మరోసారి కూడా సీఎం రేవంత్‌రెడ్డే
మాలో గ్రూపులు లేవు.. ఏక్‌నాథ్‌షిండేలు లేరు
రాబోయే పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం
హరీశ్‌రావు, మహేశ్వర్‌రెడ్డివి విజ్ఞత లేని మాటలు
బీఆర్‌ఎస్, బీజేపీల పనైపోయింది
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు
రామగిరి (నల్లగొండ): తెలంగాణలో రాబోయే పదేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ పారీ్టలో గ్రూపుల్లేవనీ, ఏక్‌నాథ్ షిండేలూ లేరని వ్యాఖ్యానించారు. రంజాన్ పండుగ సందర్భంగా గురువారం నల్లగొండ పట్టణంలోని ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనల సందర్భంగా మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డితో కలసి మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. ఎవరెన్ని మాటలు చెప్పినా రేవంత్‌రెడ్డి ఇంకోసారి సీఎంగా కొనసాగుతారన్నారు.
2028 అసెంబ్లీ ఎన్నికల్లో 125 సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఐదు గ్రూపులు ఉన్నాయంటూ హరీశ్‌రావు, మహేశ్వర్‌రెడ్డి విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో సీనియర్ నాయకుల సలహాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కటిగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు.
ఇంకోసారి అలా మాట్లాడొద్దు
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విషయాల గురించి కానీ, గ్రూపులు ఉన్నాయని కానీ ఇంకోసారి మాట్లాడొద్దని హరీశ్‌రావు, మహేశ్వర్‌రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. అలానే అకారణ విషయాల్లో తన పేరు ప్రస్తావించొద్దని సూచించారు. ప్రభుత్వాన్ని పడగొడతామని చెబుతున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌లు లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు అయినా గెలవాలని సవాల్ విసిరారు.
షిండేల సృష్టి బీజేపీ పనే
కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండేలు ఉన్నారని మహేశ్వర్‌రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందనీ... మహారాష్ట్రలో అధికారం కోసం ఏక్‌నాథ్ షిండేలను సృష్టించిన ఘనత బీజేపీదేనని ఆయన నిందించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను దించి కిషన్‌రెడ్డిని ఎందుకు మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో కులమతాల మధ్య ఘర్షణలు పెట్టి 370 నుంచి 400 ఎంపీ సీట్లు గెలవాలని బీజేపీ కలలు కంటోందని ఆయన ఎద్దేవా చేశారు. నల్లగొండ ఎంపీగా కుందూరు రఘువీర్‌రెడ్డిని భారీ మెజారీ్టతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment