సాక్షి, ఖమ్మం: తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాలో జిల్లాకు చోటు దక్కలేదు. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావుల మధ్య ఉన్న ఆధిపత్య పోరుతో జిల్లా జాబితాను ప్రకటించేందుకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సాహసించలేదు. ఖమ్మం పార్లమెంటు, అసెంబ్లీ, పాలేరు అసెంబ్లీ స్థానాలపై మా మాట నెగ్గాలంటే.. మా మాట నెగ్గాలని ఇరువురు నేతలు పట్టుతో ఉండడంతో ఈ సీట్లపై సందిగ్ధత నెలకొంది.
తెలంగాణలో టీడీపీ తరఫున బరిలోకి దిగుతున్న అభ్యర్థుల తొలిజాబితాను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం ప్రకటించారు. ఇందులో 27 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. పొరుగున ఉన్న వరంగల్, నల్లగొండ జిల్లాల్లో పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా జిల్లాలో మాత్రం ఒక్క అభ్యర్థిని కూడా తొలి జాబితాలో ప్రకటించలేదు. ఇక్కడి నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతోనే తొలి జాబితాలో జిల్లా అభ్యర్థుల పేరు ఎక్కలేదని సమాచారం. ఒకపక్క తమ అనుచరులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... పైకిమాత్రం అంతా అధిష్టానం చూసుకుంటుందని చెబుతున్నా .. నామా, తుమ్మల ఒకరిపై మరొకరు ఆగ్రహంగా ఉన్నట్లు ఆపార్టీ క్యాడర్ చర్చించుకుంటోంది.
తుమ్మల పాలేరు పయనమయ్యేందుకు సిద్ధం కాగా... అక్కడ తన అనుచరురాలు మద్దినేని బేబిస్వర్ణకుమారికి టికెట్ ఇవ్వాలని నామా పట్టుబడుతున్నారు. అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి ఆమెతో వ్యూహాత్మకంగా నామినేషన్ పత్రాలు తీయించారు. రెండు రోజుల క్రితం నామా పరోక్షంగా తుమ్మలపై చేసిన వ్యాఖ్యలతో ఏకంగా ఎంపీ స్థానానికి పోటీ చేయాలని తుమ్మల వర్గం ఎత్తుకు పై ఎత్తు వేసింది. తాను పాలేరుకు వెళ్తే ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని తన అనుచరుడు ఎమ్మెల్సీ బాలసానికి ఇప్పించాలన్న యోచనలో తుమ్మల ఉన్నారు. ఈ స్థానానికి కూడా నామా తన అనుచర అభ్యర్థిగా మరోనేతకు ఇవ్వాలని పట్టుబడుతుండడం తుమ్మల వర్గానికి ఆగ్రహం తెప్పిస్తోంది. నామా పెత్తనానికి చెక్ పెట్టేదిశగా తుమ్మల అడుగులు వేస్తుండగా.. ఇదే స్థాయిలో తుమ్మల వర్గాన్ని ఈ ఎన్నికలతోనే నిలువరించాలన్న యోచనలో నామా కూడా సీట్ల విషయంలో తన పంతం నెగ్గించుకోవాలన్న బెట్టుతో ఉన్నారు.
తమ్ముళ్లలో టెన్షన్.. టెన్షన్..
జిల్లాలో పార్టీకి ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నా వారిలో ఒక్కరికి కూడా తొలి జాబితాలో చోటు దక్కకపోవడంతో.. ఏంజరుగుతుందోనని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. నామినేషన్‌కు మరో రెండు రోజులే గడువు ఉండడంతో ఆశావాహులతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల్లో టెన్షన్ నెలకొంది. తమ నేతకు ఎక్కడ టికెట్ ఇస్తారు..? టికెట్ల విషయంలో ఎవరిది పై చేయి అవుతుంది..? అని ఇరువర్గాల నేతలు చర్చించుకుంటున్నారు. తమ నేతలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని అనుచర నాయకులు తాడోపేడో తేల్చుకునేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది.
బీజేపీతో పొత్తును విభేదిస్తూ..
ఒకపక్క నేతల విభేదాలతో సతమతమవుతున్న తెలుగుదేశం పార్టీకి మరో కొత్త సమస్య వచ్చిపడింది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని ఆపార్టీలోని మైనార్టీ నేతలు తీవ్రంగా విభేదిస్తున్నారు. తమ మనోభావాలకు వ్యతిరేకమైన పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటారని వారు భగ్గుమంటున్నారు. పార్టీ ఒంటెత్తు పోకడలను నిరసిస్తూ కొంతమంది నేతలు రాజీనామా బాటలో ఉన్నట్లు సమాచారం. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ఈ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపాలన్న దిశగా మైనార్టీ నేతలు అడుగులు వేస్తున్నారు. పార్టీలో మైనార్టీలకు అన్యాయం జరుగుతోందని నిరసిస్తూ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బడే సాహెబ్ ఖమ్మం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ జెండాలను మోసేందుకే తమను ఉపయోగించుకుంటున్నారని, టికెట్ల విషయంలో తమకు మొండిచేయి చూపుతున్నారని ‘సాక్షి’ ఎదుట ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ తొలిజాబితాలో జిల్లా ఊసే లేదు
Published Tue, Apr 8 2014 3:19 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement
Advertisement