మోగిన ఉప ఎన్నిక నగారా ! | Election Schedule Has Released For Huzurnagar Bi Election | Sakshi
Sakshi News home page

మోగిన ఉప ఎన్నిక నగారా !

Published Sun, Sep 22 2019 1:08 PM | Last Updated on Sun, Sep 22 2019 1:10 PM

Election Schedule Has Released For Huzurnagar Bi Election  - Sakshi

సాక్షి,సూర్యాపేట : జిల్లాలోని హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదుపరి జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో నల్లగొం డ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వా త ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్ని అనివార్యమైంది. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు శని వారం షెడ్యూల్‌ విడుదల చేసింది.

దేశ వ్యాప్తంగా 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనుండగా తెలంగాణలో ఏకైక స్థానం హుజూర్‌నగర్‌కు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సిట్టింగ్‌ స్థానం మళ్లీ దక్కించుకోవాలని కాంగ్రెస్, గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతున్నాయి. గతంలో ఈ స్థానం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన ఎంపీగా పోటీ చేసి ఈ నియోజకవర్గం నుంచి 11 వేల ఓట్లపై చిలుకు మెజార్టీ సాధించారు.

ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి పద్మావతిని బరిలోకి దింపారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్‌పై శానంపూడి సైదిరెడ్డి ఈ స్థానంలో పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మళ్లీ అయన్నే అభ్యర్థిగా ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. దీంతో వచ్చే నెల 21న నియోజకవర్గ ఓటర్లు ఎవరికి పట్టం కడతారోనని రాష్ట్ర మొత్తం ఈ నియోజకవర్గం వైపే చూస్తోంది. ఈ ఎన్నిక ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు బిగ్‌ ఫైట్‌గా మారింది. 

షెడ్యూల్‌ ఇలా..
ఈనెల 23న ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్‌ను స్వీకరించనున్నారు.అక్టోబర్‌ 1న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్‌ 3 వరకు ఉపసంహరణ జరగనుంది. అక్టోబర్‌ 21న పోలింగ్‌ నిర్వహించి.. 24వ తేదీన కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నోటిఫికేషన్‌లో నామినేషన్ల ఉపసంహరణ, ఎన్నికల నియామవళికి సంబంధించిన అంశాలన్ని వివరంగా పేర్కొననున్నారు. షెడ్యూల్‌ రావడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాల్లో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులును ప్రకటించడంతో ఈ స్థానంలో పోటీ చేసే ందుకు బీజేపీ, వామపక్షాలు కూడా సై అంటున్నాయి. మూడు, నాలుగు రోజుల్లో తమ అ భ్యర్థులను ఆపార్టీలు ప్రకటించే అవకాశం ఉంది. 

కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి
హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతిని ఆపార్టీ ఇప్పటికే ప్రకటించింది. గతంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడ నియోజకవర్గం నుంచి 1999, 2004లో, హుజూర్‌నగర్‌ నుంచి 2009, 2014, 2018లో మొత్తం ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలు పొందారు. 2018 డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉత్తమ్‌ 7 వేల పైచిలుకు ఓట్ల మె జార్టీతో టీఆర్‌ఎస్‌పై గెలుపొందారు. అదేవిధంగా ఆయన ఎంపీగా పోటీ చేసి విజయం సాధించడంలో ఈ నియోజకవర్గంలో వచ్చిన ఓట్ల మెజార్టీనే కీలకమైంది. 11 వేల పైగా ఓట్ల మెజార్టీ ఈ నియోజకవర్గంలో ఆయనకు దక్కిం ది. అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్‌ ఎన్నికల్లో నియోజకవర్గ ఓటర్లు తమ వైపే ఉన్నారని ఖ చ్చితంగా ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థే విజయం సాధిస్తుందనే ధీమాతో కాంగ్రెస్‌ ఉంది.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా శానంపూడి..
గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన టీఆర్‌ఎస్‌ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే భావనతో గతంలో ఓటమి పొందిన శానంపూడి సైదిరెడ్డికే మరో అవకాశం కల్పించారు. ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైన కొద్ది గంటల్లోనే ఆయన్ను పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. షెడ్యూల్‌ విడుదలైన వెంటనే సీఎం ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జోరుగా పార్టీలో చేరికలు జరిగాయని, ఈ సారి విజయం తమదేనని టీఆర్‌ఎస్‌ ధీమా వ్యక్తంచేస్తోంది. విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హైదరాబాద్‌లో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించుకొని జిల్లాలో క్లీన్‌స్వీప్‌ చేయడం తథ్యమన్నారు. సైదిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం, ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు బాణా సంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశాయి. 

నేటి నుంచి ఎన్నికల కోడ్‌ అమలు..
షెడ్యూల్‌ విడుదల కావడంతో సూర్యాపేట జిల్లావ్యాప్తంగా నేటినుంచి ఎన్నికల కోడ్‌ అమలులోకి రానున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ ప్రకటించారు. ఈనెల 23న నోటిఫికేషన్‌ విడుదల కానుండడంతో నేటి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రానున్నట్లు తెలిపారు. 2019 జనవరి 1 నాటికి ఓటర్లజాబితా ప్రకారం ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మంత్రులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనరాదని, జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలు చేపట్టరాదని తెలిపారు. హుజూర్‌నగర్‌ ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతంలో ఉన్నందున పటిష్ట బందోబస్తు చర్యలు చేపడతామని, మద్యం, డబ్బు సరఫరాపై నిఘా ఉంచనున్నామని తెలిపారు. సి విజిల్‌ యాప్‌ ద్వారా ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. 

హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ఓటర్లు..
హుజూర్‌నగర్‌ నియోజకవర్గ వ్యాప్తంగా గత ఎన్నికల్లో 302 పోలింగ్‌ కేంద్రాలు కేటాయించారు. నియోజకవర్గంలో 2లక్షల 35వేల 308 మంది ఓటర్లుండగా లక్ష 15వేల 626 మంది పురుషులు, లక్ష 19వేల 682 మంది స్త్రీలున్నారు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement