టీఆర్‌ఎస్‌తో బేరసారాలు నిజమే!
టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి అంగీకారం
రేవంత్ భేటీ అందులో భాగమేనని వ్యాఖ్య
హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపిన మాట వాస్తవమేనని, అందులో భాగంగానే తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో సమావేశమయ్యారని టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం చెప్పుకొచ్చారు. రేవంత్‌రెడ్డి ఉదంతం వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది కదా అని విలేకరులు ప్రశ్నించగా అదంతా విచారణలో తేలుతుందని వ్యాఖ్యానించారు. తాను కూడా 15 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడానని, వారిలో చాలా మంది ఓటేసేందుకు కూడా ఒప్పుకున్నారని చెప్పారు.
అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్‌ఎస్ ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చు చేసిందని ఆయన ఆరోపించారు. 63 మంది ఎమ్మెల్యేలతో ముగ్గురు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న చోట ఐదుగురిని నిలబెట్టి కొనుగోళ్లకు దిగిందని విమర్శించారు. టీడీపీ, కాంగ్రెస్, బీఎస్‌పీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన సీఎం కేసీఆర్.... సొంత పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలకు కూడా రూ. 5 కోట్ల చొప్పున ఇచ్చారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే రేవంత్‌రెడ్డిని కావాలని కేసీఆర్ ఏసీబీ కేసులో ఇరికించారని దుయ్యబట్టారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని, అప్పుడే నిజానిజాలు తెలుస్తాయని డిమాండ్ చేశారు.