అర్థరాత్రి కేసీఆర్తో ఎర్రబెల్లి మంతనాలు
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీలో మెట్రో రైలు చిచ్చు కొనసాగుతూనే ఉంది. పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డిల మధ్య మెట్రో వివాదం తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అసంతృప్తిగా ఉన్న ఎర్రబెల్లి.... అర్థరాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్తో... ఆయన క్యాంప్ కార్యాలయంలో మంతనాలు జరిపినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. . ఎల్ అండ్ టీ లేఖలు, భూముల బదలాయింపు, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం రెండు గంటల పాటు జరిగినట్లు సమాచారం. గన్మెన్ను సైతం తీసుకు వెళ్లకుండా ఎర్రబెల్లి ఈ భేటీకి వెళ్లినట్లు సమాచారం.
దీంతో ఎర్రబెల్లి పార్టీ మారుతారనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. టీడీపీని వీడి ఆయన టీఆర్ఎస్లో చేరుతారనే కథనాలు జోరందుకున్నాయి. కేసీఆర్ తో పాటు ఎర్రబెల్లి టీఆర్ఎస్లోని ముఖ్యనేతలతోనూ వరుసగా భేటీ అవుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవైపు ఈ భేటీని టీఆర్ఎస్ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి.
అయితే కేసీఆర్ను కలిసినట్లు వస్తున్న కథనాలను ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. తాను తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మెట్రో వ్యవహారంపై చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడిన తర్వాతే కేసీఆర్ను కలిసినట్లు ఆయన చెబుతున్నాయి. అయితే ఎర్రబెల్లి మాత్రం మీడియాకు అందుబాటులోకి లేకపోవటం విశేషం.