కేసీఆర్ వల్లే కరెంటు కష్టాలు
అఖిలపక్షం పెడితే నిరూపిస్తా
అలాకాకుంటే ముక్కు నేలకు రాస్తా
టీఆర్‌ఎస్‌కు ఎర్రబెల్లి సవాల్
హన్మకొండ: తెలంగాణలో విద్యుత్ సమస్యలకు సీఎం కేసీఆర్ కారణమని అఖిలపక్ష సమావేశంలో నిరూపించలేకపోతే హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ముక్కు నేలకు రాస్తానని టీడీపీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్, పాలకుర్తిలో సోమవారం మీడియాతో మాట్లాడారు. విద్యుత్ సమస్యపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే ధైర్యం పాలకపక్షానికి లేదన్నారు.
కరెంటు శాఖను తమకు అప్పగిస్తే నెలరోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని, లేని పక్షంలో రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. మావోల సమస్య వల్లే ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంటు కొనుగోలుపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్న మాటకు కట్టుబడి ఉంటారా? అని టీఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు.