ఛాలెంజింగ్‌గా ఉంది
కాకినాడ క్రైం :కోనసీమ, మెట్ట, మైదాన ప్రాంతాలతో వైవిధ్యానికి నెలవైన తూర్పు గోదావరి జిల్లాకు రావడం ఛాలెంజింగ్‌గా ఉందని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కరణం సత్యనారాయ ణ నుంచి సోమవారం ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లోనూ శాంతిభద్రతల పరిరక్షణకు పాటు పడతామన్నారు. చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారే కోనసీమలో అలాంటిది పునరావృతం కాకుండా చూస్తామన్నారు. రాష్ట్ర విభజనతో భద్రాచలం డివిజన్‌లోని ఆరు మండలాలు విలీనం కావడంతో జిల్లాపై మావోయిస్టుల ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు.
ఖమ్మం జిల్లా ఎస్పీ, ఓఎస్‌డీలతోనూ చర్చించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు సిబ్బంది అవసరమని, రిక్రూట్‌మెంట్ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. జిల్లా ఏజెన్సీలోని రంపచోడవరం, మారేడుమిల్లి, అడ్డతీగలతో పాటు మెట్ట ప్రాంతాల్లో గంజాయి సాగు, రవాణాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. రంపచోడవరం ఏఎస్పీతో దీనిపై ఇప్పటికే చర్చించిన ట్టు తెలిపారు.
నకిలీ కరెన్సీ చలామణీని అరికడతాం..
బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల నుంచి నకిలీ కరెన్సీ రాకపై నిఘా మరింత పెంచుతామని, స్థానికంగా జిరాక్స్ తీసి దొంగనోట్లు చలామణీ చేసేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. పెట్రో కారిడార్, సెజ్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఆందోళనలను సామరస్యంగా పరిష్కరించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రాఫిక్, ఈవ్‌టీజింగ్ నిరోధంతో పా టు విజిబుల్ పోలీసింగ్‌కు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామన్నారు.
అసాంఘిక శక్తుల ఆట కట్టించడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. స్టేషన్లలో సుహృద్భావ వాతావరణ ం ఉండేలా, ప్రతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసేలా చూస్తామని చెప్పారు. వివిధ శాఖల అధికారులు, ప్రజల సహకారంతో ముందు కు వెళ్తామన్నారు. జిల్లా 78వ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రవిప్రకాష్‌ను ఓ ఎస్‌డీ ప్రకాష్ జాదవ్, డీఎస్పీలు ఆర్.విజయభాస్కర రెడ్డి, ఎం.వీరారెడ్డి, వి.అరవింద్‌బాబు, బి.రవీంద్రనాథ్, సీఐలు, ఎస్సైలు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.