తెలంగాణ ఉద్యమమప్పుడు చంద్రబాబుకు రేవంత్‌ ఏజెంట్‌ | Telangana: Minister Errabelli Dayakar Rao Comments On Revanth Reddy | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఉద్యమమప్పుడు చంద్రబాబుకు రేవంత్‌ ఏజెంట్‌

Published Sat, Apr 23 2022 4:15 AM | Last Updated on Sat, Apr 23 2022 4:15 AM

Telangana: Minister Errabelli Dayakar Rao Comments On Revanth Reddy - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న ఎర్రబెల్లి. చిత్రంలో మల్లేశం, పల్లా, ఎల్‌. రమణ 

సాక్షి, హైదరాబాద్‌: అప్పట్లో తెలుగుదేశం పార్టీలో తాము తెలంగాణ కోసం కొట్లాడుతుంటే ఆ పార్టీలో పనిచేసిన ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాత్రం చంద్రబాబుకు ఏజెంట్‌గా పనిచేశారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రేవంత్‌ ఏ పార్టీలో కొనసాగినా ఆ పార్టీ భూస్థాపితం అవుతుందని, ఆయన నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చేవి సున్నా స్థానాలని ఎద్దేవా చేశారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎల్‌.రమణ, యెగ్గె మల్లేశంతో కలసి శుక్రవారం ఆ పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌లోనే ఎవరూ విలువనివ్వడం లేదని, రైతుల కోసం పైసా మేలు చేయని కాంగ్రెస్‌ పార్టీ రైతు సంఘర్షణ పేరిట సభ పెట్టడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. అంతర్గత కలహాలతో కొట్టుకుచస్తున్న కాంగ్రెస్‌ నేతల సంగతి చూసుకోవాలని రేవంత్‌కు హితవు పలికారు. ధాన్యం కొనకుండా మిల్లర్లను వేధిస్తున్న కేంద్రానికి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రేవంత్‌ వత్తాసు పలుకుతున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు.

చేతనైతే కేంద్ర నిధులు ఇప్పించండి
యాసంగి ధాన్యం కొనుగోలులో రాష్ట్రం భరించే రూ.3 వేల కోట్ల నష్టాన్ని చేతనైతే కేంద్ర నిధులతో పూడ్చే ప్రయత్నం చేయాలని కిషన్‌రెడ్డికి ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. తెలంగాణ వ్యతిరేకి అనే ముద్రను కిషన్‌రెడ్డి వేసుకోవద్దని, ఆయన తీరు ఇలాగే ఉంటే రాజకీయంగా నూకలు చెల్లడం ఖాయమన్నారు.

జూబ్లీహిల్స్‌లో అడుగడుగునా రేవంత్‌ బ్లాక్‌మెయిలింగ్‌ ఆనవాళ్లు ఉంటాయని, రేవంత్‌ను మించిన డ్రగ్‌ అడిక్ట్‌ వేరేవరూ లేరని విమర్శించారు. కేసీఆర్‌ గురించి పిచ్చిగా మాట్లాడితే రేవంత్‌ నాలుక చీరేస్తామని హెచ్చరించారు. 10 ఎకరాలకు మించని స్థలంలో వరంగల్‌ సభకు పది లక్షల మందిని ఎలా తెస్తారని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement