రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ రైతు ధర్నా.. తిరుమలగిరిలో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని పేర్కొంటూ, ఇందుకు నిరసనగా భారత్ రాష్ట్ర సమితి గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపు మేరకు రైతులతో కలిసి బీఆర్‌ఎస్ నేతలు, పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా మండల, నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన రైతు ధర్నాలో పాల్గొన్నారు. రుణమాఫీపై ప్రభుత్వం తీరును ఎండగట్టారు. రేవంత్ ప్రభుత్వం మెడలు వంచి సంపూర్ణ రైతు రుణమాఫీ జరిగేంతవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.
కేటీఆర్ చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు రైతు ధర్నాలో పాల్గొన్నారు. రైతులతో కలిసి నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నారు. ఆలేరు, జనగామ నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ధర్నాలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో దేవుళ్ల మీద ఒట్లు వేసి సీఎం రేవంత్ రైతులను మోసగించారంటూ, ఆయన చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపం కాకుండా రక్షించాలని యాదాద్రి ఆలయం తూర్పు రాజగోపురం వద్ద హరీశ్‌రావు పాప పరిహార పూజలు చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ కార్యక్రమాలు, పరస్పర దాడులతో ఉద్రిక్తత నెలకొంది.
ఈ సందరభంగా గాయపడిన బీఆర్‌ఎస్ కార్యకర్తలను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌కుమార్ పరామర్శించారు. కొన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై బీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని ధర్నా శిబిరాల్లో రైతులు, బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట ఎమ్మె ల్సీలు, ఇతర నేతలు ధర్నాకు నేతృత్వం వహించారు.
తిరుమలగిరిలో రాళ్లు, కోడిగుడ్లతో పరస్పరం దాడులు
తిరుమలగిరి (తుంగతుర్తి): సూర్యాపేట జిల్లా తిరుమల గిరిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు గురువారం పోటాపోటీగా చేపట్టిన కార్యక్రమాలు ఉద్రిక్తతకు దారితీశాయి. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ నేతలు పట్టణ చౌరస్తాలో ధర్నాకు దిగారు. ఇందుకు పోటీగా అదే ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందని హర్షం వ్యక్తం చేస్తూ ర్యాలీ చేపట్టారు. బీఆర్‌ఎస్ శిబిరం వద్ద పలువురు నాయకులు మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుకూలంగా నినాదాలు చేస్తూ బీఆర్‌ఎస్ శిబిరం వైపు వెళ్లడానికి ప్రయత్నించారు.
పోలీసులు అడ్డుకున్నప్పటికీ కొంతమంది నాయకులు బారికేడ్లను తోసుకొని శిబిరం వద్దకు వెళ్లడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు కోడిగుడ్లు, రాళ్లు, టమాటాలు విసురుకున్నారు. దీంతో ప్రజలు, ఆర్టీసీ ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రాళ్లు రువ్విన సంఘటనలో రెండు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇరు పార్టీల నాయకులకు స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీ చేసి అందరినీ చెదరగొట్టారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. సూర్యాపేట డీఎస్పీ రవి ఆధ్వర్యంలో సాయంత్రం వరకు పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.
సీఎం డైరెక్షన్‌లోనే బీఆర్‌ఎస్‌పై దాడులు: జగదీశ్‌రెడ్డి
సంపూర్ణ రైతురుణ మాఫీ కోసం తిరుమలగిరిలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌లోనే బీఆర్‌ఎస్‌పై దాడులు జరుగుతున్నా యని ఆయన ఆరోపించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment