిమినల్ చట్టంలోని ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమంటూ కోర్టు పేర్కొంది. -
మీరు వాట్సాప్ గ్రూప్ అడ్మినా..! అయితే మీకో గుడ్‌న్యూస్..!
మీరు వాట్సాప్ గ్రూప్‌లో అడ్మిన్స్‌గా ఉన్నారా..! అయితే మీకో గుడ్‌న్యూస్...! వాట్సాప్ గ్రూప్స్‌ను దృష్టిలో ఉంచుకొని మెటాకు చెందిన వాట్సాప్ త్వరలోనే అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇతరుల మెసేజ్‌లను డిలీట్..! వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetaInfo ప్రకారం..వాట్సాప్ గ్రూప్‌లోని సదరు యూజర్ షేర్ చేసిన సందేశాలను తొలగించడానికి గ్రూప్ అడ్మిన్లను అనుమతించే ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తోందని నివేదించింది. ఇలాంటి మోడరేషన్ పీచర్ టెలిగ్రాం యాప్‌లో అందుబాటులో కలదు. ఈ ఫీచర్‌కు సంబంధించిన విషయాలను వాట్సాప్ ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. WABetaInfo ప్రకారం...ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ బీటా వెర్షన్లలో వచ్చే అవకాశం ఉందని తెలిపింది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetaInfo షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం ...గ్రూప్స్‌లోని సదరు యూజరు పంపిన సందేశాలను అడ్మిన్స్ డిలీట్ చేసే ఫీచర్‌ను ట్విటర్లో షేర్ చేసింది. సదరు యూజర్ పంపిన మెసేజ్‌ను గ్రూప్ అడ్మిన్స్ డిలీట్ చేశారనే విషయాన్ని గ్రూప్ సభ్యులకు తెలియజేస్తుందని పేర్కొంది. ప్రస్తుతానికి, గ్రూప్ అడ్మిన్లు గ్రూప్‌లోని పాత మెసేజ్‌లను తొలగించగలరా లేదా అనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. వినియోగదారులు ప్రస్తుతం వారి స్వంత సందేశాలను పర్సనల్ చాట్‌లో లేదా గ్రూప్స్‌లో ఒక గంట, ఎనిమిది నిమిషాల, 16 సెకన్లలో తొలగించగలరు. అడ్మిన్స్‌కు ఊరట..! వాట్సాప్ తీసుకురానున్న ఈ ఫీచర్‌తో అడ్మిన్స్‌కు భారీ ఊరట కలిగే అవకాశం ఉంది. గ్రూప్స్‌లో నకిలీ వార్తలు లేదా హానికరమైన కంటెంట్లను అరికట్టడానికి గ్రూప్ అడ్మిన్స్‌కు తోడ్పడనుంది. గతంలో వాట్సాప్ గ్రూప్స్‌లో సదరు యూజర్లు పెట్టే మెసేజ్‌లకు పూర్తి బాధ్యత గ్రూప్ అడ్మిన్స్దేనని ప్రభుత్వం తెలిపింది. దీనిపై బాంబే, మద్రాస్ హైకోర్టులు గ్రూప్ అడ్మిన్స్‌కు ఊరట కల్పించాయి. వాట్సాప్ గ్రూప్‌లో ఇతర సభ్యులు అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేస్తే గ్రూప్ అడ్మిన్స్‌ను బాధ్యులుగా చూడలేమని పేర్కొన్నాయి. If you are a group admin, you will be able to delete any message for everyone in your groups, in a future update of WhatsApp beta for Android. A good moderation, finally. #WhatsApp pic.twitter.com/Gxw1AANg7M — WABetaInfo (@WABetaInfo) January 26, 2022 చదవండి: ఈ యాప్స్ వాడుతున్నారా.. అయితే, మీ మొత్తం డేటా కంపెనీల చేతుల్లోకి! -
వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్స్ ఇవే
WhatsApp Upcomig Features In 2022: ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ త్వరలో అదీ కొత్త ఏడాది మొదట్లో కొత్త ఫీచర్స్‌తో యూజర్ల ముందుకు రానుంది. ఈ ఏడాది అంతగా ఫీచర్ల అప్డేట్ ఇవ్వని వాట్సాప్.. 2022లో మాత్రం యూజర్ ఫ్రెండ్లీ అప్డేట్స్తో రానున్నట్లు సమాచారం. భారత్ సహా ప్రపంచంలోనే మోస్ట్ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌గా ఉంది వాట్సాప్. వచ్చిన కొత్తలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న వాట్సాప్.. క్రమంగా వివాదాలను అధిగమిస్తూ యూజర్ ఫ్రెండ్లీ యాప్‌గా పేరు దక్కించుకుంది. కరోనా ప్రభావంతో కిందటి ఏడాది, అలాగే 2021 కూడా వాట్సాప్ యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ పోయింది. ఈ తరుణంలో కొత్త సంవత్సరం అదిరిపోయే ఫీచర్లను అందించబోతోంది. వాబేటా ఇన్ఫోప్రకారం.. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ 2022లో వాట్సాప్ నుంచి రాబోయే కొత్త ఫీచర్ బహుశా ఇదే అయ్యి ఉండొచ్చు. గ్రూపులో పెట్టే ఏ మెసేజ్‌నైనా.. అడ్మిన్ డిలీట్ చేసే ఫీచర్ ఇది. అప్పుడు అక్కడ This was removed by an admin అని చూపిస్తుంది. ఇదిలా ఉంటే వాట్సాప్ రీసెంట్గా మెసేజ్ డెలిట్ ఫీచర్‌ను అప్డేట్ చేసిన విషయం తెలిసిందే. యూజర్లు ఎవరైనా సరే చేసిన మెసేజ్‌ను వారంలోగా వెనక్కి తీసేసుకునే వెసులుబాటు కల్పించింది. క్విక్ రిప్లయిస్.. బిజినెస్ ప్రత్యేకం వాట్సాప్ బిజినెస్ అకౌంట్ కోసం ఈ ఫీచర్. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్స్ కోసం తీసుకురాబోతున్నారు. ఇంతకు ముందు ఛాట్బాక్స్లో “/” అనే సింబల్‌ను తరచూ పంపించే మెసేజ్‌లకు త్వరగతిన స్పందించేందుకు యాడ్ చేసేవాళ్లు. ఇకపై ఈ ఫీచర్ ఛాట్షేర్ యాక్షన్ మెనూకి సైతం చేర్చునున్నారు. స్టిక్కర్ స్టోర్ వాట్సాప్‌లో సాధారణంగా ఇతర యాప్‌ల సాయంతో స్టిక్కర్లు పంపుకోవడం తెలిసిందే. అయితే ఇకపై ఎంపిక చేసిన స్టిక్కర్స్‌ను నేరుగా వాట్సాప్ ద్వారానే పంపుకునే విధంగా స్టిక్కర్ స్టోర్ ఆప్షన్ తీసుకురాబోతోంది వాట్సాప్. వెబ్ అప్లికేషన్స్‌తో పాటు డెస్క్‌టాప్ వెర్షలకు ఈ ఆప్షన్‌ను అందించనుంది. కమ్యూనిటీస్ కమ్యూనిటీస్ ఫీచర్. ఇది గ్రూప్ అడ్మిన్ల కోసం తీసుకురాబోతున్న ఫీచర్. తద్వారా మల్టీపుల్(ఒకటి కంటే ఎక్కువ) గ్రూపులు అడ్మిన్ కంట్రోల్ చేతిలో ఉంటాయి. అంతేకాదు సబ్ గ్రూపులను క్రియేట్ చేసే వీలుంటుంది కూడా. మెసేజ్ రియాక్షన్స్ దీని గురించి ఆల్రెడీ చర్చించిందే. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో మాదిరి.. మెసేజ్‌లకు ఎమోజీల ద్వారా నేరుగా రియాక్ట్ అయ్యే వెసులుబాటు కల్పించడం. ప్రస్తుతం ఆరు ఎమోజీల సాయంతో ఈ ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది వాట్సాప్. స్టిక్కర్ సజెషన్స్ వాట్సాప్‌లో ఏదైనా స్టిక్కర్ ప్యాక్‌ను డౌన్ లోడ్ చేశారనుకోండి!. ఒకటి కంటే ఎక్కువ స్టిక్కర్లకు(సేమ్ స్టిక్కర్) సరిపోయేలా ఏదైనా టైప్ చేస్తే.. అప్పుడు అందులో ఓ స్టిక్కర్ చిహ్నం(కన్ఫ్యూజ్కి గురి చేయకుండా) ఆటోమేటిక్‌గా మారుతుంది. ఎందుకంటే వాట్సాప్ సర్వర్‌లో కాకుండా కేవలం డివైజ్‌లో మాత్రమే వాటిని డౌన్ లోడ్ చేశారు కాబట్టి. ఆ స్టిక్కర్లకు WhatsAppతో సంబంధం ఉండదు కాబట్టి. ఈ ఫీచర్ యూజర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. సేవ్ చేయకుండా స్టిక్కర్లు ఫార్వాడ్ చేయడం సాధారణంగా వాట్సాప్‌లో ఎవరైనా స్టిక్కర్లు పంపితే.. వాటిని సేవ్ చేయకుండా మరొకరికి పంపలేం. అందుకే సేవ్ చేయకుండానే పంపే ఆప్షన్‌ను తీసుకురాబోతోంది. చదవండి: వాట్సాప్ నెంబర్ పదే పదే బ్యాన్ అవుతోందా? ఇలా చేయండి -
‘వాట్సాప్’ అడ్మిన్లూ బహుపరాక్!
సాక్షి, హైదరాబాద్: వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారమయ్యే పుకార్లకు వాటి అడ్మిన్లు బాధ్యత వహించాల్సి వస్తుందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు. ఆయన నిన్న (మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ... ఏదైనా వీడియో క్లిప్పింగ్‌ను ఫార్వర్డ్ చేసే ముందు పక్కాగా సరిచూసుకోవాలని సూచించారు. ఇటీవల మార్ఫింగ్ చేసిన, ఎక్కడెక్కడిలో కలిపి జోడించిన వీడియోలు వాట్సాప్‌లో వైరల్ అవుతున్నాయన్న ఆయన ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రతి గ్రూప్ అడ్మిన్ అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. అలా కాకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగర షీ–టీమ్స్ ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కోఠి ఉమెన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గవర్నర్ తమిళసై సౌందరరాజన్, శుక్రవారం చార్మినార్ వద్ద నిర్వహిస్తున్న రన్స్‌కు హోంమంత్రి మహమూద్ అలీ అతిథులుగా హాజరవుతున్నారని అన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి పెట్రోలింగ్ వాహనాల వద్ద కేసులు నమోదు విధానం ప్రారంభించామని, ఇప్పటి వరకు 156 ఎఫ్ఐఆర్లు, 893 పెట్టీ కేసులు రిజిస్టర్ అయినట్లు కొత్వాల్ వివరించారు. అలాగే నగరంలో వృద్థులకు ఆసరాగా ఉండటానికి పోలీసుస్టేషన్ల వారీగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపడుతున్నామని, త్వరలోనే యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. (హాయ్.. నేను విజయ్ దేవరకొండ అంటూ..) -
అడ్మిన్లూ..జర పైలం!
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రావడంతోనే ఉమ్మడి జిల్లాలో రాజకీయ వేడి పెరిగింది. ఇప్పటికే అన్ని పార్టీల ఆశావహులు టికెట్ల కోసం ఎవరి ప్రయత్నం వారు చేసుకుంటున్నారు. రెండు మూడు రోజుల్లో అన్ని పార్టీలూ తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. అభ్యర్థులు కూడా నామినేషన్ల దాఖలు నుంచే ప్రచారంపై పూర్తి దృష్టి పెట్టనున్నారు. ఇదిలా ఉండగా, ఓటర్లను ప్రసన్నం చేసుకునే ట్రెండుల్లో సోషల్ మీడియా పాత్ర నేడు కీలకంగా మారింది. ప్రతీ పార్టీ, అభ్యర్థి సామాజిక మాధ్యమాల ద్వారానే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ విస్తృతంగా సోషల్ మీడియాను వాడుకోవడం కూడా దాని విజయానికి ఓ కారణమని పలు సర్వేలు చెప్పాయి. ఇప్పుడు ఇతర పార్టీలూ ఇదే పంథాలో నడుస్తున్నాయి. ఎన్నికల వేళ అభ్యర్థులు చేసే హామీలు, నాయకులు, కార్యకర్తలు ప్రత్యర్థులపై చేసే విమర్శలు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల సందడే కనిపిస్తుంటుంది. సాధారణ సమయాల్లో వీటిని ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. కానీ, ఎన్నికలప్పుడు అభ్యర్థులు గానీ, పార్టీలు గానీ ఇలాంటి పోస్టులపై అభ్యంతరం వ్యక్తం చేసి, పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆ పోస్టులు పెట్టిన అడ్మిన్లపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తారు. ఎన్నికల వేళ ప్రత్యేకంగా ఎన్నికల సంఘం, పోలీసు అధికారులు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న సందేశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ ‘సోషల్ మీడియా’ పలు చోట్ల రచ్చరచ్చ చేసిన ఘటనలూ వెలుగుచూశాయి. ఉమ్మడి జిల్లాలోనూ అభ్యంతరకరమైన పోస్టులపై ఫిర్యాదులు, కేసుల నమోదయ్యాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని సామాజిక మాధ్యమాల్లో మెసెజ్‌లు, ఫొటోలు పెట్టడం, షేర్ చేయడంపై తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. గత ఎన్నికల్లో.. సామాజిక మాధ్యమాల్లో వివిధ పార్టీల కార్యకర్తలు పెడుతున్న సందేశాలు ఈమధ్య చాలానే వివాదాస్పదం అవుతున్నాయి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సోషల్ మీడియాలో వివాదాస్పద పెట్టడంతో, ప్రత్యర్థులు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సందేశాలపై ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు సంఘటనలున్నాయి. పార్టీలకు సంబంధం ఉన్న వారితోపాటు పార్టీలకు సంబంధం లేని వారు సైతం కేసుల్లో ఇరుక్కున్న పరిస్థితి గత అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. చట్టాలు ఏం చెబుతున్నాయంటే.. సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు ఎక్కువగా సాగుతుండటంతో అధికారులు సైతం ఈ పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. కొన్ని గ్రూపుల్లో పోలీసు అధికారులు, సిబ్బంది ఉండి మరీ పరిశీలిస్తున్నారు. ఎవరైననా సైబర్ నిబంధనలకు విరుద్ధంగా పోస్టు పెడితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం కోకొల్లలు. ఇలాంటి చర్యలపై చట్టలు సైతం కఠినంగా ఉన్నాయి. అంతేకాకుండా.. అశ్లీల సమాచారం, ఫొటో మార్ఫింగ్, తప్పుడు సమాచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు చేస్తే ఇన్ఫర్మేమేషన్ టెక్నాలజీ యాక్ట్–2000 ప్రకారం సెక్షన్ 67 కింద జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తారు. అదే నేరం రెండోసారి పాల్పడినట్లు గుర్తిస్తే పదేళ్ల జైలుపాటు రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. పోస్టులు పెట్టే అడ్మిన్లతోపాటు వాటిని షేర్ చేసే వారిని కూడా ఒక్కోసారి బాధ్యులను చేసే అవకాశముంది. అడ్మిన్ బాధ్యతలు.. సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాలకు చట్ట ప్రకారం ఆయా గ్రూప్‌లకు సంబంధించిన అడ్మిన్లే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్‌లో ఉండే ప్రతీ సభ్యుడు కచ్చితంగా అడ్మిన్‌కు తెలిసి ఉండేలా చూసుకోవాలి. అపరిచితులను గ్రూప్‌లో చేర్చుకోవద్దు. ఎవరైనా గ్రూప్ సభ్యులు అభ్యంతరకరంగా ప్రవర్తించినా.. వివాదస్పద పోస్టులు, కామెంట్లు చేసినా.. ఆ సభ్యుడిని వెంటనే తన గ్రూప్ నుంచి తొలగించడం ఉత్తమం. అడ్మిన్‌తోపాటు గ్రూప్‌లోని సభ్యులు వివాదాస్పద పోస్టులు చేస్తే ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేస్తారని తెలుసుకోవాలి. ఇవి పెట్టొద్దు.. షేర్ చేయొద్దు.. విద్వేషాలు రెచ్చగొట్టే విషయాలు ∙తప్పుడు సమాచారం, తెలియని అంశాలు మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు ∙ఓ వర్గాన్ని బాధించే కార్టూన్సు -
గ్రూపులో తగాదాలతో మనస్తాపం చెందిన అడ్మిన్..
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): నలుగురికి మంచి చేయాలని పరితపించిన ఓ ట్రావెల్ నిర్వాహకుడు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి, అందులో సభ్యులకు ఆపద వస్తే ఆదుకునే నిర్వాహకుడు.. గ్రూపులో తగాదాలతో మనస్తాపం చెంది ఈ దారుణానికి పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన కేజీహెచ్‌లో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి. పెందుర్తి మండలం చినముషిడివాడకు చెందిన మహాపాత్రుని మధు స్థానికంగా ఓ క్యాబ్(ట్రావెల్)ను నడుపుతున్నాడు. ట్రావెల్ యజమానులు, కార్ల డ్రైవర్ల కష్టాన్ని గుర్తించి వారికి ఏదోలా సేవ చేయాలన్న దృక్పథంతో కార్ ప్రొగ్రెసివ్ ట్రేడ్ యూనియన్(సీపీటీయూ) పేరిట వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ఎక్కడైనా కారు ప్రమాదానికి గురైనా.. ఆ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు నష్టం కల్గినా.. వెంటనే ఆ ఏరియా కారు డ్రైవర్లు, ట్రావెల్స్‌కు ఫోన్ చేసి సాయం చేసేలా అప్రమత్తం చేసేవాడు. అతను చేస్తున్న సేవలకు అనతి కాలంలోనే స్పందన వచ్చింది. మూడు గ్రూపుల్లో 250 మంది చొప్పున సభ్యులుగా చేరారు. ప్రస్తుతం మూడు వాట్సప్ గ్రూపులుగా ఈ సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిం చింది. ఎంతో మందికి ఉపయుక్తంగా మారింది. అయితే గ్రూపు బాగా నడుస్తోందన్న సమయంలో ఓ ఐదుగురు సభ్యులు చిచ్చు పెట్టారు. చేస్తున్న సేవలకు ప్రతి గ్రూపు సభ్యుడి నుంచి డబ్బులు వసూలు చేయాలని మధుపై ఒత్తిడి తెచ్చారు. అందుకు ఆయన నిరాకరించాడు. దీంతో వారు మధును తిట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారి మాటలు తట్టుకోలేక చినముషిడివాడలోని తన ఇంటి నుంచి మంగళవారం ఉదయం 9 గంటలకు బయటకు వెళ్లిపోయాడు. వెళ్లిపోతూ తన చావుకు కారణాలు వివరిస్తూ గ్రూప్‌లో వాయిస్ మెసేజ్ పెట్టాడు. దీంతో గ్రూప్ సభ్యులు అతనిని వెతకడం ప్రారంభించారు. పెందుర్తి వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద అపస్మారక స్థితిలో ఉన్న మధును కొందరు గుర్తించారు. 108 వాహనం ద్వారా కేజీహెచ్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం కేజీహెచ్ భావనగర్ వార్డులో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. -
అనుకోకుండా వాట్సాప్ అడ్మిన్ అయి..
రాజ్గర్: ఓ వాట్సాప్ గ్రూప్‌లో అభ్యంతరకర మెసేజ్ పోస్టవడంతో అనుకోకుండా గ్రూప్ అడ్మిన్ అయిన వ్యక్తి జైలుపాలయ్యాడు. ఓ వాట్సాప్ గ్రూప్ ప్రధాన అడ్మిన్.. ‘అడ్మిన్’ను వదలుకోవడంతో మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌కు చెందిన జునైద్ మేవ్ (21) అడ్మిన్‌గా మారాడు. కేసు నమోదైనపుడు జునైద్ అడ్మిన్‌గా ఉండటంతో శిక్ష పడి 5 నెలలుగా శిక్ష అనుభవిస్తున్నాడు. ‘రాజ్గర్ జిల్లా తలెన్కు చెందిన ఓ 17 ఏళ్ల బాలుడు ఈ ఏడాది ఫిబ్రవరి 14న అభ్యంతరకర మెసేజ్ గ్రూప్‌లో ఫార్వర్డ్ చేశాడు. దీనిపై కొందరు ఫిర్యాదు చేయగా ఆ బాలుడిపై, గ్రూప్ అడ్మిన్ రాజా గుర్జార్‌పై పోలీసు కేసు నమోదైంది. కేసు సంగతి తెల్సి వెంటనే గ్రూప్‌ను గుర్జార్ వదిలేశాడు. వరుసక్రమంలో మరో ఇద్దరు అడ్మిన్లుగా మారినా వారు కూడా గ్రూప్‌ను వదిలేశారు. చివరగా జునైద్ అడ్మిన్‌గా మారడంతో అతనిపై కేసు నమోదైంది. ప్రస్తుతం బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న జునైద్.. ఐటీఐలో శిక్షణ కూడా పొందుతున్నాడు. దేశద్రోహం కింద కేసు నమోదవడంతో హైకోర్టు బెయిల్ నిరాకరించిందని అతని సోదరుడు ఫక్రుద్దీన్ చెప్పారు. -
వాట్సప్ అడ్మిన్లకు హెచ్చరిక
సాక్షి, సిటీబ్యూరో : వాట్సప్‌లో ఏదో ఓ గ్రూప్ క్రియేట్ చేసో, సభ్యుల కోరిక మేరకో, ‘బాధ్యతలు’ అప్పగించడంతోనో అడ్మిన్‌గా మారారా? జర జాగ్రత్త çసుమా.! ఏమాత్రం తేడా వచ్చినా కటకటాల్లోకి వెళ్లాల్సిందే. ఆ గ్రూప్‌లో సర్క్యులేట్ అయ్యే అభ్యంతరకర సందేశాలు, వీడియోలకు మీరే పూర్తి బాధ్యులవుతారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజ్యమేలుతున్న వదంతుల నేపథ్యంలో ఈ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఇలాంటి గ్రూపులకు అడ్మిన్లుగా ఉన్నవారూ బాధ్యులుగా మారతారని, వారిపైనా చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. ఇప్పటి వరకు సరదాకు, సమాచార మార్పిడికి, యోగక్షేమాలు కనుక్కోవడానికి పరిమితమైన సోషల్ మీడియా ఒక్కసారిగా వివాదాస్పదమైంది. పక్షం రోజులుగా దీని కేంద్రంగా సాగుతున్న కిడ్నాపింగ్ గ్యాంగ్స్, దోపిడీ ముఠాల పుకార్లే ఇందుకు కారణం. వీటి కారణంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం, చేతులు దాటుతుండటంతో పోలీసు విభాగం నిఘా ముమ్మరం చేసింది. సోషల్ మీడియాలో ఎన్నో రకాలున్నా వాట్సప్ ఓ ప్రభంజనంలా మారింది. యూజర్ ఫ్రెండ్లీ కావడంతో అత్యధికులు దీన్నే వినియోగిస్తున్నారు. కేవలం సంక్షిప్త సందేశాలు మాత్రమే కాకుండా నిర్ణీత ప్రమాణంలో ఉన్న వీడియోలు, ఆడియోలు సైతం పోస్ట్/షేర్ చేసుకునే అవకాశం దీనిలో ఉంది. అత్యధికులు వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ యాప్ అత్యంత కీలకంగా మారిపోయింది. ఎక్కడికక్కడ గ్రూపులు ఏర్పాటు... వాట్సప్ వినియోగదారులతో పాటు గ్రూపుల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది. ఒకే సందేశం/వీడియో/ఆడియోలను ఒకేసారి అనేక మందికి పంపడానికి, పరస్పర భావ మార్పిడికి ఎవరికి వారు వీటిని క్రియేట్ చేస్తున్నారు. స్నేహితులు, ఒకే ప్రాంతానికి చెందిన వారు, భావసారూప్యత ఉన్నవాళ్లు... ఇలా ఎవరికి వారు వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోపక్క పరిపాలనా సౌలభ్యం, త్వరితగతిన సమాచార మార్పిడి కోసం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలూ వాట్సప్ గ్రూపుల్ని క్రియేట్ చేస్తున్నాయి. వాట్సప్‌కు అడ్వాన్డŠస్ వెర్షన్ అయిన వాట్సప్ వెబ్ వచ్చిన తర్వాత వీటి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. అధికారిక కార్యకలాపాల కోసం ఏర్పాటవుతున్న గ్రూపులతో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా... ప్రైవేట్ గ్రూపులతోనే ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి. అత్యంత కీలకంగా అడ్మిన్... వాట్సప్‌లో ఏదైనా గ్రూప్‌ను క్రియేట్ చేయడం అనేది ఒకరి చేతిలో ఉంటుంది. సదరు గ్రూప్‌నకు అడ్మిన్‌గా బాధ్యతలు స్వీకరించే ఆ వ్యక్తి తన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారిలో ఎంపిక చేసుకున్న సభ్యులతో దీన్ని ఏర్పాటు చేస్తాడు. అవసరం, తనకు నమ్మకం ఉన్న, సత్సంబంధాలను బట్టి ఆ సభ్యుల్లో కొందరిని అడ్మిన్స్‌గా చేస్తూ యాడింగ్, రిమూవింగ్ అధికారాలు కల్పిస్తాడు. ఇలాంటి అడ్మిన్స్లో ఎవరైతే తొలుత గ్రూప్‌ను క్రియేట్ చేస్తారో (ప్రధాన అడ్మిన్)గా ఉండేవారే అత్యంత కీలకం. ఈ గ్రూపుల్లో కేవలం అడ్మిన్‌కు మాత్రమే కాకుండా అందులో ఉండే సభ్యులందరికీ షేరింగ్ చేసే సౌలభ్యం ఉంటుంది. దీనికి అడ్మిన్ అనుమతి, ప్రమేయం అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే చాటింగ్స్, పోస్టింగ్స్, షేరింగ్స్ అనేవి అడ్మిన్ అనుమతి, ప్రమేయం లేకుండానే సాగిపోతుంటాయి. కచ్చితంగా పర్యవేక్షణ ఉండాల్సిందే... ఓ వాట్సప్ గ్రూప్‌లో గరిష్టంగా 250 మంది సభ్యులు ఉన్నట్లే... ప్రతి సభ్యుడూ ఆ గ్రూప్‌తో పాటు మరికొన్నింటిలోనూ సభ్యుడిగా కొనసాగుతుంటాడు. ఫలితంగా ఓ గ్రూప్‌లో పోస్ట్ అయిన వీడియో క్షణాల్లో అనేక గ్రూపుల్లోకి వెళ్లిపోతుంది. పుకార్ల విషయంలో ఇలాంటి సదుపాయమే కొంపముంచుతోంది. ఈ నేపథ్యంలోనే సదరు గ్రూప్ అడ్మిన్ బాధ్యుడిగా మారతాడు. ఆ గ్రూప్‌లో జరుగుతున్న కార్యకలాపాలతో పాటు షేరింగ్ అవుతున్న అంశాలనూ అతడే పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎవరైనా అభ్యంతరకర పోస్టింగ్స్, షేరింగ్స్ చేస్తుంటే వారిని రిమూవ్ చేయాల్సిన బాధ్యత కూడా అడ్మిన్‌కు ఉంటుంది. అలా కాని పక్షంలో గ్రూప్ వల్ల ఏదైనా జరిగితే అడ్మిన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాటిని పోస్ట్, షేర్, ఫార్వర్డ్ చేసిన సభ్యుడు సైతం చర్యలకు బాధ్యుడు అవుతాడు. ‘ఫార్వార్డెడ్ ఏజ్ రిసీవ్డ్’, ‘ప్లీజ్ క్రాస్ చెక్’ అంటూ నోట్ పెట్టినంత మాత్రాన ఎలాంటి మినహాయింపులూ ఉండవు. ఆ గ్రూపు సభ్యుడు లేదా ఇతరులెవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే బాధ్యుడితో పాటు అడ్మిన్ పైనా కేసు తప్పదు. ఆధారాలు దొరికితే అరెస్టే... గడిచిన కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో... ప్రధానంగా వాట్సప్‌లో పుకార్లు పెరిగాయి. కిడ్నాపింగ్ ముఠాలు, దోపిడీ గ్యాంగులు వచ్చాయంటూ గ్రూపుల్లో ప్రచారం జరుగుతోంది. ఇది ఉద్రిక్తతలకు దారితీయడమే కాకుండా పరిస్థితులు చేతులు దాటేలా, అమాయకులు ఇబ్బందులు పాలయ్యేలా, ప్రజా జీవితానికి భంగం కలిగించేలా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రచారం చేయడం నేరం. ఇలాంటివి షేర్ చేసిన వారితో పాటు ఆయా గ్రూపుల అడ్మిన్లూ నేరం చేసినట్లే అవుతుంది. తాజా పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియాపై పూర్తి నిఘా ఉంచాం. బాధ్యుల్ని 24 గంటల్లోగా గుర్తించేస్తాం. సరైన ఆధారాలు చిక్కితే గ్రూప్ అడ్మిన్స్నూ అరెస్టులు చేస్తాం. – అంజనీకుమార్, నగర పోలీస్ కమిషనర్ -
గ్రూప్ భళి... అడ్మిన్ బలి - తేడా వస్తే..
గ్రూప్ భళి... అడ్మిన్ బలి - తేడా వస్తే..ల్లో అశ్లీల, అభ్యంతరకర వ్యాఖ్యలు, వీడియోలు తెలిసీ తెలియక షేర్ చేస్తున్న ‘సోషల్ వినియోగదారులు’ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్‌దే పూర్తి బాధ్యత హద్దు దాటితే శిక్ష తప్పదు సిటీబ్యూరో: మహారాష్ట్రలోని మరాట్వాడ ప్రాంతానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను ముంబై పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అతడు చేసిన నేరం ఏమిటో తెలుసా? ‘అడ్మిన్’గా ఉండటమే. ఆ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో అభ్యంతరకరమైన ఓ సందేశం ప్రచారమైంది.గ్రూప్ సభ్యురాలిగా ఉన్న మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు పోస్ట్ చేసిన సభ్యుడితో పాటు గ్రూప్ అడ్మిన్నూ కటకటాల్లోకి పంపారు. వాట్సాప్ గ్రూప్‌లు ‘క్రియేట్’ చేస్తున్న వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ సంఘటన చెబుతోంది. విస్తరిస్తున్న వాట్సాప్... వాట్సాప్... సోషల్ మీడియాలో ఓ ప్రభంజనం. నెట్ సౌకర్యం ఉన్న ప్రతి ఫోన్లోనూ ఇదీ ఉంటోంది. కేవలం సంక్షిప్త సందేశాలు మాత్రమే కాకుండా నిర్ణీత పరిమాణంలో ఉన్న వాయిస్, వీడియో ఫైల్స్‌తో పాటు ఫొటోలను మార్పిడి చేసుకునే అవకాశం ఈ యాప్‌లో ఉంది. దీంతో వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు ఇటీవల కాలంలో గ్రూపులూ పెరుగుతున్నాయి. ఒక సందేశాన్నో, ఫొటో/వీడియోనో ఒకేసారి ఎక్కువ మందికి పంపడానికి ఈ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. వ్యక్తిగతం నుంచి అధికారికం వరకు... స్నేహితులు.. ఓ ప్రాంతానికి చెందిన వారు... ఒకే రకమైన ఆలోచనా ధోరణి కలిగిన వారు... ఇలా ఎవరికి వారు వ్యక్తిగతమైన వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోపక్క పరిపాలనా సౌలభ్యం, త్వరితగతిన సమాచార మార్పిడి కోసం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలూ అధికారిక వాట్సాప్ గ్రూప్‌లు అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఈ కారణాలతో పాటు ఇటీవల కాలంలో వాట్సాప్ వెబ్ అందుబాటులోకి వచ్చాక గ్రూపుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. గ్రూపులు ఇలా... వాట్సాప్‌లో ఓ గ్రూపును ఏర్పాటు చేయడం ఒకరి చేతిలోనే ఉంటుంది. గ్రూప్ క్రియేట్ చేయాలని భావించిన వ్యక్తి తన హ్యాండ్సెట్ ద్వారా దాన్ని ఏర్పాటు చేసి అడ్మినిస్ట్రేటర్ (అడ్మిన్)గా వ్యవహరిస్తాడు. ఈ అవకాశాన్ని గ్రూపులో ఉండే మరికొందరికీ ఇచ్చే సౌలభ్యం ప్రధాన అడ్మిన్‌కు ఉంటుంది. ఆ గ్రూపులో ఎవరిని చేర్చుకోవాలి? అనేది అడ్మిన్ల చేతిలో ఉంటుంది. ఫోన్లో నిక్షిప్తం చేసిన పేర్లలోని ఎవరినైనా గ్రూపులో చేర్చుకోవచ్చు, తొలగించవచ్చు. సభ్యులందరికీ షేరింగ్ సౌలభ్యం... ఓ గ్రూపులో సభ్యుడిగా ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ గ్రూప్‌లో సందేశం, ఫొటో, వీడియో, ఆడియోను షేర్ చేసే సౌలభ్యం ఉంటుంది. దీనికి అడ్మిన్ అనుమతి, వారి ప్రమేయం అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే చాటింగ్స్, పోస్టింగ్స్, షేరింగ్ అడ్మిన్‌కు తెలియకుండానే జరిగిపోతుంటాయి. వాటిని గ్రూప్‌లో చూసుకునే వరకు అడ్మిన్‌కు కూడా తెలిసే అవకాశం లేదు. అది నేరమే అడ్మిన్ అనుమతి... ప్రమేయం లేకుండా గ్రూపులోని సభ్యులు అభ్యంతరకర, అశ్లీల పోస్టింగ్, షేరింగ్ చేసినా అడ్మినిస్ట్రేటర్‌దే పూర్తి బాధ్యత. ఆ గ్రూపునకే చెందిన లేదా వేరే వ్యక్తులెవరైనా సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేస్తే కటకటాల్లోకి చేరాల్సిందేనని మర్చిపోకూడదు. ఈ చర్యలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) యాక్ట్ కింద నేరాలే అవుతాయి. నిబంధనలు తెలుసా...? వాట్సాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడే డిస్క్లైమర్ను అంగీకరిస్తాం. అందులోని నిబంధనల ప్రకారం వాట్సాప్ సభ్యుడు, అడ్మిన్ కొన్ని రకాలసందేశాలు, ఫొటోలు, వీడియోలు హోస్ట్ చేయడం, పోస్ట్ చేయడం, డిస్ప్లేలు... మార్పు చేర్పులు... అప్డేట్ చేయడం... షేర్ చేయడం నిషేధం. అవి ఏంటంటే... 1. అధికారికంగా మరో వ్యక్తికి చెందినవి. 2. ఇతరులకు ఇబ్బంది కలిగించే, అసభ్యకరమైన, అశ్లీలంతో కూడిన అభ్యంతరకమైనవి. 3. ఓ మతం, వర్గం, వర్ణం, కులం, జాతులను కించపరిచేవి. 4. రెండు వర్గాల మధ్య వైరుధ్యాలు రెచ్చగొట్టేవి. 5. మైనర్లకు హానికరమైనవిగా పరిగణించేవి. 6. శాంతిభ్రదతలు, ప్రజా జీవితానికి భంగం కలిగించేవి. 7. దేశ, జాతి, రాష్ట్ర సమగ్రతకు ముప్పుగా మారే పుకార్లు 8. కేసుల దర్యాప్తునకు ఆటంకంగా మారేవి. 9. వ్యక్తులు, గ్రూపులను టార్గెట్‌గా చేసుకుని బెదిరింపులు, హెచ్చరికలు. ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేస్తాం వాట్సాప్ గ్రూప్‌లో సర్క్యు లేట్ అవుతున్న అభ్యంతరకర, అశ్లీల, చట్ట వ్యతిరేక కంటెంట్ పై ప్రాథమిక సాక్ష్యాధారాలతో ఎవరు ఫిర్యాదు చేసినా ఐటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తాం. ఆ గ్రూప్‌లో దాన్ని షేర్ చేసిన వ్యక్తితో పాటు దాని అడ్మిన్ సైతం నిందితుడే అవుతాడు. ఇద్దరినీ అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంటుంది. - పి.రాజు, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్, సీసీఎస్ ప్రధాన అడ్మిన్‌దే పూర్తి బాధ్యత ఓ గ్రూప్‌లో సర్క్యులేట్ అయిన అభ్యంతరకర, అశ్లీల కంటెట్‌కు దాని అడ్మినే బాధ్యుడు. గ్రూపులో ఉన్న సభ్యుడిని నొప్పించేలా పోస్టింగ్స్ ఉన్నా అంతే. ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదవుతాయి. ఎంత మంది అడ్మిన్లు ఉన్నా... గ్రూప్ క్రియేట్ చేసిన ప్రధాన అడ్మిన్‌దే పూర్తి బాధ్యత. మిగిలిన వారికీ కొంతమేర బాధ్యత ఉంటుంది. - రామ్మోహన్ వేదాంతం ఐటీ యాక్ట్ న్యాయవాది, సైబర్ నిపుణుడు ఫేస్బుక్ తరహాలో ఉంటే మేలు మన ప్రమేయం లేకుండానే స్నేహితులు, ఇతరులు తమ వాట్సాప్ గ్రూప్లలోకి చేర్చుకోవడం అభ్యంతరకరం. గ్రూప్‌లలో పోస్టయ్యే సమాచారం, వీడియోలు, మెసేజ్‌లు, జోక్‌లు, కామెంట్స్ కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటున్నాయి. వీటికి గ్రూప్‌ను నిర్వహించే అడ్మిన్ బాధ్యత వహించాలనే విషయం చాలామందికి తెలియదు . కొన్నిసార్లు క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ఫేస్‌బుక్‌లా రిక్వెస్ట్ పంపడం... ఆమోదించడం తరహాలో వాట్సాప్ యాజమాన్యం కూడా స్పందించి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా నియమ నిబంధనలు రూపొందించాలి. - అల్లిపురం రాజశేఖర్‌రెడ్డి, ఎమ్డీ, పైసా వసూల్ డాట్‌కామ్ అనుమతి అవసరం వాట్సాప్ గ్రూప్‌లతో లాభనష్టాలు రెండూ ఉన్నాయి. ఒక మెసేజ్‌ను పలువురు స్నేహితులకు పంపించడం ఇబ్బందిగా ఉంటుంది. నెట్ నూ ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. ఒక గ్రూప్‌లో అయితే క్షణాల్లో అందరికీ సమాచారం పంపవచ్చు . ఇక మనకు తెలియకుండానే గ్రూప్‌లో చేర్చుకోవడం, అసభ్య మెసేజ్‌లు చూడాల్సిరావడం ఇబ్బందికరంగా ఉంటుంది. మనం గ్రూప్ నుంచి ‘లెఫ్ట్’ అయితే ఆ జాబితాలో మన నెంబర్ ఉంటుంది. వాట్సాప్ యాజమాన్యం దీనిపై దృష్టి పెట్టి గ్రూప్‌లో చేర్చుకునేటప్పుడు మన అనుమతి ఉండేలా మార్పులు చేస్తేమంచిది. -గిరీష్మ, విద్యార్థిని, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ -
ఛాలెంజింగ్‌గా ఉంది
కాకినాడ క్రైం :కోనసీమ, మెట్ట, మైదాన ప్రాంతాలతో వైవిధ్యానికి నెలవైన తూర్పు గోదావరి జిల్లాకు రావడం ఛాలెంజింగ్‌గా ఉందని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కరణం సత్యనారాయ ణ నుంచి సోమవారం ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లోనూ శాంతిభద్రతల పరిరక్షణకు పాటు పడతామన్నారు. చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారే కోనసీమలో అలాంటిది పునరావృతం కాకుండా చూస్తామన్నారు. రాష్ట్ర విభజనతో భద్రాచలం డివిజన్లోని ఆరు మండలాలు విలీనం కావడంతో జిల్లాపై మావోయిస్టుల ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఖమ్మం జిల్లా ఎస్పీ, ఓఎస్డీలతోనూ చర్చించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు సిబ్బంది అవసరమని, రిక్రూట్మెంట్ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. జిల్లా ఏజెన్సీలోని రంపచోడవరం, మారేడుమిల్లి, అడ్డతీగలతో పాటు మెట్ట ప్రాంతాల్లో గంజాయి సాగు, రవాణాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. రంపచోడవరం ఏఎస్పీతో దీనిపై ఇప్పటికే చర్చించిన ట్టు తెలిపారు. నకిలీ కరెన్సీ చలామణీని అరికడతాం.. బంగ్లాదేశ్, పాకిస్తాన్ల నుంచి నకిలీ కరెన్సీ రాకపై నిఘా మరింత పెంచుతామని, స్థానికంగా జిరాక్స్ తీసి దొంగనోట్లు చలామణీ చేసేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. పెట్రో కారిడార్, సెజ్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఆందోళనలను సామరస్యంగా పరిష్కరించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రాఫిక్, ఈవ్‌టీజింగ్ నిరోధంతో పా టు విజిబుల్ పోలీసింగ్‌కు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామన్నారు. అసాంఘిక శక్తుల ఆట కట్టించడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. స్టేషన్లలో సుహృద్భావ వాతావరణ ం ఉండేలా, ప్రతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసేలా చూస్తామని చెప్పారు. వివిధ శాఖల అధికారులు, ప్రజల సహకారంతో ముందు కు వెళ్తామన్నారు. జిల్లా 78వ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రవిప్రకాష్‌ను ఓ ఎస్డీ ప్రకాష్ జాదవ్, డీఎస్పీలు ఆర్.విజయభాస్కర రెడ్డి, ఎం.వీరారెడ్డి, వి.అరవింద్‌బాబు, బి.రవీంద్రనాథ్, సీఐలు, ఎస్సైలు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.