టార్గెట్ తుమ్మల
సాక్షి, ఖమ్మం:జిల్లాలో టీడీపీ బలంగానే ఉందంటూ నిరూపణకు ఆ పార్టీ నేతలు తీవ్ర ప్రయత్నమే చేశారు. పార్టీని వీడిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు వల్ల వచ్చిన నష్టమేమీ లేదన్న భావన కార్యకర్తలకు కలిగించడానికి పడరాని పాట్లు పడ్డారు. పార్టీపై ఆయన ప్రభావం ఏమీ లేదని చెబుతూనే ఆయన పార్టీకి ద్రోహం చేశారంటూ మాట్లాడిన ప్రతి వక్త తుమ్మలనే టార్గెట్ చేశారు. కార్యకర్తల భవిష్యత్ కార్యకలాపాలపై దిశానిర్దేశం చేయాల్సిన నేతలు ఆ విషయానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వకుండా సమావేశం అంతా తుమ్మలపైనే గురి పెట్టారు. టీడీపీ జిల్లా పార్టీ ఎంపిక చేసిన రైతు కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు శుక్రవారం ఖమ్మం నగర సమీపంలోని గణేష్ గార్డెన్స్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి వ్యూహాత్మకంగానే శాసనసభా పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉపనేత రేవంత్‌రెడ్డిని ముఖ్యఅతిథులుగా ఆహ్వానించినట్లు సమాచారం. తుమ్మలపై ఎదురుదాడి చేయడం, ఉన్న కేడర్ ఇతర పార్టీల వైపు చూడకుండా వారికి ధైర్యాన్ని ఇచ్చేలా మాజీ ఎంపీ నామా డెరైక్షన్‌లో ఈ సమావేశం జరిగింది. పది రోజుల ముందుగానే రాష్ట్రపార్టీ నేతలను ఇక్కడికి తీసుకురావాలని జిల్లా నాయకులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయంతోపాటు జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని ఆ పార్టీ ఏర్పాటు చేసింది. దీనికి ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డితోపాటు రాష్ట్రనేతలు పెద్దిరెడ్డి, బడుగు లింగయ్య యాదవ్, జిల్లా నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి ముందు నయాబజార్ కళాశాలనుంచి గణేష్ గార్డెన్ వరకు రాష్ట్రస్థాయి నేతలతోపాటు జిల్లానేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.
దీంతో నగరంలో పార్టీ కేడర్‌తో నేతలు బలనిరూపణకు దిగారు. ర్యాలీ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. తొలుత పోట్ల నాగేశ్వరరావు తుమ్మల గురించి సమావేశంలో ప్రస్తావించడంతో కార్యకర్తలు ఒక్కసారిగా డౌన్ డౌన్ తుమ్మల... జై..జై నామా నినాదాలు చేశారు. తుమ్మల మంత్రి పదవి కోసమే ‘కారు’ ఎక్కాడని ఆరోపణలు చేయడంతో ఈ నినాదాలు ఇంకా పెద్ద పెట్టున చేశారు. ఇలా మూడు గంటలపాటు నాయకులంతా తుమ్మలపై ఆరోపణలు, విమర్శలు చేస్తూ ప్రసంగించారు.
బుల్లెట్‌లా తుమ్మలపై రేవంత్‌రెడ్డి విమర్శలు..
ఇటీవల అసెంబ్లీలో ఉపనేతగా రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ సమవేశం సందర్భంగా ఆయన ఫొటోలు పెద్దగా పెట్టి ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ‘తుమ్మల పార్టీని వీడితే ఉల్లిగడ్డ మీద పొట్టే పోయింది..కండువ వేయించుకుని కౌగిలించుకున్నాడు.. 32 ఏళ్లు పార్టీ కార్యకర్తలు భుజానికి ఎత్తుకుంటే వారి గుండెల మీద తన్ని కేసీఆర్ పంచన చేరాడు. దమ్ముంటే ముఖ్యమంత్రితో మాట్లాడి ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు పెట్టించు.. నీ సత్తా ఏమిటో.. మా సత్తా ఏమిటో తెలుస్తుంది’ అని రేవంత్‌రెడ్డి తుమ్మలపై తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు. ఇలా రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్నంత సేపూ కార్యకర్తలు తెలంగాణ బుల్లెట్ అంటూ నినాదాలు చేయడంతోపాటు తుమ్మల డౌన్ డౌన్ అంటూ నినదించారు.
అలాగే శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా తుమ్మల టార్గెట్‌గా విమర్శలు చేయడం గమనార్హం. ‘తుమ్మల, నేను 1983 ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పార్టీ తరుపున పోటీ చేశాం. అప్పుడు ఆయన ఓడిపోయాడు.. నేడు ఓడిపోయాను. ఆతర్వాత నేను గెలిచాను. ఆయన గెలిచినా నేను ఒక్కసారి కూడా మంత్రి కాలేదు. తుమ్మలకే అవకాశం దక్కింది. జిల్లాలో ఏకైక నాయకుడిగా ఎదిగాడు. ఇలా కార్యకర్తలను పీడించే నాయకుడయ్యాడు. ఇప్పుడు మంత్రిపదవి కోసం కక్కుర్తి పడి టీఆర్‌ఎస్‌లో చేరాడు’ అని బలమైన విమర్శలు చేశారు. ఇలా ప్రసంగించిన వారంతా తుమ్మలపై ఉన్న తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా తుమ్మలనే టార్గెట్ చేశారు.
సభ్యత్వ నమోదుపై అసహనం..
ఈ సమావేశంలో తెలంగాణలోనే ఖమ్మం జిల్లా ముందంజలో ఉందని ప్రశంసిస్తూనే మరోవైపు సభ్యత్వ నమోదులో వెనుకంజ లో ఉన్న నేతలపై రాష్ట్రస్థాయి నేతలు మొట్టికాయలు వేశారు. తెలంగాణ రాష్ట్ర సభ్యత్వ నమోదు ఇంచార్జి పెద్దిరెడ్డి ఒక్కో నియోజకవర్గం సభ్యత్వ నమోదును వివరిస్తూ.. ఇంకా సభ్యత్వ నమోదును పెంచాలని సూచించారు. అయితే ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ జిల్లాలో సభ్యత్వ నమోదులో ముందంజలో ఉన్న మాట వాస్తవమేనని, కొన్ని నియోజకవర్గాల్లో అతి తక్కువగా ఉందని ప్రస్తావించారు. ఇకనుంచి ఆ నియోజకవర్గం నేతలు హైదరాబాద్ రా కుండా జిల్లాలోనే ఉంటూ సభ్యత్వ నమో దు చేయించాలని సూచించడం గమనార్హం.