కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న మధు
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): నలుగురికి మంచి చేయాలని పరితపించిన ఓ ట్రావెల్ నిర్వాహకుడు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి, అందులో సభ్యులకు ఆపద వస్తే ఆదుకునే నిర్వాహకుడు.. గ్రూపులో తగాదాలతో మనస్తాపం చెంది ఈ దారుణానికి పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన కేజీహెచ్‌లో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి. పెందుర్తి మండలం చినముషిడివాడకు చెందిన మహాపాత్రుని మధు స్థానికంగా ఓ క్యాబ్(ట్రావెల్)ను నడుపుతున్నాడు. ట్రావెల్ యజమానులు, కార్ల డ్రైవర్ల కష్టాన్ని గుర్తించి వారికి ఏదోలా సేవ చేయాలన్న దృక్పథంతో కార్ ప్రొగ్రెసివ్ ట్రేడ్ యూనియన్(సీపీటీయూ) పేరిట వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ఎక్కడైనా కారు ప్రమాదానికి గురైనా.. ఆ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు నష్టం కల్గినా.. వెంటనే ఆ ఏరియా కారు డ్రైవర్లు, ట్రావెల్స్‌కు ఫోన్ చేసి సాయం చేసేలా అప్రమత్తం చేసేవాడు.
అతను చేస్తున్న సేవలకు అనతి కాలంలోనే స్పందన వచ్చింది. మూడు గ్రూపుల్లో 250 మంది చొప్పున సభ్యులుగా చేరారు. ప్రస్తుతం మూడు వాట్సప్ గ్రూపులుగా ఈ సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిం చింది. ఎంతో మందికి ఉపయుక్తంగా మారింది. అయితే గ్రూపు బాగా నడుస్తోందన్న సమయంలో ఓ ఐదుగురు సభ్యులు చిచ్చు పెట్టారు. చేస్తున్న సేవలకు ప్రతి గ్రూపు సభ్యుడి నుంచి డబ్బులు వసూలు చేయాలని మధుపై ఒత్తిడి తెచ్చారు. అందుకు ఆయన నిరాకరించాడు. దీంతో వారు మధును తిట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారి మాటలు తట్టుకోలేక చినముషిడివాడలోని తన ఇంటి నుంచి మంగళవారం ఉదయం 9 గంటలకు బయటకు వెళ్లిపోయాడు. వెళ్లిపోతూ తన చావుకు కారణాలు వివరిస్తూ గ్రూప్‌లో వాయిస్ మెసేజ్ పెట్టాడు. దీంతో గ్రూప్ సభ్యులు అతనిని వెతకడం ప్రారంభించారు. పెందుర్తి వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద అపస్మారక స్థితిలో ఉన్న మధును కొందరు గుర్తించారు. 108 వాహనం ద్వారా కేజీహెచ్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం కేజీహెచ్ భావనగర్ వార్డులో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment