కేటీఆర్‌కు దమ్ముంటే, ఆరోపణలు రుజువు చేస్తే మేము దేనికైనా సిద్ధం
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్
సాక్షి, యాదాద్రి/సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో వ్యవసాయ మా ర్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమృత్ స్కీం టెండర్లలో రూ.8,888 వేల కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శించా రు. కేటీఆర్‌కు దమ్ముంటే, ఆరోపణలు రుజువు చేస్తే తాము దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారతుండడంతో అసహనానికి లోనై సీఎం రేవంత్‌రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే.. ‘ఖబడ్దార్ కేటీఆర్’అని కోమటిరెడ్డి హెచ్చరించారు.
ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు పార్టీ వదిలిపెట్టి పోతుండడంతో దిక్కుతోచని స్థితిలో కేటీఆర్ మాట్లాడుతున్నాడన్నారు. కేటీఆర్ పదేళ్లు మున్సిపల్ శాఖ మంత్రిగా పని చేసి రూ.7 లక్షల కోట్లు అప్పులు చేశాడని అందులో రూ.2 లక్షల కోట్లు ఆయనకు టుంబమే దోచుకుందని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ రోజురోజుకూ చచ్చిపోతోందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.
దోపిడీ దొంగలకు అలాగే కనిపిస్తుంది
హైదరాబాద్‌లో ఆదివారం సీఎల్పీ సమావేశం అనంతరం కూడా ఈ అంశంపై కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు లాంటి దోపిడీ దొంగలకు తమ ప్రభుత్వం కూడా అవినీతి చేసినట్లుగా కనిపిస్తుందేమోనని వ్యాఖ్యానించారు.
మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులలో కేటీఆర్ వేలకోట్ల రూపాయలు దోచుకున్నాడని ఆరోపించారు. సింగరేణి సంస్థలో కవిత ఏం చేసిందో త్వరలో బయటకు వస్తుందని అన్నారు. వారి దోపిడీ ప్రజలకు అర్థమైంది కనుకనే గత ఎన్నికల్లో ఓడించారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment