సమావేశంలో సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీ, ఉత్తమ్, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, వీహెచ్, జానారెడ్డి, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, అంజన్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండలో బీఆర్‌ఎస్‌నిర్వహించనున్న బహిరంగ సభకు పోటీగా 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. గాంధీ భవన్‌లో మంగళవారం ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ మేరకు ప్రతిపాదించగా అందుకు సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని విశ్వసనీయంగా తెలియవచ్చింది. సభకు ప్రియాంక గాం«దీని ఆహ్వనించడం ద్వారా బీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టాలని, సభను విజయవంతం చేసే బాధ్యత తాను తీసుకుంటానని కోమటిరెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. ప్రియాంక సభలోనే మరో రెండు గ్యారంటీలైన గృహజ్యోతి కింద 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్‌సిలిండర్‌పథకాలను ప్రకటించాలని నిర్ణయించారని తెలిసింది.
నేటి మధ్యాహ్నంలోగా ఎంపీ అభ్యర్థుల షార్ట్‌లిస్ట్..
రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒకరి నుంచి ముగ్గురు ఆశావహుల పేర్లను ఎంపిక చేసి ఏఐసీసీకి పంపాలని ఎన్నికల కమిటీ నిర్ణయించింది. లోక్‌సభ అభ్యర్థిత్వాల కోసం వచ్చిన 306 దరఖాస్తులను పరిశీలించింది. వాటిలో సామాజిక న్యాయం, గెలుపు అవకాశాల ప్రాతిపదికన ఒక్కో నియోజకవర్గం నుంచి ఒకరి నుంచి ముగ్గురు పేర్లను టిక్ పెట్టనుంది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీకి పీఈసీ సభ్యులు ఎంపిక చేసిన అభ్యర్థుల లిస్ట్‌ను సీల్డ్ కవర్‌లో సమర్పించనున్నారు.
టికెట్ల ఖరారు ఎజెండాగా మరోసారి ఈ నెల 15న భేటీ కావాలని ఎన్నికల కమిటీ నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీశ్ చౌదరి, సభ్యులు జిగ్నేశ్ మేవానీ, విశ్వజిత్ కదం, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతోపాటు పీఈసీ సభ్యులు విష్ణునాథ్, రోహిత్ చౌదరి, వి.హనుమంతరావు, కె. జానారెడ్డి, జీవన్‌రెడ్డి, జె. గీతారెడ్డి, మధుయాష్కీగౌడ్, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, షబ్బీర్ అలీ, మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్, రేణుకాచౌదరి, బలరాం నాయక్, అంజన్‌కుమార్ యాదవ్, సునీతారావు, అజహరుద్దీన్, శివసేనారెడ్డి పాల్గొన్నారు.
సమావేశంలో చర్చకొచ్చిన అంశాలివే..
► సోనియాగాం«దీని ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీ చేయించాలని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కోరగా ఆమె ఎక్కడ పోటీ చేయాలన్నది ఏఐసీసీ అభీష్టమని, వారి నిర్ణయం ప్రకారం ముందుకు వెళదామని రేవంత్ సూచించారు.
► లోక్‌సభ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలతోపాటు సామాజికవర్గాల వారీగా ఓట్ల వివరాలను పేర్కొంటూ ఓ నివేదికను పీఈసీ సభ్యులకు అందజేశారు. ఇందులో బీసీలను ఇత రుల కేటగిరీలో చేర్చడంపై సీనియర్ నేత వీ హెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను ప్రత్యేక కేటగిరీ కింద పరిగణించాలని సూచించారు.
క్లీన్‌స్వీప్ చేయబోతున్నాం: ఉత్తమ్
లోకసభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేయబోతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పీఈసీ సమావేశం అనంతరం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ పదేళ్లు మోసం చేసినందుకు కేసీఆర్ ప్రజలకు ముందు క్షమాపణలు చెప్పాలన్నారు. సమావేశంలో సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీ, ఉత్తమ్, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, వీహెచ్, జానారెడ్డి, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, అంజన్ తదితరులు
Comments
Please login to add a commentAdd a comment