సచివాలయంలో టీడీపీ ఎమ్మెల్యేల హల్‌చల్
విద్యుత్ సమస్యపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శిని కలిసేందుకు పట్టు
అపాయింట్‌మెంట్ సమయం ముగిసిన తరువాత వచ్చిన నేతలు
చాంబర్ ఎదుట బైఠాయింపు.. ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు
హైదరాబాద్: విద్యుత్ సమస్యపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషికి వినతిపత్రం ఇచ్చేందుకు సచివాలయానికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నేతలు హల్‌చల్ సృష్టించారు. ఇచ్చిన అపాయింట్‌మెంట్ సమయం దాటిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన నేతలు ఆయన చాంబర్‌లో లేకపోవడంతో అక్కడే బైఠాయించా రు. ముఖ్య కార్యదర్శి వచ్చే వరకు కదిలేది లేదంటూ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు గంట తరువాత ముఖ్య కార్యదర్శి వ్యక్తిగత కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చి వెనుదిరిగారు. రాష్ట్రంలో నెల కొన్న విద్యుత్ సమస్యపై గురువారం ఆందోళన చేయాలని తెలంగాణ టీడీపీ నేతలు ముందుగానే నిర్ణయించుకున్నారు. విద్యుత్ సౌధ ఎదుట ధర్నా ఉంటుందని.. అందరూ అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయానికి రావాలని ఎమ్మెల్యే లు, ఎంపీలతో పాటు హైదరాబాద్ జిల్లా పార్టీ నాయకులకు సమాచారం కూడా ఇచ్చారు.
ఉదయం 11 గంటలకే టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉప నేత రేవంత్‌రెడ్డి, ఎంపీ గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యేలు జి.సాయన్న, మాగంటి గోపీనాథ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు సి.కృష్ణయాదవ్ తదితరులు అసెంబ్లీ ఆవరణలోకి చేరుకున్నారు. ప్రకాశ్‌గౌడ్, వివేకానంద తదితర ఎమ్మెల్యేలంతా వచ్చిన తరువాత సమావేశమై కార్యాచరణపై చర్చించారు. అయితే ధర్నా చేపట్టాలన్న ఆలోచనను విరమించి.. సచివాలయంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషికి వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించుకున్నారు. ఇచ్చిన సమయానికి టీడీపీ నాయకులు రాకపోవడంతో జోషి బయటికి వెళ్లిపోయారు. దీంతో టీడీపీ నేతలు చాంబర్ ముందే బైఠాయించి... జోషి వచ్చి తమ వినతిపత్రం తీసుకునేంత వరకు కదిలేది లేదని భీష్మించారు. దాదాపు గంట సేపటి అనంతరం జోషి వ్యక్తిగత కార్యదర్శికి వినతి పత్రం అందజేసి వెనుదిరిగారు. సచివాలయంలో ఆందోళన చేస్తున్న టీడీపీ నేతల వద్దకు వచ్చి పలు ప్రశ్నలు సంధించిన మీడియా ప్రతినిధులపై ఎర్రబెల్లి, రేవంత్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గేటు బయటే పలువురు నేతల అరెస్టు..
ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కలిసేందుకు టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు హైదరాబాద్ జిల్లా నేతలు కూడా సచివాలయానికి తరలివచ్చారు. అయితే భద్రతా కారణాల రీత్యా ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణయాదవ్‌ను మాత్రమే సిబ్బంది లోనికి అనుమతించారు. దీంతో టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టగా మేకల సారంగపాణి, కూన వెంకటేశ్‌గౌడ్, ఆనంద్‌గౌడ్, సత్యనారాయణ మూర్తి, అవినాష్‌రెడ్డి, చందు, తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి అనంతరం వదిలేశారు.
మోసం చేస్తున్నారు..: ఎర్రబెల్లి
‘‘విద్యుత్ కోతలతో పొలాలు, మొక్కజొన్న ఎండిపోతున్నయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు మార్గాలు చూడాలంటూ వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే.. అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి జోషి తాళం వేసుకొని వెళ్లిపోయాడు. కేసీఆర్,కేటీఆర్, హరీశ్‌లలో ఎవరు ఫోన్ చేసి టీడీపీ నేతలను కలవద్దన్నారో తెలియదు.’’
మేం దొంగలమా..?: రేవంత్‌రెడ్డి
‘‘సచివాలయంలోకి ఎమ్మెల్యేలు వస్తే చెకింగ్ పేరుతో పోలీసులు 45 నిమిషాలు ఆపేశారు. మేం దొంగలమా? వినతిపత్రం ఇవ్వకుండా చేసేందుకే ఇదంతా చేశారు. రైతులు చచ్చిపోతుంటే ముఖ్యమంత్రి హుస్సేన్‌సాగర్‌కు విహారయాత్రకు వెళ్లారు. విద్యుత్‌శాఖకు మంత్రి లేడు. కేసీఆరే చూస్తాడంట. పరిస్థితి తీవ్రతను ఆయన పట్టించుకోవడం లేదు.’’
చంద్రబాబు ద్రోహం వల్లే చీకట్లు : హరీశ్
సంగారెడ్డి: టీఆర్‌ఎస్ పార్టీని బద్నాం చేసేందుకే తెలంగాణ టీడీపీ నేతలు కరెంటు కోతల పేరిట ధర్నాలు చేస్తూ నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. టీడీపీ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ఎదుట కాకుండా తెలంగాణలో చీకట్లకు కారణమైన చంద్రబాబు ఎదుట ధర్నా చేయాలని హి తవు పలికారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, విద్యుత్ సరఫరా విషయంలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండానే టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కరెంట్ విషయంలో తెలంగాణకు ముమ్మాటికి ద్రోహం తలపెట్టింది చంద్రబాబేనని విమర్శించారు.