సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రుణమాఫీపై రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. ఒక్క కుటుంబంలో నాలుగు ఖాతాలు ఉంటే నాలుగు అకౌంట్స్‌కు రుణమాఫీ జరుగుతుందని కామెంట్స్ చేశారు.
కాగా, మంత్రి తుమ్మల శనివారం సచివాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆనాడు దివంగత వైఎస్సార్ ప్రభుత్వంలో రుణమాఫీ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా రుణమాఫీ జరుగుతోంది. ఆధార్, బ్యాంక్ అకౌంట్, ఆర్‌బీఐ తప్పిదాల వల్ల రుణమాఫీ రిజెక్ట్ అయితే 24 గంటల్లోనే వివరణ ఇస్తారు. రైతులు ఆందోళన చెందకండి. పాత పద్దతిలోనే రుణమాఫీ అమలు జరుగుతుంది.
సాంకేతిక అంశాల కారణంగా ఇబ్బంది కలిగితే ప్రతీ బ్యాంక్ వద్ద అధికారులు అందుబాటులో ఉంటారు. ఒక్క కుటుంబంలో నాలుగు ఖాతాలు ఉంటే నాలుగు ఖాతాల్లో రుణమాఫీ జరగుతుంది. రుణమాఫీపై కొంత మంది కావాలనే రాజకీయం చేస్తున్నారు. వారి వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు.
రుణమాఫీ మొత్తం సెప్టెంబర్ నెల పూర్తి అయ్యేలోపు రైతుల ఖాతాలోకి జమ అవుతాయి. మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఆధార్ సాంకేతిక సమస్య ఉంది. ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టే బడాబాబులు, ప్రజాప్రతినిధులకు రుణమాఫీ కాదు. ఒకేరోజు 500 ఖాతాల్లో రుణం డబ్బులు జమ అయ్యాయి. వాటిపై విచారణ జరుగుతుంది. ఐదారు కోపరేటివ్ సొసైటీ బ్యాంకుల రుణాలపై అనుమానాలు ఉన్నాయి. అవి రెండు వేల ఖాతాలు ఉన్నాయి. 44లక్షల రైతుల ఖాతాలు, 25లక్షల కుటుంబాలు ఉన్నాయి. వీరందరికీ రుణమాఫీ జరుగుతుంది’ అని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment