మాటకు మాట
తుమ్మలే లక్ష్యంగా టీడీపీ- టీఆర్‌ఎస్‌ల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. టీడీపీ రాష్ట్రస్థాయి నేతలు వారంరోజుల క్రితం రాజేసిన అగ్గి ఆ పార్టీ నుంచి వలసపోయి టీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులకు మంట పుట్టించింది. ఆ రోజు నుంచి విమర్శలు..ప్రతివిమర్శలతో ఇరుపార్టీల నేతలు దూషించుకోవడం నిత్యకృత్యమైంది. పదవుల కోసమే పార్టీ వీడారన్న టీడీపీ అగ్రశేణి నాయకుల విమర్శను తుమ్మల అనుయాయులు తిప్పికొట్టే పనిలో ఉన్నారు.
నామా ఏకపక్ష ధోరణి వల్లే టీడీపీ దెబ్బతిన్నదని దుయ్యబట్టారు. పదవుల కోసం తాము పార్టీ వీడినట్టయితే రాజీనామా చేయడానికి సిద్ధమని టీఆర్‌ఎస్‌లో కొత్తగా చేరిన నేతలు సవాల్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా తుమ్మల అనుయాయులు మినహా టీఆర్‌ఎస్ జిల్లా నాయకత్వం స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన విమర్శల అగ్గి ఇంకా రగులుతూనే ఉంది. వారం రోజుల క్రితం రాజుకున్న ఈ మాటల యుద్ధం కొనసాగుతోంది. సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడం షరామామూలే అయింది. జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శించి ఆర్థిక సహాయం చేసే పేరుతో టీడీపీ రాష్ట్ర ముఖ్యనేతలు జిల్లాలో పర్యటించారు.
ఈ సందర్భంగా జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావును లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పార్టీ వీడిన మాజీమంత్రి తుమ్మలను టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి ఉల్లిగడ్డ పొట్టుతో పోల్చారు. తుమ్మల పార్టీని వీడినా నష్టమేమీ లేదన్నట్లు మాట్లాడకొచ్చారు. టీడీపీ నుంచి వలస వచ్చిన జిల్లా టీఆర్‌ఎస్ నేతలు కూడా తెలుగుదేశంపై అదేస్థాయిలో విరుచుకుపడ్డారు.
విమర్శలు- ప్రతివిమర్శలు
టీడీపీని భ్రష్టుపట్టించింది మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావేనని, ఆయన ఏకపక్ష విధానాలతో పార్టీని కార్యకర్తలకు దూరం చేశారని దుమ్మెత్తిపోశారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కొండబాల కోటేశ్వరరావు తీవ్రస్థాయిలో టీడీపీ నేతల వ్యవహారశైలిని దుయ్యబట్టారు.
పార్టీ గుర్తులతో గెలిచి పదవులనుభవిస్తున్న వాళ్లు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షులు తుళ్లూరి బ్రహ్మయ్య సవాల్ విసిరారు. పార్టీ గుర్తులతో గెలిచిన జిల్లా పరిషత్‌చైర్మన్, జెడ్పీటీసీలు, పార్టీ అండతో గెలుపొందిన డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్‌లు, ఎంపీపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
దీనికి ప్రతీగా జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవితతో కలిసి డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పదేపదే తుమ్మల, నిజాయితీగా టీడీపీకి సేవలందించి టీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు దమ్ముంటే ఇప్పుడున్న వారి పదవులకు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలన్నారు.
తాను డీసీసీబీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఏకంగా రాజీనామా పత్రాన్నే చూపించారు. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు.. ఆంధ్రప్రదేశ్‌లో ఓ పార్టీ నుంచి గెలిచి టీడీపీలో చేరి పదవులనుభవిస్తున్న వారి చేత రాజీనామా చేయిస్తే తాము తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమవుతామని విజయ్‌బాబు అన్నారు. తాను పోటీచేసి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కూడా సిద్ధమేనన్నారు. దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని విజయ్‌బాబు విసిరిన మరో సవాల్ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది.
తుమ్మలకు అనుకూలంగా..వ్యతిరేకంగా..
తుమ్మలనే లక్ష్యంగా చేసుకున్న టీడీపీ నేతలు మాత్రం కార్యకర్తల కష్టంతో మంత్రిస్థాయి వరకు వెళ్లిన తుమ్మల నాగేశ్వరరావు పార్టీని వీడి కార్యకర్తల గుండెల మీద తన్నాడని ధ్వజమెత్తగా.. టీడీపీని ఎవరు భ్రష్టుపట్టించారో... ఎవరి హయాంలో పార్టీ అభివృద్ధి చెందిందో.. ఎవరి నియంతృత్వంతో కనీసం పూర్తిస్థాయి జిల్లా కమిటీని వేసుకోలేని పరిస్థితి వచ్చిందో చర్చించడానికి తాము సిద్ధమని తుమ్మల అనుయాయులు ప్రతిస్పందించారు.
జిల్లాలో టీడీపీని బలోపేతం చేసుకునే వ్యూహంలో భాగంగానే టీఆర్‌ఎస్‌లోకి వలస వెళ్లిన నాయకులను లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ విమర్శలు చేస్తోందని, ఇందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం సైతం సానుకూలంగా స్పందించడంతో సభలు, సమావేశాలు నిర్వహించి విమర్శలు చేస్తుండటంతో..టీడీపీ వలస నేతలు సైతం ఘాటుగానే స్పందిస్తున్నారు. టీడీపీ రాష్ట్రనేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి ‘అన్నం పెట్టిన పార్టీకి తుమ్మల సున్నం పెట్టారు’ అని తీవ్ర విమర్శ చేశారు.
దీన్ని టీడీపీ వలస నేతలు తీవ్రంగా ఖండించారు. టీడీపీ వలస నేతల మినహా టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ ఈ విషయంలో ఇంతవరకు స్పందించపోవడం చర్చనీయాంశంగా మారింది. గత వారం రోజులుగా ‘మీరు రాజీనామా చేయాలంటే మీరు రాజీనామా చేయాలంటూ’ విమర్శల పర్వం మొదలుపెట్టిన నేతలు రెండురోజులుగా స్వరం మరింతగా పెంచారు.
ఎన్నికలకు ముందు నామా నాగేశ్వరరావు వద్ద రూ.5 కోట్లు తీసుకుని ఆయన వల్లే ఓడిపోయానని తుమ్మల తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య చేసిన ఆరోపణలు టీడీపీ-టీఆర్‌ఎస్‌ల మధ్య అగాధాన్ని మరింతగా పెంచాయి. తుమ్మలకు డబ్బిచ్చినట్లుగా నామా చెప్పగలరా? అని టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య నెలకొన్న విమర్శల వేడి ఎప్పటికి చల్లారుతుందో కాలమే నిర్ణయించాలి.