తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు
రుణమాఫీపై ఎక్కడికి రమ్మంటావో చెప్పు
సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్
రైతులందరికీ రుణమాఫీ ఇచ్చేంత వరకు వదిలిపెట్టబోమని హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: ‘రైతు రుణమాఫీని పాక్షికంగా అమలు చేసి లక్షలాది మంది రైతులకు ఎగనామం పెట్టి.. సీఎం నోరు పెద్దగా చేసుకుని మాట్లాడితే లాభం ఉండదు. బూతులు తిడితే రుణమాఫీ జరిగి రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయా. దమ్ముంటే ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందో శ్వేతపత్రం విడుదల చేయి. తప్పు జరిగిందని రైతులకు క్షమాపణ చెప్పి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి’ అని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘రుణమాఫీలో కోతలపై ప్రశ్నిస్తే మేము చావాలని రోత మాటలు మాట్లాడుతున్నాడు. నీ గాడ్ ఫాదర్‌కే భయపడలేదు. తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు. రైతులందరికీ రుణమాఫీ వర్తించేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్‌ను వదిలి పెట్టం. బీఆర్‌ఎస్ పక్షాన మరో రైతాంగ ఉద్యమానికి త్వరలో కార్యాచరణ ప్రకటించి పోరాటం చేస్తాం’ అని హరీశ్‌రావు ప్రకటించారు. సిద్దిపేటలో తన క్యాంపు ఆఫీసుపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ ఇలాంటి దాడులకు భయపడేది లేదని, ఇది ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ఎక్కడికి రమ్మంటావో దమ్ముంటే చెప్పు
‘రైతులందరికీ రుణమాఫీ జరిగిందని మభ్యపెడుతూ మోసగిస్తున్న రేవంత్‌రెడ్డి సిద్దిపేట, కొడంగల్ సహా ఏ నియోజకవర్గానికి ఏ తేదీన, ఏ టైమ్‌కు రావాలో దమ్ముంటే చెప్పాలి. రైతులందరికి రుణమాఫీ జరిగిందని నిరూపించాలి. ఆగస్టు 15లోపు రూ.2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారంటీల సంపూర్ణ అమలు చేయాలనే నా డిమాండ్‌ను పక్కన పెట్టి నేను రాజీనామా చేయాలని రంకెలు వేస్తున్నవు. రుణమాఫీ జరగని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటూ వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతూ అధికారుల కాళ్ల మీద పడుతున్నరు.
అయినా ప్రభుత్వం కళ్లు, చెవులు, నోరు లేనట్లు వ్యవహరిస్తోంది’ అని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ‘పరిపాలన ఫ్లాప్.. తొండి చేయడంలో తోపు.. బూతులు మాట్లాడ్డంలో టాప్ అన్నట్లుగా రేవంత్ పనితీరు ఉంది. 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగవేసినట్లు ప్రభుత్వ రికార్డులే చెప్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రుణమాపీ అర్హుల సంఖ్య 47 లక్షలుగా చూపి, మూడు విడతల్లో 22 లక్షల మందికే వర్తింప చేశారు’ అని చెప్పారు.
ప్రజలకు కీడు చేయొద్దని వేడుకుంటా..
‘ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తానంటూ గుడులు, చర్చి, మసీదు సాక్షిగా హిందూ, క్రిస్టియన్లు, ముస్లింలు నమ్ముకున్న దేవుళ్లపై రేవంత్ ఒట్లు వేసి మాట తప్పి రైతు, దైవద్రోహానికి పాల్పడ్డాడు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పిన పాపం ఊరికే పోదు. అది రాష్ట్రానికి చుట్టుకుంటుందని ప్రజలు భయపడుతున్నారు. ప్రాయశ్చిత్తం చేసుకునే ఉద్దేశం సీఎంకు లేదు కాబట్టి ఆయన చేసిన పాపం ప్రజలకు శాపం కావద్దని మా పార్టీ నేతలతో కలిసి నేను తీర్థయాత్రకు బయలుదేరుతా.
ఈ పాపాత్ముడు చేసిన తప్పులకు ప్రజలకు కీడు చేయొద్దని ముక్కోటి దేవతలతోపాటు అల్లా, జీసస్‌ను వేడుకుంటా. త్వరలో పర్యటన షెడ్యూలు ప్రకటిస్తా’ అని హరీశ్ చెప్పారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, మాణిక్‌రావు, కేపీ వివేకానంద, చింతా ప్రభాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment