సాక్షి, హైదరాబాద్: ‘‘పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే బీఆర్‌ఎస్ నేతలు భయపడుతున్నారు. ఇక, బీఆర్‌ఎస్ పని అయిపోయినట్టే’’ అంటూ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వాయిస్ రికార్డ్ వైరల్‌గా మారింది.
హుజూర్‌నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఇటీవలే బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా నేరేడుచర్ల ముఖ్య కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇక, ఈ టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డ్ బయటకు వచ్చింది. ఈ సందర్బంగా సైదిరెడ్డి కామెంట్స్ ఇలా ఉన్నాయి.. ‘తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది. బీఆర్‌ఎస్ పరిస్థితి అర్థం కావడం లేదు. పార్లమెంటుకు పోటీ చేయాలంటే ఆ పార్టీ నేతలు చాలామంది భయపడుతున్నారు. ఢిల్లీకి రావాలని బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. పార్టీలో చేరాలని కోరుతున్నారు. బీజేపీ చేరితే పార్లమెంట్ టికెట్ నీకే ఖరారవుతుందన్నారు. నేను ఎవరితో చెప్పలేదని, కార్యకర్తలతో మాట్లాడాలని చెప్పినా వారు వినిపించుకోలేదు.
అమిత్ షా ఆధ్వర్యంలో ఇప్పుడే ఇది పూర్తవుతుంది. ఇప్పుడు నువ్వు కండువా కప్పుకోకపోతే రాష్ట్రంలో బీజేపీ పరువు పోతుందని ఒత్తిడి తెచ్చారు. మీరంతా నా వెంటే ఉంటారు, నన్ను అర్థం చేసుకుంటారని నేను పార్టీ మారాల్సి వచ్చింది. మీకు తెలుసు నేను బీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు బీఆర్‌ఎస్ పరిస్థితి ఏంటి అనేది. ఒక్క సర్పంచ్ లేడు. నేను వచ్చాకనే 120 సర్పంచ్‌లు, 17 పీఏసీఎస్‌లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు గెలిపించుకున్నాం. యువతకు ఏమీ చేయలేకపోయానని బాధ ఉంది.
ఇప్పుడు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉంది. మళ్లీ మోదీనే వస్తాడు. అప్పుడు మనం యూత్‌కు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలు తీసుకురావచ్చు. ఇన్నాళ్ల చరిత్రలో ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్న మోదీలాంటి నాయకుడు లేడు. ఒక్క స్కాం లేదు. ఆయనకు కుటుంబం లేదు. దేశమే ఆయనకు కుటుంబం. ఆయన సపోర్టు ఉంటే మనకు మంచి జరుగుతుందనే ఆలోచనలో ఉన్నాను. వాళ్లు నన్ను కావాలని కోరుకోవడం నాకు మంచిదే అవుతుంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని దింపాలని కాంగ్రెస్ పార్టీ వాళ్లే కోరుకుంటున్నారు. అప్పుడు బీఆర్‌ఎస్ పార్టీ నేతలే వెళ్లి సీఎం రేవంత్‌కు సహాయం చేసే అవకాశం ఉంది. బీజేపీలోకి నేను ఒక్కడినే వెళ్లి ఏంచేస్తాను. నాతోపాటు మీరు కూడా ఉంటే ఏదైనా చేయవచ్చు. బీజేపీలో చేరుతున్నట్టు చెప్పకపోవడం తప్పే, రాష్ట్రంలో టీడీపీ ఖతమైంది. బీఆర్‌ఎస్ పరిస్థితి అర్థం కావడం లేదు. బీజేపీకి 10 నుంచి 12 సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మారకపోతే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అందరూ నా వెంట వస్తారని ఆశిస్తున్న. రెండు మూడు రోజుల్లో హుజూర్‌నగర్‌కు వచ్చి మీతో మీటింగ్‌లో మాట్లాడతాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment