tummala nageswar rao
-
సీఎంపై నిరాధార ఆరోపణలు
సాక్షి, యాదాద్రి/సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో వ్యవసాయ మా ర్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమృత్ స్కీం టెండర్లలో రూ.8,888 వేల కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శించా రు. కేటీఆర్‌కు దమ్ముంటే, ఆరోపణలు రుజువు చేస్తే తాము దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారతుండడంతో అసహనానికి లోనై సీఎం రేవంత్‌రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే.. ‘ఖబడ్దార్ కేటీఆర్’అని కోమటిరెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు పార్టీ వదిలిపెట్టి పోతుండడంతో దిక్కుతోచని స్థితిలో కేటీఆర్ మాట్లాడుతున్నాడన్నారు. కేటీఆర్ పదేళ్లు మున్సిపల్ శాఖ మంత్రిగా పని చేసి రూ.7 లక్షల కోట్లు అప్పులు చేశాడని అందులో రూ.2 లక్షల కోట్లు ఆయనకు టుంబమే దోచుకుందని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకూ చచ్చిపోతోందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. దోపిడీ దొంగలకు అలాగే కనిపిస్తుంది హైదరాబాద్‌లో ఆదివారం సీఎల్పీ సమావేశం అనంతరం కూడా ఈ అంశంపై కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు లాంటి దోపిడీ దొంగలకు తమ ప్రభుత్వం కూడా అవినీతి చేసినట్లుగా కనిపిస్తుందేమోనని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులలో కేటీఆర్ వేలకోట్ల రూపాయలు దోచుకున్నాడని ఆరోపించారు. సింగరేణి సంస్థలో కవిత ఏం చేసిందో త్వరలో బయటకు వస్తుందని అన్నారు. వారి దోపిడీ ప్రజలకు అర్థమైంది కనుకనే గత ఎన్నికల్లో ఓడించారని చెప్పారు. -
రైతులకు అలర్ట్.. వారికి రుణమాఫీ కాదు: మంత్రి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రుణమాఫీపై రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. ఒక్క కుటుంబంలో నాలుగు ఖాతాలు ఉంటే నాలుగు అకౌంట్స్‌కు రుణమాఫీ జరుగుతుందని కామెంట్స్ చేశారు.కాగా, మంత్రి తుమ్మల శనివారం సచివాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆనాడు దివంగత వైఎస్సార్ ప్రభుత్వంలో రుణమాఫీ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా రుణమాఫీ జరుగుతోంది. ఆధార్, బ్యాంక్ అకౌంట్, ఆర్బీఐ తప్పిదాల వల్ల రుణమాఫీ రిజెక్ట్ అయితే 24 గంటల్లోనే వివరణ ఇస్తారు. రైతులు ఆందోళన చెందకండి. పాత పద్దతిలోనే రుణమాఫీ అమలు జరుగుతుంది.సాంకేతిక అంశాల కారణంగా ఇబ్బంది కలిగితే ప్రతీ బ్యాంక్ వద్ద అధికారులు అందుబాటులో ఉంటారు. ఒక్క కుటుంబంలో నాలుగు ఖాతాలు ఉంటే నాలుగు ఖాతాల్లో రుణమాఫీ జరగుతుంది. రుణమాఫీపై కొంత మంది కావాలనే రాజకీయం చేస్తున్నారు. వారి వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ మొత్తం సెప్టెంబర్ నెల పూర్తి అయ్యేలోపు రైతుల ఖాతాలోకి జమ అవుతాయి. మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఆధార్ సాంకేతిక సమస్య ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే బడాబాబులు, ప్రజాప్రతినిధులకు రుణమాఫీ కాదు. ఒకేరోజు 500 ఖాతాల్లో రుణం డబ్బులు జమ అయ్యాయి. వాటిపై విచారణ జరుగుతుంది. ఐదారు కోపరేటివ్ సొసైటీ బ్యాంకుల రుణాలపై అనుమానాలు ఉన్నాయి. అవి రెండు వేల ఖాతాలు ఉన్నాయి. 44లక్షల రైతుల ఖాతాలు, 25లక్షల కుటుంబాలు ఉన్నాయి. వీరందరికీ రుణమాఫీ జరుగుతుంది’ అని హామీ ఇచ్చారు. -
రేషన్‌కార్డు లేకపోయినా రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రేషన్‌కార్డు లేకపోయినా బ్యాంకుల నుంచి స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్న కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. రేషన్‌కార్డు కేవలం కుటుంబాన్ని నిర్ధారించేందుకు మాత్రమేనని చెప్పారు. ఈ నెల 18న సీఎం రేవంత్‌రెడ్డి 11.50 లక్షల మందికి సంబంధించిన లక్షలోపు రుణాలు దాదాపు రూ.6,800 కోట్లు ఒకేసారి మాఫీ చేస్తారని తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గత ప్రభుత్వ మార్గదర్శకాలే.. ‘రుణమాఫీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన మార్గదర్శకాలనే పాటించాలని నిర్ణయించాం. కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నారని నిర్ధారించేందుకు రేషన్‌కార్డు ఒక్కటే ప్రామాణికం. ఒక కుటుంబంలో ఎంతమంది వ్యవసాయ రుణాలు తీసుకున్నారో గుర్తించేందుకే ఇది తప్పనిసరి. రేషన్‌కార్డులు లేని రుణ ఖాతాలు 6 లక్షల వరకు ఉన్నాయి. ఇలాంటి రైతుల ఇళ్లకు అధికారులు వెళ్లి పరిశీలించిన తర్వాత అర్హులను ఎంపిక చేసి రుణమాఫీ చేస్తారు. రేషన్‌కార్డులు లేనివారికి రుణమాఫీ జరగదని చేస్తున్న ప్రచారం తప్పు.రేషన్‌కార్డు లేకున్నా రుణమాఫీ జరుగుతుంది..’అని తుమ్మల వివరణ ఇచ్చారు.ఆ రుణాలు మాఫీ కావు: ‘బ్యాంకుల్లో బంగారంతో పాటు పాస్‌బుక్ తాకట్టుపెట్టి తీసుకున్న స్వల్పకాలిక రుణాలను కూడా మాఫీ చేస్తాం. కానీ కేవలం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల మాఫీ కావు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని ఆదాయం పన్ను చెల్లించే బడా వ్యక్తులను గుర్తించేందుకు వినియోగించుకుంటాం. ఆదాయపు పన్ను చెల్లించే వ్యాపారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1,2,3 ఉద్యోగాల్లో ఉన్న అధికారులకు రుణమాఫీ ఉండదు. నెలకు లక్ష రూపాయలకు పైన వేతనం పొందేవారికి రుణమాఫీ వర్తించదు. ఇలాంటివి 17 వేల అకౌంట్లను గుర్తించాం. మహిళా గ్రూపు అప్పులకు మాఫీ వర్తించదు’అని మంత్రి చెప్పారు.రీషెడ్యూల్డ్ రుణాలు కూడా ..‘గత ప్రభుత్వంలో తొలి విడత లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు విడతల్లో చేశారు. రెండో విడత ప్రభుత్వంలో ఎన్నికల ముందు సగం మందికే మాఫీ చేశారు. వివిధ కారణాల వల్ల రూ.1,400 కోట్లు రైతుల ఖాతాల్లో పడకుండా వెనక్కు వచ్చాయి. రుణమాఫీ కాని రైతులు బ్యాంకుల్లోని తమ అప్పును రీషెడ్యూల్ చేసుకున్నారు.ఇలాంటి వారు కూడా ఈసారి రుణమాఫీ పొందనున్నారు. ఒక కుటుంబంలో ఎంతమంది రుణం తీసుకున్నా రూ.2 లక్షల వరకు మాఫీ అవుతాయి. రూ. 2 లక్షల కన్నా ఎక్కువ రుణాలు పొందితే కేవలం రూ.2 లక్షలు మాత్రమే మాఫీ అవుతుంది. అందులో మహిళలకు తొలి ప్రాధాన్యతనిస్తాం. రాష్ట్రంలో 39 లక్షల కుటుంబాలకు సంబంధించి 60 లక్షల రుణ ఖాతాలు ఉన్నాయి..’అని తుమ్మల తెలిపారు. -
రైతుభరోసా ఇచ్చేది అప్పుడే.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో పంట వేసే రైతులకే రైతు భరోసా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిక అని చెప్పుకొచ్చారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అలాగే, రాష్ట్రంలో పంట రుణ మాఫీ తర్వాతే రైతు భరోసా ప్రారంభిస్తామని క్లారిటీ ఇచ్చారు.కాగా, ఖమ్మంలోని వేంసూరులో తుమ్మల మీడియాతో మాట్లాడుతూ..‘సహకార స్ఫూర్తితో వచ్చిన సహకార సంఘాలు రైతులకు ఉపయోగపడటం లేదనే భావన ఉంది. సహకార బ్యాంక్‌లో రుణాలు తీసుకున్న వారికి మాత్రమే మెంబర్షిప్ ఉండాలి. ఓట్ల కోసం మెంబర్షిప్ ఇవ్వకూడదు. రైతులందరికీ రుణాలు ఇవ్వాలి. రైతులకు కావల్సిన అన్నింటినీ రివైజ్డ్ చేసి వడ్డీ లేని రుణాలు వచ్చేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన బాధ్యత రైతులే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆగస్టు 15వ తేదీ లోపు ముప్పై వేల కోట్లు రైతులకు ఇవ్వబోతున్నాం.రైతు భరోసాకు సంబంధించి రైతులు, కౌలు రైతులు మాట్లాడుకోవాలి. కౌలు తీసుకునే ముందు చర్చించుకోవాలి. పంట వేసే రైతులకే రైతు భరోసా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి కోరిక. గత ఐదేళ్లలో పంట వేయని భూములకు కూడా రైతు భరోసా వచ్చింది. దానివల్ల 25వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయి. 10, 15 రోజుల్లో రైతుల అభిప్రాయాలను తీసుకుని సబ్ కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక అందిస్తుంది.రుణమాఫీ పూర్తి అయిన తరువాత రైతు భరోసా ప్రారంభిస్తాం. రైతులందరికీ ప్రభుత్వమే ప్రీమియం కట్టేలా ముఖ్యమంత్రితో మాట్లాడాం. రైతు బీమా కూడా కొనసాగించాలి అని చెప్పాం. రైతులందరూ మంచి వ్యవసాయం చేయాలి. భవిష్యత్‌లో పామాయిల్‌ను ఎక్స్పోర్ట్ చేసే స్థితికి వెళ్లాలి. పామాయిల్‌కు రూ.17 వేలు మద్దతు ధర ఇవ్వాలని కేంద్రంతో కూడా మాట్లాడాం. పామాయిల్ రైతు నిలబడి వ్యవసాయం చేసేలా భరోసా కల్పిస్తాం అంటూ కామెంట్స్ చేశారు. -
వ్యవసాయానికి రూ.1.34 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది వ్యవసాయ రంగానికి రూ.1.34 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) నిర్ణయించింది. 2024–25 రాష్ట్ర స్థాయి రుణ ప్రణాళికను రూ.6.33 లక్షల కోట్లుగా ఖరారు చేసింది. ఇది గత ఏడాది కంటే 161 శాతం అధికం కావడం గమనార్హం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు బుధవారం ఈ రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎస్ఎల్బీసీ సమావేశంలో భట్టి మాట్లాడారు. బ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలని సూచించారు. బ్యాంకర్లకు పాజిటివ్ ధృక్పథం లేకపోతే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. బలహీన వర్గాలకు విరివిగా రుణాలు ఇస్తేనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో తెలంగాణ రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు. త్వరలో కొత్త విద్యుత్ పాలసీ వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో రాష్ట్రం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడనుందని భట్టి చెప్పారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా పెండింగ్‌లో పెట్టదని హామీ ఇచ్చారు. ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందని, రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ పాలసీని తీసుకురాబోతోందని తెలిపారు. సన్న చిన్నకారు రైతులపై చిన్నచూపు: మంత్రి తుమ్మల వ్యవసాయ రంగానికి సంబంధించి గత సంవత్సరం కంటే రూ.13 వేల కోట్ల రుణాలు అధికంగా మంజూరు చేసినప్పటికీ, సన్న చిన్నకారు రైతుల వాటా అనుకున్నంత మేర లేదని మంత్రి తుమ్మల అన్నారు. రాష్ట్రంలో 73.11 శాతం భూములు వారి చేతిలోనే ఉన్నాయని, వీరికి ఇచ్చే రుణాలను పెంచాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. రాష్ట్రంలో వివిధ బ్యాంకులకు చెందిన 6,415 శాఖల ద్వారా సేవలందిస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 1,874 మాత్రమే ఉన్నాయన్నారు. వాటిని పెంచాల్సిన అవసరం ఉందని తుమ్మల చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ పామ్ సాగుకు బ్యాంకుల నుండి ప్రోత్సాహం కరువైందన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు, ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్ కమల్ ప్రసాద్ పటా్నయక్, నాబార్డు సీజీఎం సుశీల్ చింతల, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేశ్‌కుమార్, ఎస్బీఐ జనరల్ మేనేజర్ దేబశిష్ మిత్ర తదితరులు పాల్గొన్నారు. రుణాల కేటాయింపులు ఇలా... – 2024–25 వార్షిక రుణ ప్రణాళిక మొత్తం రూ.6,33,777 కోట్లు – ప్రాధాన్య రంగాలకు అడ్వాన్సులు రూ.2,80,550 కోట్లు – వ్యవసాయ రంగానికి రూ.1,34,138 కోట్లు – వ్యవసాయ రంగ కేటాయింపుల్లో పంట రుణాలకు రూ.81,478 కోట్లు. (గతం కంటే 10.95% పెరుగుదల), వ్యవసాయ పెట్టుబడులకు రూ.28,222 కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాలకు రూ.5,197 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకు రూ.19,239 కోట్లు – సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు రూ.1,29,635 కోట్లు – గృహ రుణాలు రూ.10,768 కోట్లు – విద్యా రుణాలు రూ.2,706 కోట్లు – ఇతర రంగాలకు రూ.3,301 కోట్లు – 2023–24లో మొత్తం డిపాజిట్లు రూ.7,79,953 కోట్లు (గతం కంటే రూ. 96,547 కోట్లు వృద్ధి) – మొత్తం అడ్వాన్సులు రూ.9,79,058 కోట్లు (గతం కంటే రూ.1,65,162 కోట్ల వృద్ధి) – పంట రుణాలు రూ.64,940 కోట్లు. (లక్ష్యంలో 88.42% మంజూరు) – వ్యవసాయ పెట్టుబడి రుణాలు, అనుబంధ రంగాలు, కార్యక్రమాలకు రూ. 47,935 కోట్లు (లక్ష్యంలో 121.89% ఇచ్చారు) -
‘పంటల బీమా’కి రూ.3 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం రూ.3 వేల కోట్లు ఖర్చు చేయనుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్లడించారు. ప్రభుత్వమే రైతుల ప్రీమియాన్ని చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ వానాకాలం పంటల సీజన్ నుంచే అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ మేరకు బుధవారం మంత్రి తుమ్మల ఒక ప్రకటన జారీచేశారు. తడిచిన ధాన్యాన్ని సైతం తమ ప్రభుత్వం సేకరిస్తుందని వివరించారు. గతంతో పోలిస్తే ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు జిల్లాకొక ఐఏఎస్‌ను నియమించి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని వివరించారు. తరుగు, తాలు పేరుతో కోతలు లేవని స్పష్టం చేశారు. గతంలో ప్రతి క్వింటాకు 7 నుంచి 10 కేజీల వరకు తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ జరిగిందనీ, ఈ దఫా మిల్లర్ల దోపిడీపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో కోతలకు మిల్లర్లు స్వస్తి చెప్పారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ప్రతి కింటాపై రైతుకు రూ.150 నుంచి రూ.200 రూపాయల వరకు అదనపు లబ్ధి చేకూర్చామని తెలిపారు. పంట అమ్ముకున్న ఐదు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు చేరుతుందని మంత్రి స్పష్టం చేశారు. గతంలో 45 రోజులు పట్టేదని, దాంతో రైతు ఎంతో వడ్డీ నష్ట పోయేవాడని గుర్తు చేశారు. భవిష్యత్‌లో దొడ్డు వడ్లకు కూడా రూ.500 బోనస్ తెలంగాణలో సన్న వడ్ల సాగును పెంచేందుకు ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించిందని మంత్రి తుమ్మల పునరుద్ఘాటించారు. రైతులు నాట్లేసుకునే సమయం దగ్గర పడిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన ఈ స్కీంను ప్రవేశపెట్టామని తెలిపారు. భవిష్యత్‌లో దొడ్డు వడ్లకు కూడా ఈ స్కీం వర్తింపచేస్తామని హామీనిచ్చారు. రాష్ట్రంలో దొడ్డు వడ్లు తినడం చాలా తగ్గిపోయిందనీ, పేదలు కూడా పెద్దోళ్లు తినే సన్న బియ్యం తినాలనే సంకల్పంతో రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి అన్ని హామీలను పూర్తి చేసి తీరుతామనీ, లేకుంటే ఓట్లే అడగబోమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. -
గులాబీ గూటిలో విజయానందం
పాలేరు గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం సాక్షి, హైదరాబాద్: జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతుండటంతో అధికార టీఆర్ఎస్ శిబిరం హర్షాతిరేకాల్లో మునిగి తేలుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్, రెండేళ్లుగా ఏదో ఒక ఎన్నికల్లో తలమునకలవుతూనే వస్తోంది. విజయం సాధిస్తూనే ఉంది. 2014 ఎన్నికల్లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసి రెండింటా గెలిచారు. మెదక్‌కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. అందులో గెలుపుతో తెలంగాణలో ఉప ఎన్నికల విజయానికి టీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి మంత్రివర్గంలో చేరి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన వ రంగల్ లోక్‌సభ స్థానాన్నయితే ఏకంగా దేశంలో ఏడో అతి భారీ మెజారిటీతో కైవసం చేసుకుంది. ఇటీవల మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి మరణంతో ఆ సీటు ఖాళీ కాగా ఆ ఉప ఎన్నికనూ భారీ మెజారిటీతో నెగ్గింది. తాజాగా పాలేరు అసెంబ్లీ స్థానాన్నీ రికార్డు మెజారిటీతో చేజిక్కించుకుంది. అలా కాంగ్రెస్ చేతిలోని రెండు సీట్లను దక్కించుకుంది. ఇవేగాక గ్రేటర్ హైదరాబా ద్, గ్రేటర్ వ రంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట మున్సిపాలిటీ, అచ్చంపేట నగర పంచాయతీల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్దే విజయం. పరోక్ష ఎన్నికల్లోనూ... పరోక్ష ఎన్నికల్లోనూ అధికార పార్టీ హవానే కొనసాగుతూ వస్తోంది. శాసనమండలిలో రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక స్థానాన్ని కోల్పోయి ఒకటి మాత్రమే గెలుచుకున్న టీఆర్ఎస్, ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాలు గెలుచుకుంది. ఆ వెంటనే స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఖమ్మం, వరంగల్, కరీంనగర్ (2 స్థానాలు), ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ( ఒక స్థానం) గెలుచుకుంది. అలా మండలిలోనూ సంఖ్యా బలం పెంచుకుంది. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రం ఓడింది. ఫలించిన పాలేరు వ్యూహం! పాలేరు ఎన్నికను టీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో 4,000 ఓట్లు మాత్రమే తెచ్చుకున్న చరిత్రను తిరగరాయాని పట్టుదలతో పనిచేసింది. స్థానికంగా మంచి పట్టున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును అభ్యర్థిగా బరిలోకి దించింది. ఏకంగా పదిమంది మంత్రులను మోహరించింది. మండలాలు, గ్రామాలవారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా ప్రచారంలోకి దింపింది. ప్రతి ఓటరునూ నేరుగా కలిసేలా ప్రచారం చేసింది. సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల ప్రచారంతో హోరెత్తించింది. భారీ మెజారిటీ కైవసం చేసుకుంది. -
టీఆర్ఎస్ విజయోత్సవంలో ఘర్షణ
పోచారంలో ఉద్రిక్తత కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారంలో టీఆర్ఎస్కు చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గురువారం ఫలితాలు వెలువడిన అనంత రం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తుండగా అదే పార్టీకి చెందిన ఇరువర్గాల వారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఓ వ్యక్తి కత్తితో దాడికి దిగగా ఎంపీపీ సహా ఇరువర్గాలకు చెందిన 11 మందికి తీవ్ర గాయాల య్యాయి. పోలీసులు 144 సెక్షన్ విధించారు. పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించడంతో ఆ పార్టీకి చెందిన ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, అదే గ్రామానికి చెంది న మరో నాయకుడు రామసహాయం బాల కృష్ణారెడ్డి వర్గీయులు వేర్వేరుగా విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎంపీపీ ఇంటి సమీపంలోకి రాగానే ఇరువర్గాలు తారసపడ్డాయి. గుర్తు తెలియని వ్యక్తి ఎంపీపీ వర్గీయుల మీదకు రాయి విసిరాడు. వెంటనే ఎంపీపీ వర్గీయులు బాలకృష్ణారెడ్డి వర్గీయులపై రాళ్లు విసిరారు. దీంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడగా, కొప్పుల గణేశ్, పుట్ట వెంకన్న అనే ఇద్దరికి గాయాలయ్యాయి. ఎంపీపీ వెంకటరెడ్డితోపాటు మరికొందరు గాయపడ్డారు. పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గాయపడిన వారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కాగా... ఈ ఘటనకు కారకులుగా భావిస్తున్న పోచారం గ్రామానికి చెందిన రెడ్డిమళ్ల తులిశమ్మ, రాగం మహేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఇంత భారీ మెజార్టీ ఎవరికీ రాలేదు
హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక ఫలితాలలో నియోజకవర్గ రికార్డు మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావును గెలిపించిన ప్రజలకు ఆ పార్టీ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. విజేత నాగేశ్వరరావుకు అభినందనలు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు. 'పాలేరు నియోజకవర్గ చరిత్రలోనే ఇంతకుముందు 1972లో కాంతయ్య 25452 మెజారిటీతో గెలిచారు. ఇంతకుమించి ఎవరికీ మెజారిటీ రాలేదు. తుమ్మల 45వేలకు పైగా మెజారిటీ సాధించి రికార్డు నెలకొల్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు నిరంతరంగా మాకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ విజయం ప్రభుత్వం మీద, పార్టీ మీద మరింత బాధ్యతను పెంచింది. ఈ విషయాన్ని నాయకులు, కార్యకర్తలు గుర్తుంచుకోవాలి. గెలిచినంత మాత్రాన ఉబ్బిపోయి అతి ప్రసంగాలు చేయకూడదు. సంస్కారం ఉండాలి, మరింత అంకిత భావంతో పనిచేయాలి. ప్రతిపక్షాలకు కూడా ఒకమాట చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. నేను ముఖ్యమంత్రి అయిన ఐదో రోజు నుంచి టీఆర్ఎస్ మీద అర్ధసత్యాలు, అసత్యాలతో పసలేని పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. రొడ్డకొట్టుడు మాదిరిగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. మిషన్ కాకతీయ అంటే కమీషన్ కాకతీయ అన్నారు. మీకు కనువిప్పు కలగాలని కోరుకుంటున్నా. దాడి చేయడమే రాజకీయం అనేది సరికాదని ప్రజలు పలుమార్లు చెబుతున్నారు. వ్యక్తిగత దాడి, విమర్శలు, నిందలు ఇకనైనా మానుకోవాలి' అని కేసీఆర్ అన్నారు. -
పాలేరులో తుమ్మల ఘనవిజయం
హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఘనవిజయం సాధించారు. తుమ్మల నాగేశ్వరరావు తమ సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుచరితా రెడ్డిపై 45 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయభేరి మోగించారు. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ తరపున తుమ్మల, కాంగ్రెస్ తరపున రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి సుచరిత పోటీ చేశారు. సుచరితకు ప్రతిపక్షాలన్నీ మద్దతుగా నిలిచినా ఆమెకు కలసిరాకపోవడంతో పాటు సానుభూతి పవనాలు వీయలేదు. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో తొలిరౌండ్ నుంచి ముందంజలో నిలిచిన తుమ్మల భారీ మెజార్టీ సాధించారు. -
పాలేరులో దూసుకుపోతున్న తుమ్మల
ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ఆయన సతీమణి సుచరిత కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి దిగారు. ఆమెకు ప్రతిపక్షాలన్నీ మద్దతుగా నిలిచాయి. కానీ అధికార టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో రెండు రౌండ్లు ముగిసేసరికి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థిని సుచరితపై 9,610 ఓట్ల ఆధిక్యం సాధించారు. భారీ ఆధిక్యంతో తామిక్కడ విజయం సాధించడం ఖాయమని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. -
చంద్రబాబు జేజమ్మ వచ్చినా..
ఖమ్మం సిటీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జేజమ్మ వచ్చినా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరంలో బైపాస్‌లో ఉన్న ట్రాన్స్‌కో కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీష్‌రెడ్డిలు గురువారం ఆవిష్కరించారు. ట్రాన్స్‌కో కార్యాలయంలోని విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సార్ విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రులు మాట్లాడారు. చంద్రబాబు జేజమ్మ దిగి వచ్చినా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరని తుమ్మల అన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వాటిని ఛేదించి బంగారు తెలంగాణ సాధించుకుంటామని మంత్రులు చెప్పారు. -
‘ఆ కాంట్రాక్టర్లు’ బ్లాక్‌లిస్టులో: తుమ్మల
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రహదారుల నిర్మాణ పనుల్లో నాణ్యతపై నిర్లక్ష్యం ప్రదర్శించే కాంట్రాక్టర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమే గాక వారి పేర్లను బ్లాక్‌లిస్టులో చేరుస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. రోడ్డు పనులపై మంగళవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.10,800 కోట్లతో చేపడుతున్న మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు, రెండు లేన్లుగా సింగిల్ రోడ్ల విస్తరణ తదితర పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎర్రమంజిల్‌లో నిర్మిస్తున్న ఆర్ అండ్ బీ కొత్త భవనాన్ని అనంతరం మంత్రి సందర్శించారు. -
‘పురపాలన, పట్టణాభివృద్ధి’పై మంత్రివర్గ ఉపసంఘం
సాక్షి, హైదరాబాద్: ‘పురపాలన, పట్టణాభివృద్ధి’ అంశంపై మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రులు హరీశ్, మహేందర్‌రెడ్డి, జోగు రామన్న సభ్యులు కాగా పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక ఆహ్వానితులు. పురపాలక శాఖ సంచాలకులు కార్యదర్శి. -
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
గండుగులపల్లి (దమ్మపేట): అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అశ్వారావుపేట నియోజకవర్గ అధికారులను రాష్ట్ర రోడ్లు-భవనాలు, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఆయన శనివారం గండుగులపల్లిలోని స్వగృహంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో కలిసి నియోజకవర్గంలోని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన ఏమన్నారంటే... ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలవడం లేదు. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్ల బాగోగులు చూడటంలో అధికారులు విఫలమయ్యూరు ( (అధికారులపై అసహనం). గండుగులపల్లిలోని రోడ్డుకు ఆరేళ్ల క్రితం వర్షాలతో గండి పడితే ఇప్పటివరకు మరమ్మతు చేయలేదు. ఇక్కడ అధికార యంత్రాంగం పనిచేస్తోందా..(ఆగ్రహం)? మీ పనితీరులో నేటి నుంచే మార్పు రావాలి. బాధ్యతగా పనిచేయాలి. స్థానికంగా నివాసముండాలి. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించండి. ప్రభుత్వ కార్యాలయాలను దేవాలయాలతో సమానంగా చూడండి.అశ్వారావుపేట నియోజకవర్గాన్ని రాష్ట్రానికే మోడల్‌గా తీర్చిదిద్దాలి. జనవరి 1 నాటికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దాలి. కార్యాలయ ఆవరణలో గార్డెన్ పెంచాలి. జనవరి మొదటి వారం నుంచి సంక్షేమ హాస్టళ్లకు సన్న బియ్యం సరఫరా అవుతుంది. దీనిని ఎంపీడీఓలు పర్యవేక్షించాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధిని వేగవంతం చేయాలి. మీరు (అధికారులు) పనులను సక్రమంగా చేస్తే.. ఆ కీర్తి మీకే దక్కుతుంది. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు ప్రస్తుతం మంచి స్థానాల్లో ఉన్నారంటే.. వారి పని విధానమే కారణం. మీరు కూడా వారిలాగా పేరు తెచ్చుకోవాలి. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో పైరవీలకు ప్రాధాన్యమిస్తే సహించను (హెచ్చరిక). ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, పాల్వంచ ఆర్డీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సత్తుపల్లి: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయూలని, సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో ఆయన శనివారం స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన ఏమన్నారంటే... తల్లిదండ్రులు, ఈ సమాజం దయతో మనందరికీ మంచి అవకాశాలు వచ్చారుు. సమాజంపట్ల అంకితభావంతో పనిచేయాలి. సత్తుపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రానికే మార్గదర్శకం(రోల్ మోడల్)గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రాజకీయ నాయకులు వస్తారు.. పోతారు. మాకన్నా మీ పైనే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా, ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి. మిమ్మల్ని మంత్రిగా ఆదేశించటం లేదు.. ప్రాధేయపడుతున్నా. ప్రజల కోసం మనందరం కలిసి సత్సంకల్పంతో పనిచేద్దాం. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి. ఈ విషయంలో ఏమాత్రం అలసత్వంగా వ్యవహరించినా ఉపేక్షించేది లేదు (హెచ్చరిక). పెన్షన్లు, ఆహార భద్రత కార్డుల విచారణను ఇప్పటివరకు పూర్తిచేయలేకపోయారు. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది..? గ్రామాలలో ఎవరు లబ్ధిదారులో.. ఎవరు కాదో తేల్చడానికి వీఆర్వోలు, వీఆర్ఏలకు ఎందుకింత సమయం పడుతోంది? ఏ ఆధారం లేని వారికి తినటానికి బియ్యం ఇద్దామన్నా మీ కారణంగా ఆలస్యమవుతోంది. పేదల విషయంలో తప్పు చేయవద్దు. అర్హులకు అన్యాయం జరగకూడదు. ఫిర్యాదులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. ఈసారి పర్యటనప్పుడు.. ‘పెన్షన్ రాలేదు.. కార్డులు రాలేదు.. సంక్షేమ పథకాలు అందలేదు’ అనే ఫిర్యాదులు రాకూడదు. మీకు పై అధికారుల నుంచి పరిపాలనాపరంగా ఇబ్బందులేమైనా వస్తే నేరుగా నా దృష్టికి తీసుకురండి. వాటిని తొలగించాల్సిన బాధ్యతను నేను తీసుకుంటా. నిధుల కొరత లేదు. అభివృద్ధిని పరుగులు పెట్టించండి. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, ఖమ్మం ఆర్డీఓ వినయ్‌కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాలేరులా పనిచేస్తా
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ర్ట రోడ్లు, భవనాలు, స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం కామేపల్లి, కారేపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సతుపల్లిలో జరిగిన అభినందన సభలో మాట్లాడుతూ.. ప్రజలకు పాలేరుగా పనిచేస్తానని అన్నారు. సత్తుపల్లి : ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ధైర్యానికి.. సహసానికి మెచ్చి.. తెలంగాణ పునర్నిర్మాణంలో జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టించాలనే కాంక్షతో కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్లో చేరిన నాకు మీ ఆదరాభిమానాలతో.. ఆశీర్వదించారు. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించకుండా ఒళ్లు దగ్గర పెట్టుకొని మీ సేవకుడిగా.. పాలేరులా పని చేస్తా.’ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లిలో శుక్రవారం తుమ్మల అభినందన సభ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు దిండిగాల రాజేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాజకీయ జీవితం సత్తుపల్లి ప్రజలు ఇచ్చిన భిక్షఅని అన్నారు. మీ ఆశీర్వాద బలంతో ఎన్నో పదవులు వచ్చాయని భావోద్వేగానికి లోనయ్యారు. 32 సంవత్సరాల రాజకీయ జీవితంలో కష్టాలలో.. సుఖాలలో నా వెంట నడిచిన వారికి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తానన్నారు. త్వరలో సీఎం కేసీఆర్‌ను జిల్లాకు తీసుకొస్తా జిల్లాలోని పాల్వంచ, మణుగూరులో నిర్మించనున్న థర్మల్ పవర్ప్లాంట్ల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జిల్లాకు తీసుకొస్తానని తుమ్మల చెప్పారు. మచిలీపట్నం, కాకినాడ పోర్టులతో తెలంగాణకు రవాణా సంబంధాలు పెంపొందించి తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలతో అనుసంధానించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం గుజరాత్ కంటే అభివృద్ధిలో ముందుంచేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. వాటర్‌గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రచించారనిమ అన్నారు. 44వేల చెరువులను బాగుచేస్తున్నామన్నారు. తెలంగాణలో రహదారులు లేని గ్రామాలు ఇకపై ఉండవన్నారు. జిల్లాకు కనీస మౌలిక వసతులతో పాటు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బయ్యారం ఖనిజాలతో జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ సాధించి తీరుతామన్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా మౌనంగా భరించానని అన్నారు. అగ్రగామిగా జిల్లా కామేపల్లి: అభివృద్ధిలో రాష్ట్రంలోనే జిల్లాను అగ్రగామిగా నిలబెడతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పండితాపురం సంత నుంచి మున్సిబ్జంజర వరకు 14.26 కిలోమీటర్ల మేర పీఎంజీఎస్‌వై నిధులు రూ. 8.62 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డుకు, ముచ్చర్ల రామస్వామి గుట్ట వద్ద సీపీడబ్ల్యుఎస్ నిధులు రూ. 20 కోట్లతో చేపట్టే సమగ్ర మంచినీటి సరఫరా పథకానికి పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం ముచ్చర్లలో ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. నియోజకవర్గంలో కామేపల్లి మండలాన్ని అగ్రస్థానంలో నిలబెడతామన్నారు. మీ జీతగాడిలా 30 ఏళ్ళు పని చేశా కారేపల్లి: ‘మీ జీతగాడిలా 30 ఏళ్ళు పని చేశా. ఇప్పుడు మళ్ళీ మంత్రిని అయ్యా..మీ కోసం ఇంకా కష్ట పడుతా.’ అని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కారేపల్లి మండలం రొట్టమాకురేవు నుంచి మంగళితండా వరకు పీఎంజీఎస్‌వై నిధులు రూ.7.31 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ రాజ్ రోడ్లకు రూ.200 కోట్లు, ఆర్ అండ్ బీ రోడ్లకు రూ.200 కోట్లు, గోదావరి పుష్కరాల నిమిత్తం రోడ్లకు మరో రూ.200 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జై జగన్ అని నినదించిన వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్ సభలో వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్ మాట్లాడుతూ జై జగన్ అని నినదించారు. దీంతో సభా వేదిక పై ఉన్న వారు, సభా ప్రాంగణంలో ఉన్న కార్యకర్తలు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఎమ్మెల్యే వెంటనే తేరుకుని సారీ.. సారీ.. అంటూ ముగించారు. కార్యక్రమాల్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జెడ్పీ చైర్ పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, బాణోతు మదన్‌లాల్, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, డీసీఎంఎస్ చైర్మన్ అంజయ్య, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జ్ నూకల నరేష్‌రెడ్డి, కొండబాల కోటేశ్వరరావు, నలమల వెంకటేశ్వరరావు, పాలడుగు శ్రీనివాస్, మదార్‌సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. -
కన్న తల్లిని.. జన్మభూమిని మరవకండి
ఖమ్మం స్పోర్ట్స్/కల్చరల్ : ఏ రాష్ట్రం, దేశంలో స్థిరపడినా కన్న తల్లిని, జన్మభూమిని మరువవద్దని, అలా చేస్తే మన జాతికి ద్రోహం చేసినట్లేనని రాష్ట్ర రోడ్లు భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మంలో జరిగిన తానా యువ-2014 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో తెలుగు భాషకు, సంస్కృతికి పెద్దపీట ఉందని, అందుకే మనం ఏ దేశంలో స్థిరపడినా తెలుగువారంతా ఒక్కటేనని చాటాలని అన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి లేనంత యువ శక్తి మన భారత దేశానికి ఉందని, అందులోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యువత అత్యంత సమర్థులు అని కొనియాడారు. చదువుతో పాటు ఇలాంటి కార్యక్రమాలు యువతలో ఉత్సాహాన్ని రేపుతాయని, ఇందుకు పూనుకున్న కాటేపల్లి నవీన్‌బాబు మున్ముందు ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఖమ్మం గుమ్మానికి వందనం : సినీహీరో నారారోహిత్ ఖమ్మం గుమ్మానికి వందనం.... నాకు ఖమ్మంతో అనుబంధం ఉంది... అంటూ నారారోహిత్ మాట్లాడగా అక్కడ ఉన్న యువకులు కేకలు వేశారు. తాను ఖమ్మంలోని మమత కళాశాలలో విద్యనభ్యసించానని, తనకు చాలా మంది ఖమ్మంలో మిత్రులున్నారని, చాలా కాలం తర్వాత ఖమ్మానికి రావడం ఆనందంగా ఉందని అన్నారు. తాను తీసిన ప్రతినిధి సినిమాలో రాజకీయాల్లోని కుళ్లును ఎలా బయట పెట్టాలో చిన్న ప్రయత్నం చేసి విజయవంతం సాధించానని, అదే స్ఫూర్తితో యువత కూడా రాజకీయాలను శాసిస్తూ ముందుకు సాగాలని అన్నారు. మనమంతా ఒకట్టేగా : కామెడీయన్ శ్రీనివాసరెడ్డి నేను జిల్లా వాసినేగా... మనమంతా ఒకట్టేగా అంటూ అంటూ కామెడీయన్ శ్రీనివాసరెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నగర వాసిగా సినీ ఇండస్ట్రీలో కమెడియన్‌గా ఉన్నతస్థాయి ఎదగడం గర్వకారణంగా ఉందని అన్నారు. ప్రస్తుతం స్వచ్ఛ భార్త్ కార్యక్రమం నడుస్తోందని, దానిలో యువత కూడా తలా ఒక చేయి వేసి క్లీన్ అండ్ గ్రీన్‌కు సహకరించాలని అన్నారు. మహాసభలను విజయవంత చేయండి : తానా అధ్యక్షులు నన్నపనేని మోహన్ తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 40 ఏళ్లు పూర్తిచేసుకుందని, ప్రతి రెండేళ్లకు నిర్వహించే తానా మహాసభలు అమెరికాలోని డిట్రాయిట్లో జులై 2, 3, 4 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షులు నన్నపనేని మోహన్ పేర్కొన్నారు. అందులో భాగంగానే తానా ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం 20వ తానా మహాసభల పోస్టర్‌ను సీనిహీరో నారారోహిత్, రాజకీయ కురువృద్ధుడు చేకూరి కాశయ్యలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులకు నిర్వాహకులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రియదర్శిని డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ కాటేపల్లి నవీన్‌బాబు ఫెమా కన్వీనర్ మువ్వా శ్రీనివాసరావు, సీక్వెల్రిసార్ట్స్ ఎండీ రవిమారుత్, మాజీ మంత్రి కొండబాల కోటేశ్వరరావు, తానా అధ్యక్షులు నన్నపనేని మోహన్, తానా ప్రముఖులు కొడా లి నరేన్, తాళ్ళూరి జయశేఖర్, జయరాం కోమటి, సతీష్ వేమన, గంగాధర్‌రెడ్డి, జంపా ల చౌదరి, తాతా మధుసూధన్, అంజ య్యచౌదరి, లింగమనేని అనిల్, జగ్గంపూడి రాము, తానా ఇండియా కో ఆర్డినేటర్ ప్రసా ద్, అశోక్ పల్లా, నందిపాటి హేమరావు, తాళ్ళూరి రాజా, తోట రాము, ఇండోకట్టర్ మేనేజింగ్ డెరైక్టర్ గిరి, దొడ్డా రవి పాల్గొన్నారు. -
కీలక అధికారులేరీ..?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : అభివృద్ధి పరంగా జిల్లాను పరుగులు తీయించాలని ప్రయత్నిస్తున్న ప్రభుత్వం జిల్లాలో సుదీర్ఘకాలం నుంచి ఖాళీగా ఉంటున్న పలు కీలక పోస్టులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇన్చార్జిల ఏలుబడిలో ఉన్న ఆయా శాఖలకు పూర్తిస్థాయి అధికారులను నియమించే విషయమై పరిశీలన చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా పలు కారణాల వల్ల జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల పోస్టులు భర్తీకి నోచుకోలేదు. జిల్లా మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు బాధ్యతలు తీసుకోవడంతో పూర్తిస్థాయి అధికారుల నియామకం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అభివృద్ధి పరంగా జిల్లాను అగ్రగామిగా ఉంచాలంటే అన్ని కీలక శాఖలకు పూర్తిస్థాయి అధికారులు ఉండి తీరాల్సిందేనని మంత్రి తుమ్మల నిశ్చితాభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఏయే శాఖల కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. అనే విషాయాన్ని జిల్లా అధికారయంత్రాంగంతో చర్చించినట్లు తెలుస్తోంది. కీలకమైన ఖమ్మం నగర పాలక సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం, సోషల్ వెల్ఫేర్ డీడీ వంటి కీలక శాఖలకు జిల్లాస్థాయి అధికారులు లేకపోవడం వల్ల పాలనాపరంగా జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో జిల్లాలో విశిష్ట సేవలు అందించిన అధికారులలో కొందర్ని తిరిగి జిల్లాకు తీసుకురావడానికి అధికార పార్టీ నుంచి ప్రయత్నాలు ప్రారంభమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జిల్లాలో కీలక శాఖల కోసం మరోవైపు ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న కొందరు అధికారులే తీవ్ర స్థాయిలో పైరవీలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. జిల్లాపై అవగాహన, వారి పనితీరు ప్రాతిపదికగా తీసుకుని ఖమ్మం నగర పాలక సంస్థకు గ్రూప్-1 అధికారిని లేదా ఐఏఎస్ అధికారిని నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే కీలకమైన డీఆర్డీఏ పీడీ పదవి కోసం భారీ పైరవీలు సాగుతున్నాయని సమాచారం. పలు ప్రధాన శాఖలకు జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఆ శాఖల పనితీరు మందకొడిగా కొనసాగుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. పలు కీలక ఫైళ్లను చూసే తీరిక, క్షేత్రస్థాయిలో పర్యటన చేసే ఓపిక కొందరు ఇన్చార్జి అధికారులకు ఉండటం లేదన్న అపవాదు గత కొన్ని నెలలుగా వినపడుతోంది. తమ సొంత శాఖల వ్యవహారాలు చక్కదిద్దడానికి ఇచ్చే ప్రాధాన్యం కొందరు అధికారులు ఇన్చార్జిగా ఉన్న శాఖలకు ఇవ్వకపోవడంతో అక్కడి సిబ్బంది ఫైళ్లతో రోజుల తరబడి జిల్లా అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. తలకు మించినభారం కొత్తరాష్ట్రంలో ప్రభుత్వ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. వాటిని సక్రమంగా అమలు చేయడం ఇన్చార్జి అధికారులకు భారంగా మారింది. మాతృశాఖలో పనులు చక్కపెట్టడంతో పాటు మరో శాఖ బాధ్యతలు చూడటం వారికి తలనొప్పిగా మారింది. పలు సమీక్ష సమావేశాల్లో ప్రజాప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఒకరికే రెండు శాఖల బాధ్యతలు ఉండటంతో పనిభారంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నట్లు ఓ అధికారి చెప్పారు. అవగహన లేక ఇబ్బందులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వ పలు పథకాలను అమలు చేస్తోంది. వీటిపై ఇన్చార్జిలుగా కొనసాగుతున్న అధికారులకు అవగహన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిస్థాయిలో అజమాయిషీ లేక, కిందిస్థాయి ఉద్యోగులను సమన్వయం చేయలేక నానాతంటాలు పడుతున్నారు. ఆయా శాఖల్లో పాలనపై పర్యవేక్షణ కుంటుపడుతోంది. కొందరు అధికారులు ఇన్చార్జి పాలనతో అందినకాడికి మెక్కుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్చార్జిల పాలనలో ఉన్న కీలక శాఖలు ఇవే.. ఖమ్మం కార్పొరేషన్‌కు జిల్లా కలెక్టర్ ఇలంబరితి ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్నారు. నగర పాలక సంస్థకు కమిషనర్ లేక పోవడంతో మెప్మా పీడీ వేణుమనోహర్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే నగరపాలక సంస్థకు పూర్తిస్థాయి మేనేజర్ సైతం లేకపోవడంతో ఇన్చార్జితోనే నెట్టకొస్తున్నారు. పూర్తిస్థాయి జిల్లా పంచాయతీ అధికారి లేకపోవడంతో డీఎల్పీవో రవీందర్తోనే పంచాయతీ పాలన సాగుతోంది. డీఆర్డీఏ పీడీ పద్మజారాణి బదిలీపై వెళ్ళడంతో ఆమెస్థానంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ శ్రీనివాస్‌నాయక్ కొనసాగుతున్నారు. గృహ నిర్మాణ శాఖ పీడీ రాందేవ్‌రెడ్డి బదిలీపై వెళ్ళడంతో మధిర డీఈగా పని చేస్తున్న వైద్యం భాస్కర్‌కు ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారు. - ఎస్సీ వెల్ఫేర్ డీడీ రంగలక్ష్మీదేవి సెలవుపై వెళ్లడంతో సీపీవో డీడీ జెడ్. రాందాస్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. జిల్లా పరిషత్ డెప్యూటి సీఈవో కర్నాటి రాజేశ్వరి, ఏఓ అప్పారావులు ఇన్‌చార్జులుగానే విధులు నిర్వహిస్తున్నారు. డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి కూడా ఇన్చార్జి విధుల్లోనే కొనసాగుతున్నారు. -
దశాబ్దకాలం తర్వాత మళ్లీ మంత్రి పదవి
హైదరాబాద్ : సరిగ్గా దశాబ్దకాలం తర్వాత తుమ్మల నాగేశ్వరరావు మళ్లీ మంత్రి పదవి అందుకున్నారు. ఆయన దాదాపు 40 సంవత్సరాలు జిల్లా రాజకీయాలపై తనదైన ముద్ర వేయగలిగారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో వివిధ హోదాల్లో కొనసాగి తాజాగా టీఆర్ఎస్ లో చేరారు. దీంతో తుమ్మల పది సంవత్సరాల తర్వాత మంగళవారం తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవిని చేపట్టారు. టీడీపీలో కొనసాగినన్నాళ్లు తనదైన పంథాలో ముందుకెళ్లిన ఆయన పార్టీలో నెలకొన్న వర్గపోరు, ఇతర పరిణామాల కారణంగా నాలుగు నెలల క్రితం టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన తుమ్మల ఆయన పిలుపు మేరకు గులాబీ కండువా కప్పుకున్నారు. అప్పటినుంచే ఆయనను మంత్రిపదవి వరిస్తుందన్న ఊహాగానాలు విస్తృతంగా వ్యాపించాయి. సత్తుపల్లి నుంచి రాజకీయ ప్రస్తానం ప్రారంభించిన తుమ్మల ఉమ్మడి రాష్ట్రంలో 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో తొలిసారిగా రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖామంత్రిగా కొనసాగారు. 1994, 1999లో సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంద్రబాబు మంత్రివర్గంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖామంత్రిగా, భారీ నీటి పారుదల శాఖామంత్రిగా, రహదారులు భవనాల శాఖామంత్రిగా పనిచేశారు. టీఆర్ఎస్లో చేరిన తుమ్మల జిల్లాలో టీడీపీకి భారీ గండి కొట్టిన నేతగా మెజార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలను తనతోపాటు టీఆర్ఎస్లోకి తీసుకెళ్లారు. -
అమాత్య తుమ్మల!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సరిగ్గా దశాబ్దకాలం తర్వాత రాష్ట్ర మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మళ్లీ మంత్రి పదవి చేపట్టనున్నారు. తుమ్మల దాదాపు 40 సంవత్సరాలు జిల్లా రాజకీయాలపై తనదైన ముద్ర వేయగలిగారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో వివిధ హోదాల్లో కొనసాగిన ఆయన పది సంవత్సరాల తర్వాత మంగళవారం మంత్రి పదవిని చేపట్టనున్నారు. టీడీపీలో కొనసాగినన్నాళ్లు తనదైన పంథాలో ముందుకెళ్లిన ఆయన పార్టీలో నెలకొన్న వర్గపోరు, ఇతర పరిణామాల కారణంగా నాలుగు నెలల క్రితం టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన తుమ్మల ఆయన పిలుపు మేరకు గులాబీ కండువా కప్పుకున్నారు. అప్పటినుంచే ఆయనను మంత్రిపదవి వరిస్తుందన్న ఊహాగానాలు విస్తృతంగా వ్యాపించాయి. సత్తుపల్లి నుంచి రాజకీయ ప్రస్తానం ప్రారంభించిన తుమ్మల ఉమ్మడి రాష్ట్రంలో 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో తొలిసారిగా రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖామంత్రిగా కొనసాగారు. 1994, 1999లో సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంద్రబాబు మంత్రివర్గంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖామంత్రిగా, భారీ నీటి పారుదల శాఖామంత్రిగా, రహదారులు భవనాల శాఖామంత్రిగా పనిచేశారు. టీఆర్ఎస్లో చేరిన తుమ్మల జిల్లాలో టీడీపీకి భారీ గండి కొట్టిన నేతగా మెజార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలను తనతోపాటు టీఆర్ఎస్లోకి తీసుకెళ్లారు. కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం, తుమ్మలకు మంత్రిగా గతంలో ఉన్న సుదీర్ఘ అనుభవం జిల్లా అభివృద్ధి మరింత వేగంగా జరగడానికి దోహదపడుతుందని జిల్లా ప్రజానీకం భావిస్తోంది. తుమ్మల ముందున్న అభివృద్ధి.. బయ్యారంలో ఉక్కు కర్మాగారం, దు మ్ముగూడెం ప్రాజెక్టు పూర్తి చేయడం, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం, సింగరేణి గనుల విస్తరణ, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆధునికీకరణ, జిల్లాలో రహదారుల విస్తరణ వంటి అభివృద్ధి పనులు తుమ్మల ముందున్న కర్తవ్యాలు. ఆయనకు కేబినెట్లో చోటు ఖాయమైనప్పటినుంచే ఏ శాఖను కేటాయిస్తారన్న అంశంపై పెద్ద ఎత్తున జిల్లాలో చర్చ జరుగుతోంది. సత్తుపల్లి నియోజకవర్గంలోనైతే ఆయనకు శాఖల కేటాయింపుపై హోరాహోరీగా బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి.తుమ్మలకు హోం, విద్యుత్, ఆర్అండ్బీ వంటి కీలక శాఖలను కేటాయించే అవకాశం ఉందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. చాలాకాలం తర్వాత తుమ్మలకు మంత్రిపదవి లభిస్తుండటంతో జిల్లాకు చెందిన టీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలేందుకు భారీ ఏర్పాటు చేస్తున్నారు. వేలాదిగా కార్యకర్తలను తరలించేందుకు పార్టీ నియోజకవర్గాల బాధ్యులు ఇప్పటికే సమాయత్తం అయ్యారు. తుమ్మల మంగళవారం ఉదయం మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక, ఆయనను కలవడానికి హైదరాబాద్ వెళ్లిన జిల్లాకు చెందిన కార్యకర్తలతో సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ సమీపంలో ఉన్న జయగార్డెన్స్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా నుంచి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, డీసీఎంఎస్ చైర్మన్ ఎగ్గడి అంజయ్య, పార్టీ నేతలు కొండబాల కోటేశ్వరరావు, ఆర్జేసీ కృష్ణ తదితరులు హైదరాబాద్ తరలివెళ్లారు. తుమ్మలకు మంత్రి పదవి ఖాయమవుతుండటంతో వివిధ రాజకీయ పక్షాల్లో ఆదరణకు నోచుకోని నాయకులు సైతం టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జిల్లా రాజకీయాల్లో నెలకొన్న స్తబ్దత తుమ్మల మంత్రిపదవి చేపట్టిన అనంతరం తొలగిపోతుందని విశ్లేషకుల భావన. ఇప్పటికే పలువురు జిల్లా అధికారులు, టీఆర్ఎస్ నేతలు, తుమ్మలతో అనుబంధం ఉన్న వివిధ రాజకీయ పక్షాల కార్యకర్తలు, నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
మాటకు మాట
తుమ్మలే లక్ష్యంగా టీడీపీ- టీఆర్ఎస్ల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. టీడీపీ రాష్ట్రస్థాయి నేతలు వారంరోజుల క్రితం రాజేసిన అగ్గి ఆ పార్టీ నుంచి వలసపోయి టీఆర్ఎస్లో చేరిన నాయకులకు మంట పుట్టించింది. ఆ రోజు నుంచి విమర్శలు..ప్రతివిమర్శలతో ఇరుపార్టీల నేతలు దూషించుకోవడం నిత్యకృత్యమైంది. పదవుల కోసమే పార్టీ వీడారన్న టీడీపీ అగ్రశేణి నాయకుల విమర్శను తుమ్మల అనుయాయులు తిప్పికొట్టే పనిలో ఉన్నారు. నామా ఏకపక్ష ధోరణి వల్లే టీడీపీ దెబ్బతిన్నదని దుయ్యబట్టారు. పదవుల కోసం తాము పార్టీ వీడినట్టయితే రాజీనామా చేయడానికి సిద్ధమని టీఆర్ఎస్లో కొత్తగా చేరిన నేతలు సవాల్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా తుమ్మల అనుయాయులు మినహా టీఆర్ఎస్ జిల్లా నాయకత్వం స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన నాయకులే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన విమర్శల అగ్గి ఇంకా రగులుతూనే ఉంది. వారం రోజుల క్రితం రాజుకున్న ఈ మాటల యుద్ధం కొనసాగుతోంది. సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడం షరామామూలే అయింది. జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శించి ఆర్థిక సహాయం చేసే పేరుతో టీడీపీ రాష్ట్ర ముఖ్యనేతలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో టీఆర్ఎస్లో చేరిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావును లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పార్టీ వీడిన మాజీమంత్రి తుమ్మలను టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి ఉల్లిగడ్డ పొట్టుతో పోల్చారు. తుమ్మల పార్టీని వీడినా నష్టమేమీ లేదన్నట్లు మాట్లాడకొచ్చారు. టీడీపీ నుంచి వలస వచ్చిన జిల్లా టీఆర్ఎస్ నేతలు కూడా తెలుగుదేశంపై అదేస్థాయిలో విరుచుకుపడ్డారు. విమర్శలు- ప్రతివిమర్శలు టీడీపీని భ్రష్టుపట్టించింది మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావేనని, ఆయన ఏకపక్ష విధానాలతో పార్టీని కార్యకర్తలకు దూరం చేశారని దుమ్మెత్తిపోశారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కొండబాల కోటేశ్వరరావు తీవ్రస్థాయిలో టీడీపీ నేతల వ్యవహారశైలిని దుయ్యబట్టారు. పార్టీ గుర్తులతో గెలిచి పదవులనుభవిస్తున్న వాళ్లు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షులు తుళ్లూరి బ్రహ్మయ్య సవాల్ విసిరారు. పార్టీ గుర్తులతో గెలిచిన జిల్లా పరిషత్‌చైర్మన్, జెడ్పీటీసీలు, పార్టీ అండతో గెలుపొందిన డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, ఎంపీపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రతీగా జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవితతో కలిసి డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పదేపదే తుమ్మల, నిజాయితీగా టీడీపీకి సేవలందించి టీఆర్ఎస్లో చేరిన నాయకులపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు దమ్ముంటే ఇప్పుడున్న వారి పదవులకు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలన్నారు. తాను డీసీసీబీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఏకంగా రాజీనామా పత్రాన్నే చూపించారు. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు.. ఆంధ్రప్రదేశ్‌లో ఓ పార్టీ నుంచి గెలిచి టీడీపీలో చేరి పదవులనుభవిస్తున్న వారి చేత రాజీనామా చేయిస్తే తాము తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమవుతామని విజయ్‌బాబు అన్నారు. తాను పోటీచేసి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కూడా సిద్ధమేనన్నారు. దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని విజయ్‌బాబు విసిరిన మరో సవాల్ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. తుమ్మలకు అనుకూలంగా..వ్యతిరేకంగా.. తుమ్మలనే లక్ష్యంగా చేసుకున్న టీడీపీ నేతలు మాత్రం కార్యకర్తల కష్టంతో మంత్రిస్థాయి వరకు వెళ్లిన తుమ్మల నాగేశ్వరరావు పార్టీని వీడి కార్యకర్తల గుండెల మీద తన్నాడని ధ్వజమెత్తగా.. టీడీపీని ఎవరు భ్రష్టుపట్టించారో... ఎవరి హయాంలో పార్టీ అభివృద్ధి చెందిందో.. ఎవరి నియంతృత్వంతో కనీసం పూర్తిస్థాయి జిల్లా కమిటీని వేసుకోలేని పరిస్థితి వచ్చిందో చర్చించడానికి తాము సిద్ధమని తుమ్మల అనుయాయులు ప్రతిస్పందించారు. జిల్లాలో టీడీపీని బలోపేతం చేసుకునే వ్యూహంలో భాగంగానే టీఆర్ఎస్లోకి వలస వెళ్లిన నాయకులను లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ విమర్శలు చేస్తోందని, ఇందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం సైతం సానుకూలంగా స్పందించడంతో సభలు, సమావేశాలు నిర్వహించి విమర్శలు చేస్తుండటంతో..టీడీపీ వలస నేతలు సైతం ఘాటుగానే స్పందిస్తున్నారు. టీడీపీ రాష్ట్రనేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి ‘అన్నం పెట్టిన పార్టీకి తుమ్మల సున్నం పెట్టారు’ అని తీవ్ర విమర్శ చేశారు. దీన్ని టీడీపీ వలస నేతలు తీవ్రంగా ఖండించారు. టీడీపీ వలస నేతల మినహా టీఆర్ఎస్ జిల్లా పార్టీ ఈ విషయంలో ఇంతవరకు స్పందించపోవడం చర్చనీయాంశంగా మారింది. గత వారం రోజులుగా ‘మీరు రాజీనామా చేయాలంటే మీరు రాజీనామా చేయాలంటూ’ విమర్శల పర్వం మొదలుపెట్టిన నేతలు రెండురోజులుగా స్వరం మరింతగా పెంచారు. ఎన్నికలకు ముందు నామా నాగేశ్వరరావు వద్ద రూ.5 కోట్లు తీసుకుని ఆయన వల్లే ఓడిపోయానని తుమ్మల తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య చేసిన ఆరోపణలు టీడీపీ-టీఆర్ఎస్ల మధ్య అగాధాన్ని మరింతగా పెంచాయి. తుమ్మలకు డబ్బిచ్చినట్లుగా నామా చెప్పగలరా? అని టీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య నెలకొన్న విమర్శల వేడి ఎప్పటికి చల్లారుతుందో కాలమే నిర్ణయించాలి. -
టార్గెట్ తుమ్మల
సాక్షి, ఖమ్మం:జిల్లాలో టీడీపీ బలంగానే ఉందంటూ నిరూపణకు ఆ పార్టీ నేతలు తీవ్ర ప్రయత్నమే చేశారు. పార్టీని వీడిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు వల్ల వచ్చిన నష్టమేమీ లేదన్న భావన కార్యకర్తలకు కలిగించడానికి పడరాని పాట్లు పడ్డారు. పార్టీపై ఆయన ప్రభావం ఏమీ లేదని చెబుతూనే ఆయన పార్టీకి ద్రోహం చేశారంటూ మాట్లాడిన ప్రతి వక్త తుమ్మలనే టార్గెట్ చేశారు. కార్యకర్తల భవిష్యత్ కార్యకలాపాలపై దిశానిర్దేశం చేయాల్సిన నేతలు ఆ విషయానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వకుండా సమావేశం అంతా తుమ్మలపైనే గురి పెట్టారు. టీడీపీ జిల్లా పార్టీ ఎంపిక చేసిన రైతు కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు శుక్రవారం ఖమ్మం నగర సమీపంలోని గణేష్ గార్డెన్స్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యూహాత్మకంగానే శాసనసభా పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉపనేత రేవంత్‌రెడ్డిని ముఖ్యఅతిథులుగా ఆహ్వానించినట్లు సమాచారం. తుమ్మలపై ఎదురుదాడి చేయడం, ఉన్న కేడర్ ఇతర పార్టీల వైపు చూడకుండా వారికి ధైర్యాన్ని ఇచ్చేలా మాజీ ఎంపీ నామా డెరైక్షన్‌లో ఈ సమావేశం జరిగింది. పది రోజుల ముందుగానే రాష్ట్రపార్టీ నేతలను ఇక్కడికి తీసుకురావాలని జిల్లా నాయకులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయంతోపాటు జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని ఆ పార్టీ ఏర్పాటు చేసింది. దీనికి ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డితోపాటు రాష్ట్రనేతలు పెద్దిరెడ్డి, బడుగు లింగయ్య యాదవ్, జిల్లా నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి ముందు నయాబజార్ కళాశాలనుంచి గణేష్ గార్డెన్ వరకు రాష్ట్రస్థాయి నేతలతోపాటు జిల్లానేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. దీంతో నగరంలో పార్టీ కేడర్‌తో నేతలు బలనిరూపణకు దిగారు. ర్యాలీ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. తొలుత పోట్ల నాగేశ్వరరావు తుమ్మల గురించి సమావేశంలో ప్రస్తావించడంతో కార్యకర్తలు ఒక్కసారిగా డౌన్ డౌన్ తుమ్మల... జై..జై నామా నినాదాలు చేశారు. తుమ్మల మంత్రి పదవి కోసమే ‘కారు’ ఎక్కాడని ఆరోపణలు చేయడంతో ఈ నినాదాలు ఇంకా పెద్ద పెట్టున చేశారు. ఇలా మూడు గంటలపాటు నాయకులంతా తుమ్మలపై ఆరోపణలు, విమర్శలు చేస్తూ ప్రసంగించారు. బుల్లెట్లా తుమ్మలపై రేవంత్‌రెడ్డి విమర్శలు.. ఇటీవల అసెంబ్లీలో ఉపనేతగా రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ సమవేశం సందర్భంగా ఆయన ఫొటోలు పెద్దగా పెట్టి ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ‘తుమ్మల పార్టీని వీడితే ఉల్లిగడ్డ మీద పొట్టే పోయింది..కండువ వేయించుకుని కౌగిలించుకున్నాడు.. 32 ఏళ్లు పార్టీ కార్యకర్తలు భుజానికి ఎత్తుకుంటే వారి గుండెల మీద తన్ని కేసీఆర్ పంచన చేరాడు. దమ్ముంటే ముఖ్యమంత్రితో మాట్లాడి ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు పెట్టించు.. నీ సత్తా ఏమిటో.. మా సత్తా ఏమిటో తెలుస్తుంది’ అని రేవంత్‌రెడ్డి తుమ్మలపై తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు. ఇలా రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్నంత సేపూ కార్యకర్తలు తెలంగాణ బుల్లెట్ అంటూ నినాదాలు చేయడంతోపాటు తుమ్మల డౌన్ డౌన్ అంటూ నినదించారు. అలాగే శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా తుమ్మల టార్గెట్‌గా విమర్శలు చేయడం గమనార్హం. ‘తుమ్మల, నేను 1983 ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పార్టీ తరుపున పోటీ చేశాం. అప్పుడు ఆయన ఓడిపోయాడు.. నేడు ఓడిపోయాను. ఆతర్వాత నేను గెలిచాను. ఆయన గెలిచినా నేను ఒక్కసారి కూడా మంత్రి కాలేదు. తుమ్మలకే అవకాశం దక్కింది. జిల్లాలో ఏకైక నాయకుడిగా ఎదిగాడు. ఇలా కార్యకర్తలను పీడించే నాయకుడయ్యాడు. ఇప్పుడు మంత్రిపదవి కోసం కక్కుర్తి పడి టీఆర్ఎస్లో చేరాడు’ అని బలమైన విమర్శలు చేశారు. ఇలా ప్రసంగించిన వారంతా తుమ్మలపై ఉన్న తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా తుమ్మలనే టార్గెట్ చేశారు. సభ్యత్వ నమోదుపై అసహనం.. ఈ సమావేశంలో తెలంగాణలోనే ఖమ్మం జిల్లా ముందంజలో ఉందని ప్రశంసిస్తూనే మరోవైపు సభ్యత్వ నమోదులో వెనుకంజ లో ఉన్న నేతలపై రాష్ట్రస్థాయి నేతలు మొట్టికాయలు వేశారు. తెలంగాణ రాష్ట్ర సభ్యత్వ నమోదు ఇంచార్జి పెద్దిరెడ్డి ఒక్కో నియోజకవర్గం సభ్యత్వ నమోదును వివరిస్తూ.. ఇంకా సభ్యత్వ నమోదును పెంచాలని సూచించారు. అయితే ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ జిల్లాలో సభ్యత్వ నమోదులో ముందంజలో ఉన్న మాట వాస్తవమేనని, కొన్ని నియోజకవర్గాల్లో అతి తక్కువగా ఉందని ప్రస్తావించారు. ఇకనుంచి ఆ నియోజకవర్గం నేతలు హైదరాబాద్ రా కుండా జిల్లాలోనే ఉంటూ సభ్యత్వ నమో దు చేయించాలని సూచించడం గమనార్హం. -
మేమున్నాం..అధైర్యపడొద్దు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తుమ్మల నాగేశ్వరరావు పార్టీని వీడినంత మాత్రాన ఉల్లిగడ్డ మీద పొట్టే పోయిందని, జిల్లాలో కార్యకర్తలు అధైర్య పడవద్దని టీడీపీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉపనేత రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఖమ్మం నగర సమీపంలోని గణేష్ గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన ఆ పార్టీ జిల్లా విస్తృతస్తాయి సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 32 ఏళ్లు నేతగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా కార్యకర్తలు తుమ్మలకు గుర్తింపు తెచ్చి, ఆయనను భుజానికి ఎత్తుకుని మోస్తే చివరకు మంత్రి పదవి కోసం వారి గుండెలనే తన్ని కేసీఆర్ పంచన చేరాడని, ఇంతకంటే మోసకారి ఇంకెవరూ ఉండరని ధ్వజమెత్తారు. కేసీఆర్ మోసకారి అని, అన్నం పెట్టిన పార్టీకి తుమ్మల సున్నం పెడితే.. ఆయనకు కూడా మంత్రి పదవి పేరు చెప్పి కేసీఆర్ సున్నం పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేసిన వారికి ఎప్పటికైనా ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తుమ్మలకు దమ్ముంటే ముఖ్యమంత్రితో చర్చించి ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు పెట్టించాలని, అప్పుడు టీడీపీ సత్తా ఏమిటో చూపిస్తామని సవాల్ విసిరారు. తెలంగాణ గురించి ఎప్పుడు మీటింగ్ పెట్టినా తుమ్మల వ్యతిరేకించే వారని పేర్కొన్నారు. ఆయన పార్టీని వీడటంతో జిల్లాకు పట్టిన శనిపోయినట్టేనని వ్యాఖ్యానించారు. తుమ్మల వల్లే నామా ఓటమిపాలయ్యారని, ఆయనకు ఒక గుర్తింపు వచ్చేలా పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో మాట్లాడతామని చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదులో తెలంగాణలోని పది జిల్లాల్లో ఖమ్మం ముందంజలో ఉండటం శుభ పరిణామమన్నారు. ఎప్పటికీ ఇలాగే అగ్రస్థానంలో ఉండాలన్నారు. సభ్యత్వ నమోదు అంతగా లేని నియోజకవర్గ నేతలు ఇకనుంచి హైదరాబాద్ ఎక్కువగా రావద్దని, పార్టీ సభ్యత్వ నమోదు వేగిరం చేయాలని సూచించారు. రాజకీయ వ్యభిచారం చేశారు.. టీడీపీ కార్యకర్తల కష్టార్జితంతో ప్రజా నేతలుగా ఎదిగి ఇప్పుడు రాజకీయ వ్యభిచారం చేశారని తుమ్మల, ఆయన అనుచరులనుద్దేశించి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. నీతి, నిజాయితీ, ధైర్యం ఉంటే టీఆర్ఎస్లోకి వెళ్లిన వారు త మ పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ అన్నం పెట్టిన పార్టీకి ద్రోహం చేయడం తుమ్మలకు తగదన్నారు. తుమ్మల మంత్రిగా ఉండి కూడా సత్తుపల్లి నియోజకవర్గంలో ఏనాడూ ఐదు ఎంపీపీలు, ఐదు జెడ్పీటీసీలు, మున్సిపాలిటీని దక్కించుకోలేదని, తాను ఎమ్మెల్యేగా ఉండగా ఈ ఘనత సాధించానని అన్నారు. ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ తుమ్మలకు పార్టీ, చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, కానీ టీడీపీ అభ్యర్థులను ఓడించడానికి...తనతోపాటు తమ్మినేని, వెంకటరెడ్డి, రేణుకా చౌదరిల గెలుపు కోసం ఎంతో శ్రమపడేవారని ఎద్దేవా చేశారు. 30 ఏళ్లు ఆయనను పార్టీ గౌరవిస్తే వెన్నుపోటు పొడిచారన్నారు. పార్టీ రాష్ట్ర నేత, సభ్యత్వ నమోదు ఇంచార్జి పెద్దిరెడ్డి మాట్లాడుతూ సభ్యత్వ నమోదును జిల్లాలో ఇంకా పెంచాలన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి.. సమావేశానికి హాజరైన బీజేపీ జాతీయ కార్యదర్శి నల్లు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ టీడీపీ మద్దతుతో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న రామ్మోహన్‌రావును గెలిపించాలని కోరారు. ఖమ్మం జిల్లాలో పట్టభద్రుల ఓటు నమోదుకు అధికార యంత్రాంగం సహకరించడం లేదని, ఈ విషయంపై ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. రాష్ట్రంలో పిట్టల దొర పాలనలా కేసీఆర్ వ్యవహారశైలి ఉందని విమర్శించారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న 18 మంది రైతు కుటంబాలకు రూ.50 వేల చొప్పున టీడీపీ నేతలు చెక్కులను అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్రనేతలు బడుగుల లింగయ్య యాదవ్, మోహన్‌లాల్, పాలేరు నియోజకవర్గ ఇంచార్జి మద్దినేని బేబి స్వర్ణకుమారి, ఫణీశ్వరమ్మ, కోనేరు చిన్ని, కిలారు నాగేశ్వరరావు, చావా కిరణ్మయి, హరిప్రియ, భవాని శంకర్, నాగప్రసాద్, రామనాధం, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్మోహన్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ను అగ్రగామిగా నిలుపుతా
ఖమ్మం వైరా రోడ్: జిల్లాలో టీఆర్ఎస్ను అగ్రగామిగా నిలుపుతానని ఆ పార్టీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పార్టీ ఖమ్మం నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నగరంలోని బైపాస్ రోడ్డులోగల ఎంబీ గార్డెన్స్‌లో జరిగింది. నియోజకవర్గ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో జిల్లాను రాష్ట్రంలోనే మిన్నగా అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. నిర్మాణ దశలో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేయిస్తానని అన్నారు. ఖమ్మంతోపాటు ఇతర నియోజకవర్గాల్లో విద్యుత్, నీటి పారుదల ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల సంపూర్ణ అభివృద్ధికి పాటుపడతానన్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 18న పార్టీ ప్లీనరీ, 19న బహిరంగ సభ ఉంటాయన్నారు. వీటికి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలను సమీకరించాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. బహిరంగ సభకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రైలు, 200 నుంచి 300 వరకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పాఠశాలల బస్సులను కూడా వినియోగించుకుంటామన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ కల కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం కరెంటు కోతలకు గత పాలకులే కారణమని అన్నారు. గత పదేళ్లుగా జిల్లాలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య పార్టీని వారధిలా ఉపయోగించుకోవాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి ఎస్బి.బేగ్, పట్టణ అధ్యక్షులు డోకుపర్తి సుబ్బారావు, నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, పోరిక లక్ష్మీబాయి, మదార్ సాహెబ్, మామిళ్లపల్లి రాంబాబు, కమర్తపు మురళి, అర్వపల్లి విద్యాసాగర్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, గాదె అనిల్‌కుమార్, సుధీర్, శేషు, మందడపు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పునర్నిర్మాణ ఉద్యమం
సాక్షి, హైదరాబాద్:తెలంగాణలో పునర్నిర్మాణ ఉద్యమం మొదలైందని, రాజకీయాలను పక్కనబెట్టి అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుదామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. రాష్ర్టం ప్రస్తుతం సంధి కాలం(ట్రాన్సిట్ టైమ్)లో ఉందని, దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలపడానికి పాటుపడాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సూచించారు. ‘టీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు. ఇప్పుడు కూడా ఉద్యమ పార్టీనే. తెలంగాణ పునర్నిర్మాణంలో నిమగ్నమై ఉన్నాం. రాబోయే రోజుల్లో రాజకీయాల్లేవు. ఐదేళ్లపాటు కేవలం అభివృద్ధే మన ఎజెండా’ అని కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం దేశానికి, ప్రపంచానికి ధీరత్వం చూపించాల్సిన అవసర ముందని నేతలకు, కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో ఖమ్మం జిల్లా టీడీపీ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు టీఆర్ఎస్లో చేరారు. ఆయనతోపాటే దాదాపు జిల్లా టీడీపీ శ్రేణులన్నీ గులాబీ దళంలోకి మారిపోయాయి. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం టీడీపీ మాజీ అధ్యక్షుడు కొండబాల కోటేశ్వర్రావు, ఖమ్మం జెడ్పీచైర్మన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మొవ్వ విజయబాబు, డీసీఎంఎస్ చైర్మన్ ఎగ్గడి అంజయ్యతో పాటు జిల్లాకు చెందిన 16 మంది జెడ్పీటీసీలు, 16 మంది ఎంపీపీలు, 168 మంది ఎంపీటీసీలు, 32 మంది పీఏసీఎస్ చైర్మన్లు, 162 మంది సర్పంచ్‌లు, వివిధ స్థాయిల్లోని టీడీపీ నాయకులు, నల్లగొండ జిల్లా కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు తదితరులు టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. అందరినీ ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. ‘తుమ్మల 1982 నుంచి నాకు ఆప్తమిత్రుడు. మేం టీడీపీ వ్యవస్థాపక సభ్యులం. అనేక ఒత్తిళ్లకు లోనయ్యాం. ఖమ్మం జిల్లాను వందకు వంద శాతం అభివృద్ధి చేస్తాం’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణకే ఖమ్మం తలమానికం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రానికే తలమానికమని సీఎం అభివర్ణించారు. ‘ఖమ్మం జిల్లాను విభజించి కొత్తగూడెం కేంద్రంగా ఇంకో జిల్లాను ఏర్పాటు చేస్తాం. ఉమ్మడి రాష్ర్టంలో ఖమ్మం వివక్షకు గురైంది. ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కూడా ఆశ్చర్యపోయేలా అందరం కలసి జిల్లాను అభివృద్ధి చేసుకుందాం. కృష్ణా జలాలు ఖమ్మం లోని గార్ల వరకు రాకుండా ప్రజల నోట్లో మట్టికొట్టారు. ఇప్పుడు అంగుళం భూమిని వదల కుండా సాగు జలాలతో కళకళలాడేలా చేసుకోవాలి’ అని కేసీఆర్ అన్నారు. బయ్యారం ఖనిజ నిల్వల విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ ఖనిజం తక్కువ గ్రేడుదన్న ప్రచారంలో నిజం లేదని, అది చాలా నాణ్యమైనదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అక్కడ రూ. 30 వేల కోట్లతో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్) ముందుకొచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 2 వేల కోట్లతో అందులో వాటా తీసుకుంటే.. 10 వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయని సెయిల్ అధికారులు చెప్పినట్లు వెల్లడించారు. కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ, కార్పొరేట్ ఆసుపత్రి, ఇరిగేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామన్నారు. ముంపు ప్రాంతాలపై పునరాలోచించాలి తుమ్మల మాట్లాడుతూ కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. టీఆర్ఎస్లో చేరి సీఎంకు అండ గా నిలవడం ద్వారా ఖమ్మం జిల్లాను తెలంగాణలోనే అగ్రగామిగా చేసేందుకు, విద్యుత్, నీరు, బొగ్గు, ఇతర రంగాల్లో పురోభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ముంపు మం డలాలను తెలంగాణలోనే కలపాలని, దాదాపు రెండున్నర లక్షల మంది ప్రజల గురించైనా ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కేంద్రాన్ని కోరారు. గిరిజనులు వద్దంటున్నా మొండిగా, మూర్ఖంగా వారిని ఏపీలో చేర్చారని మండిపడ్డారు. విడిపోయినప్పటికీ పక్కనున్న తమ్ముళ్లకు కావాల్సిన సహాయం చేసేందుకు, శక్తికి మించి దానం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణను అభివృద్ధిలో గుజరాత్ కంటే ముందు వరసలో కేసీఆర్ నిలపాలని తుమ్మల అభిలషించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు కూడా ఈ సందర్భంగా ప్రసంగించారు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, మదన్‌లాల్, కోరం కనకయ్య తది తరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఎన్నికల సమయంలో పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్‌పై ఆరోపణలు చేసిన వరంగల్ మహిళ రహీమున్నీసా బేగం.. సభ ముగిసిన తర్వాత హఠాత్తుగా వచ్చి ముఖ్యమంత్రి పాదాలపై పడ డం కాస్త కలకలం సృష్టించింది. గతంలో తాను చేసిన తప్పులను క్షమించాలని ఆమె కోరారు.