సిట్టింగ్ స్థానం నిలుపుకునేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నం
ఈసారైనా బోణీ కొట్టాలని బీఆర్‌ఎస్, బీజేపీ
సాగునీరే ప్రధానాస్త్రం... రైతులే నిర్ణేతలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ జిల్లా. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలుకొని సాగునీటి కోసం బ్యాలెట్ యుద్ధం, తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంత్‌చారి ఇలా.. ఎందులో చూసినా నల్లగొండ జిల్లాది ప్రత్యేకస్థానం. 1940లోనే తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తే, 1952 తర్వాత జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ జిల్లా నుంచి ఎన్నికైన రావి నారాయణరెడ్డి దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొంది పార్లమెంట్ భవనాన్నే ప్రారంభించారు.
అలాంటి నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో 1952 నుంచి 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 7 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, ఆరుసార్లు కమ్యూనిస్టు పార్టీ, రెండుసార్లు టీడీపీ, ఒకసారి తెలంగాణ ప్రజాసమితి, పీడీఎఫ్ పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు రావి నారాయణరెడ్డి, బొమ్మగాని ధర్మబిక్షం నల్లగొండ నుంచే ప్రాతినిధ్యం వహించగా, భీంరెడ్డి నర్సింహారెడ్డి రద్దయిన మిర్యాలగూడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అదే నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచిన సూదిని జైపాల్‌రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు. కేంద్రమంత్రి కూడా అయ్యారు.
సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్
ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న నల్లగొండపై క్రమంగా కాంగ్రెస్ పైచేయి సాధించింది. గత మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీనే నల్లగొండలో గెలుపొందింది. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో, తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 2014, 2019లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ ఎంపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కుందూరు రఘువీర్‌రెడ్డిని గెలిపించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది.
నాలుగోసారి కూడా తామే నల్లగొండలో పాగా వేసే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తుండగా, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలనలో చేపట్టిన కార్యక్రమాలు, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పక్కన పడేసిందంటూ విమర్శిస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.
బోణీ కొట్టేందుకు బీఆర్‌ఎస్
బీఆర్‌ఎస్ పార్టీ రెండుసార్లు రాష్ట్రంలో అధికారంలో ఉంది. అయినా 2014, 2019 ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేకపోయింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించినా, ఆ తర్వాత నాలుగు నెలలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అడ్డు కోలేకపోయింది. ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్య ర్థులే విజయం సాధించారు. అదే తరహాలో ప్రస్తుత ఎన్నికల్లో నల్లగొండ బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుస్తారన్న ధీమాతో ముందుకు సాగుతోంది.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని 13 పథ కాల్లో కొన్ని కూడా అమలు చేయడం లేదంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండలో భారీ సభ నిర్వహించడం, ఆ తర్వాత తుంగతుర్తి, సూర్యాపేట నియోజక వర్గాల్లోనూ ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు. ఇటీవల మిర్యాలగూడ, సూర్యాపేటలో బస్సు యాత్ర నిర్వహించారు. జిల్లా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నీ తానై ఈ ఎన్నికల్లో వ్యవహరిస్తున్నారు.
మోదీ చరిష్మా, పాలకుల వైఫల్యాలే గెలిపిస్తాయంటున్న బీజేపీ
నల్లగొండ పార్లమెంట్ స్థానం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి విజయం సాధించలేదు. అప్పట్లో ఓరుగంటి రాములు ఎంపీగా పోటీ చేసి గట్టిపోటీ ఇచ్చారు. ఆ తర్వాత ఇంద్రసేనారెడ్డి లాంటి పెద్ద నాయకులు పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. ప్రస్తుతం దేశంలో మోదీ చరిష్మా కొనసాగుతోంది. రామమందిర నిర్మాణం చేపట్టడం, అక్కడ తలంబ్రాల బియ్యం ఇంటింటికి పంపిణీ చేయడం హిందువుల్లో బీజేపీ వైపు మళ్లారన్న ధీమాతో బీజేపీ ఉంది.
ప్రధానంగా యువత అంతా మోదీ ఆకర్షణలో ఉన్నారని, ఆ మోదీ చరి ష్మాతోనే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విజ యం సాధించాలన్న ఉద్దేశంతో బీజేపీ ముందుకు సాగుతోంది. ప్రధానంగా గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం వంద రోజుల పాలనలో వైఫల్యాలను ప్రచార అస్త్రాలుగా చేసుకొని, కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈనెల 6వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నల్లగొండలో ప్రచారం చేయబోతున్నారు.
ముగ్గురూ కొత్త వారే..
నల్లగొండ ఎంపీ సెగ్మెంట్‌లో ఈసారి ముగ్గురు కొత్త అభ్యర్థులే బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. ఆయన తండ్రి, మాజీ మంత్రి జానారెడ్డి అండదండలతోనే రాజకీయాల్లోకి వచ్చారు. బీఆర్‌ఎస్ కూడా కొత్త అభ్యర్థినే పోటీలోకి దింపింది. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చింది. ఈయన కూడా ఎక్కడా పోటీ చేయలేదు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి బరిలో ఉన్నారు. ఆయన 2018లో హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరపున అదే సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ప్రభావితం చేసే అంశాలు
∗ రైతులు, సాగునీరు, ప్రాజెక్టులే అన్ని పార్టీలకు ప్రధాన ప్రచార అస్త్రాలు
∗ ఎంపీ సెగ్మెంట్‌లో 7 లక్షల మంది రైతులు ఉన్నారు. వారి ఓట్లే కీలకం
∗ నాగార్జునసాగర్ ప్రాజెక్టు కేఆర్‌ఎంబీకి అప్పగింతపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పరస్పర విమర్శలు
∗ బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం పూర్తి చేయకపోవడం
∗ నెల్లికల్లు లిఫ్ట్, బ్రాహ్మణవెల్లెంల, డిండి తదితర పెండింగ్ ప్రాజెక్టులు
2019 ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు లభించిన ఓట్లు
నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్) 5,26,028 (44.73 శాతం)
వేమిరెడ్డి నర్సింహారెడ్డి (టీఆర్‌ఎస్) 5,00,346 (42.55 శాతం)
గార్లపాటి జితేంద్రకుమార్ (బీజేపీ) 52,709 (4.48 శాతం)
అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారీగా ఓటర్ల వివరాలు ఇలా..
నియోజకవర్గం పురుషులు స్త్రీలు
దేవరకొండ(ఎస్టీ) 1,31,659 1,30,392
నాగార్జునసాగర్ 1,15,710 1,20,464
మిర్యాలగూడ 1,15,543 1,20,299
హుజూర్‌నగర్ 1,21,667 1,29,164
కోదాడ 1,19,068 1,25,878
సూర్యాపేట 1,18,770 1,24,893
నల్లగొండ 1,21,079 1,27,766
మొత్తం 8,43,496 8,78,856
Comments
Please login to add a commentAdd a comment