MLA Stephenson
-
తుది దశకు ఓటుకు కోట్లు కేసు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ నెల 8న తుది విచారణ నేపథ్యంలో ఈ కేసులో ఫిర్యాదుదారైన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్, అతడి మిత్రుడు, కేసులో ప్రధాన సాక్షి మాల్కం టేలర్లు సోమవారం ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. తెలంగాణలో బలం లేకున్నా 2015 మేలో ఎమ్మెల్సీ బరిలో దిగిన టీడీపీ.. పలువురు ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరలేపింది. ఈ విషయం కాస్తా ఏసీబీకి లీకవడంతో రహస్యంగా సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. మే 31న ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఆయన మిత్రుడు మాల్కం టేలర్ ఇంట్లో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు లంచం ఇస్తుండగా రెడ్ çహ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇది అప్పట్లో జాతీయ రాజకీయాలను కుదిపేసింది. మొదట అలాంటిదేమీ లేదంటూ బుకాయించిన టీడీపీ నేతలు.. రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలిస్తూ స్టీఫెన్సన్ను మభ్యపెడుతున్న వీడియోలు, స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు బయటికి రావడంతో ఆత్మరక్షణలో పడిపోయారు. ఈ కేసులో రేవంత్‌రెడ్డి, హ్యరీ సెబాస్టియన్, ఉదయసింహా, జెరుసలేం మత్తయ్యలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. కొంతకాలం దర్యాప్తు బాగానే సాగినా.. తర్వాత ఈ కేసుపై తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. అయితే నేతలపై ఉన్న కేసుల విచారణ వేగవంతం చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ కేసు విచారణ తిరిగి ప్రారంభమైంది. ఐదున్నర గంటలపాటు మాక్ డ్రిల్ స్టీఫెన్సన్, మాల్కం టేలర్లు మంగళవారం ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అధికారులు వీరికి పలు సూచనలు ఇచ్చారు. ఆ రోజు ఏం జరిగింది? ప్రత్యర్థి లాయర్లు ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశముంది తదితర అంశాలపై క్రాస్ ఎగ్జామినేషన్‌లో లాయర్లు ప్రశ్నించే అవకాశముంది. ఆ సమయంలో స్టీఫెన్సన్, మాల్కం టేలర్ తడబడకుండా.. తగిన సూచనలు ఇచ్చారు. దీనిపై మాక్ డ్రిల్ నిర్వహించినట్లు సమాచారం. ఈ మాక్‌డ్రిల్‌లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అశోక్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్‌రావు పాల్గొన్నట్లు తెలిసింది. ఈ కేసులో మొత్తం 418 పేజీల చార్జిషీటును ఏసీబీ దాఖలు చేసింది. కేసు దర్యాప్తు అధికారితో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఫిర్యాదుదారులు, ప్రధాన సాక్షులు ప్రభావితం కూడా వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు మాక్‌డ్రిల్స్ చేపడుతున్నారు. బాబే సూత్రధారి అని మత్తయ్య వాంగ్మూలం ఈ వ్యవహారంలో ఈడీ కూడా విచారణ చేస్తోంది. స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు ఎవరు సమకూర్చారన్న దానిపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ విషయంలో టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డిని గతంలోనే విచారించిన ఈడీ గతేడాది డిసెంబర్లో ఓటుకు కోట్లు కేసు లో ఏ–4 నిందితుడిగా ఉన్న మత్తయ్య వాంగ్మూలం తీసుకుంది. తాను ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని మత్తయ్య మీడియాకు విడుదల చేశాడు. అందులో మొత్తం వ్యవహారానికి సూత్రధారి అప్పటి ఏపీ సీఎం చంద్రబాబేనని, గండిపేటలో మహానాడు వేదిక వెనుక గదిలో రేవంత్‌రెడ్డి, చంద్రబాబును కలిశానని, స్టీఫెన్సన్ను టీడీపీకి అనుకూలంగా ఓటేసేలా ఒప్పిస్తే.. రూ.50 లక్షలు ఇస్తామని ఆశ జూపారని అందుకే, ఈ పనికి అంగీకరించానని పేర్కొన్నాడు. -
స్టీఫెన్సన్కు హైకోర్టులో ఊరట
సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలు నిలిపివేత సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఫిర్యాదుదారు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు హైకోర్టు ధర్మాసనం ఊరటనిచ్చింది. కోర్టు ధిక్కార కేసు విషయంలో ఆయనకు బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేసింది. శుక్రవారం ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ అనిస్‌తో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఓటుకు కోట్లు’కు సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ ప్రధాన నిందితుల్లో ఒకరైన జెరుసులేం మత్తయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతున్న సమయంలో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేసు విచారణ నుంచి తప్పుకోవాలని న్యాయమూర్తిని కోరుతూ స్టీఫెన్సన్ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు, కేసు విచారణ నుంచి తప్పుకునేందుకు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్టీఫెన్సన్ చర్యలు కోర్టు ధిక్కారమే అవుతాయని, అందుకు ఆయన శిక్షార్హుడని తేల్చారు. ఇటీవల కోర్టు ధిక్కార వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు, కోర్టు ముందు హాజరు కానందుకు స్టీఫెన్సన్కు బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ స్టీఫెన్సన్ ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
మత్తయ్య కేసు విచారణ ఆడియో, వీడియో రికార్డింగ్
సాక్షి, హైదరాబాద్: ఓ కేసు విచారణ సందర్భంగా శుక్రవారం హైకోర్టులో జరిగిన వాద, ప్రతివాదనలను ఆడియో, వీడియోల్లో రికార్డ్ చేశారు. విచారణ ప్రక్రియను ఇలా రికార్డ్ చేయడం హైకోర్టు చరిత్రలో ఇదే మొదటిసారి. అంతేకాక పిటిషనర్, ప్రతివాదుల తరఫు న్యాయవాదులు మినహా, మీడియా ప్రతినిధులతో సహా మిగిలిన వారందరినీ బయటకు పంపి, ఇన్ కెమెరా (రహస్య పద్ధతిన) ద్వారా విచారణ చేపట్టడం విశేషం. ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన జెరుసలెం మత్తయ్య.. ఏసీబీ అధికారులు తనపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ బులుసు శివశంకరరావు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. మత్తయ్య గత జూన్ 17న పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి శివశంకరరావు తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు మత్తయ్యను అరెస్ట్ చేయవద్దని ఏసీబీ అధికారులను ఆదేశిస్తూ జూన్ 18న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. అయితే 18న విచారణ జరిగిన తీరును, ఆ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను బట్టి.. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ శివశంకరరావుపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ, కేసు విచారణ నుంచి తప్పుకోవాలని న్యాయమూర్తిని అభ్యర్థిస్తూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరుపక్షాల వాదనల అనంతరం స్టీఫెన్సన్ అభ్యర్థనను న్యాయమూర్తి కొట్టేశారు. అదే సమయంలో ప్రధాన న్యాయమూర్తి అనుమతినిస్తే ఈ కేసులో పారదర్శకత కోసం కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్‌ను ఆడియో, వీడియో ద్వారా రికార్డ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు తగిన అనుమతులు తీసుకుని ఏర్పాట్లు చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. వెబ్ కెమెరాల్లో రికార్డింగ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అనుమతిని వ్వడంతో ఆడియో, వీడియో రికార్డింగ్‌కు వీలుగా రిజిస్ట్రీ కోర్టు హాలులో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మత్తయ్య పిటిషన్ శుక్రవారం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున న్యాయవాదులు కనకమేడల రవీంద్రకుమార్, జి.సుబ్బారావు, మరొకరిని న్యాయమూర్తి శివశంకరరావు అనుమతించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి, ఆయన సహాయకులు, ఏసీబీ న్యాయవాది వి.రవికిరణ్రావును అనుమతించినట్లు సమాచారం. రవికిరణ్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేశామ ని, కాబట్టి విచారించడానికి ఏమీ లేదని తెలిపా రు. ఈ మేరకు ఓ మెమోను కోర్టు ముందుంచా రు. అయితే మెమోను రిజిస్ట్రీలో దాఖలు చేయాల్సిందిగా న్యాయమూర్తి సూచించారు. మెమో దాఖలు చేసిన విషయాన్ని మాత్రం రికార్డ్ చేశా రు. తర్వాత మత్తయ్య తరఫున కనకమేడల రవీంద్రకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఇదే కేసులోని మరో నిందితుడి బెయిల్ పిటిషన్ విచార ణకొచ్చిన సమయంలో చార్జిషీట్ దాఖలు చేయలేదని ఏసీబీ అధికారులు కోర్టుకు నివేదించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9కల్లా చార్జిషీట్ కాపీని పిటిషనర్ తరఫు న్యాయవాదులకు ఇవ్వాలని రవికిరణ్‌రావుకు న్యాయమూర్తి సూచించారు. 12వ తేదీకి అభ్యంతరాలను దాఖ లుచేయాలని సుబ్బారావుకు చెప్పారు. -
‘ఓటుకు కోట్లు’లో ఉన్న ముగ్గురికీ అందలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కమిటీ కూర్పుపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పనిచేసిన వారికి గుర్తింపే దక్కలేదని, చురుగ్గా లేనివారికి పెద్దపీట వేశారని పలువురు నేతలు వాపోయారు. ‘కార్యకర్తల మనోభీష్టం మేరకే ఎంపిక’ అనే పేరుతో ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే చేయిం చారు. రేవంత్‌ను అధ్యక్షుడిగా చేయాలని సర్వేలో ఎక్కువమంది చెప్పారంటూ ప్రచారంలో పెట్టారు. శాసనమండలి ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో కోట్లలో బేరం కుదుర్చుకుని, రూ.50 లక్షల ముడుపులిస్తూ రేవంత్ అడ్డంగా ఏసీబీకి దొరకడం తెలిసిందే. రేవంత్‌పాటు ఈ కేసుతో సంబంధమున్న సండ్ర వెంకట వీరయ్య, వేం నరేందర్‌రెడ్డిలకు కూడా పార్టీ పదవులు కట్టపెట్టడంపై కేడర్‌లో విస్మయం వ్యక్తమవుతోంది. పార్టీ కోసం శ్రమిస్తున్న వారిని కాదని ఇతరులకు పలు కమిటీల్లో పదవులిచ్చారని పలువురు నేతలు వాపోయారు. ఒక రాజ్యసభ సభ్యుడు సూచించిన వారికే ప్రాధాన్యమిచ్చారని, పార్టీలో చురుగ్గా లేని మండవ వెంకటేశ్వరరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, హైదరాబాద్ నగర కమిటీ అధ్యక్షుడిగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న కృష్ణయాదవ్ తదితరులకు పదవులు కట్టబెట్టారని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లిని పొలిట్‌బ్యూరోకే పరిమితం చేయడం, ఇనుగా ల పెద్దిరెడ్డి వంటివారిని జాతీయ అధికార ప్రతినిధి చేయడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఆగస్టు సంక్షోభ భయమే...!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో పూర్తిగా విజయవాడకే పరిమితమయ్యారు. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, దానిపై మాకూ హక్కులున్నాయని చెప్పే చంద్రబాబు గత కొద్దిరోజులుగా మాత్రం విజయవాడ నుంచే పాలన సాగిస్తున్నారు. ఆగస్టు ఒకటి నుంచి రాష్ట్ర సచివాలయానికి రావడమే లేదు. విజయవాడలో పనిచేయడానికి తనకు చాంబర్ లేదనీ, తాను బస్సులోనే పడుకుంటున్నానని చెబుతున్న చంద్రబాబు హైదరాబాద్ రాకపోవడానికి ప్రత్యేక కారణాలున్నాయన్న విషయం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఓటుకు కోట్లు’ కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో ‘బ్రీఫ్ ్డమీ’ అన్నప్పట్నుంచీ హైదరాబాద్‌లో ఉండేందుకు ఇష్టపడడం లేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏ సమయంలో ఎలా వ్యవహరిస్తుందోనని భయపడుతున్నారని కొందరు చెబుతుంటే...! కాదు..! కాదు...! ఆగస్టు నెలవరకు మాత్రమే హైదరాబాద్‌లో ఉండరని ఆ తర్వాత తెలంగాణలో టీడీపీ పార్టీ నేతలకు అందుబాటులో ఉంటారని బాబు కోటరీ నేతలు చెబుతున్నారట. విషయం ఏంటా అని ఆరా తీస్తున్న రాజకీయ విశ్లేషకులకు ‘ఆగస్టు సంక్షోభం’ బోధపడిందట...! టీడీపీ 1984లోనూ, 1995లోనూ రెండు దఫాలు ఆగస్టులోనే సంక్షోభం ఎదుర్కొనడాన్ని గుర్తు చేస్తున్నారు. 1995 ఆగస్టులో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన సందర్భంలో, 1984లో నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్లో టీడీపీ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంది. ఇండస్ట్రీలో 40 ఏళ్ల అనుభవం ఉన్నట్లు చెప్పుకునే బాబు ఆగస్టు అనేసరికి ఆందోళనకు గురవుతారని, ఆ కారణంగానే ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. -
స్టీఫెన్సన్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు
-
స్టీఫెన్సన్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు
హైదరాబాద్ : నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. మత్తయ్య వేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. స్టీఫెన్సన్ వేసిన పిటిషన్ కోర్టును తప్పుదోవ పట్టించేలా ఉందని ధర్మాసనం ఈ సందర్భంగా ఘాటుగా వ్యాఖ్యానించింది. సెక్షన్-14 ప్రకారం స్టీఫెన్‌సన్‌పై ఎందుకు చర్యలు తీసుకోకూడదని హైకోర్టు బెంచ్ ప్రశ్నించింది. కోర్టు ధిక్కార అభియోగం కింద ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కాగా తనపై ఉన్న కేసులను కొట్టి వేయాలంటూ ఓటుకు కోట్లు కేసులో A-4 నిందితుడిగా ఉన్న మత్తయ్య వేసిన పిటిషన్ విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవాలని స్టీఫెన్సన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
కేసీఆర్‌ను కలిసిన స్టీఫెన్సన్
-
ఈ కేసు నుంచి తప్పుకోండి
మరో సంచలనానికి తెరలేపిన స్టీఫెన్సన్ న్యాయమూర్తి శివశంకరరావుకు స్టీఫెన్సన్ విజ్ఞప్తి మత్తయ్య పిటిషన్ విచారణ తీరు అభ్యంతరకరం మీరు విచారణలో కొనసాగితే న్యాయం జరగదు అనుబంధ పిటిషన్ దాఖలు.. నేడు విచారణ రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పైనా విచారణ సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఇరుకునపెట్టి సంచలనం సృష్టించిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఇప్పుడు మరో సంచలనానికి తెర లేపారు. ఓటుకు నోటు వ్యవహారంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన జెరూసలెం మత్తయ్య తనపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై గత వారం హైకోర్టు జరిపిన విచారణ తీరుపై ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని మత్తయ్య కేసును విచారిస్తున్న న్యాయమూర్తి డాక్టర్ శివశంకరరావును కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టుపై తమకు ఎటువంటి దురభిప్రాయం లేదని, కేవలం న్యాయం కోసమే తాను ఈ అభ్యర్థన చేస్తున్నానని స్టీఫెన్సన్ పేర్కొన్నారు. ‘...ఈ కేసులో నిందితుడిగా ఉన్న మత్తయ్య 25 రోజులకు పైగా తప్పించుకు తిరుగుతున్నారు. విజయవాడలో ఆశ్రయం పొందుతున్నారని తెలిసింది. పరారీలో ఉన్న మత్తయ్య తెలంగాణ ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తూ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకే ఆయన ఇలా చేస్తున్నారు. మత్తయ్య తనపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరారీలో ఉన్న మత్తయ్య ఈ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేశారు. హైకోర్టులో ఈ నెల 18న పిటిషన్ విచారణకు వచ్చే విషయంలో ఆ రోజు జస్టిస్ శివశంకరరావు కోర్టులో మత్తయ్య పిటిషన్ 157వ ఐటమ్‌గా ఉంది. సాధారణ పరిస్థితుల్లో ఈ కేసు ఆ రోజు విచారణకు నోచుకునే పరిస్థితే లేదు. ఈ నేపథ్యంలో ఉదయం 8.30 గంటలకు ఏపీ అదనపు ఏజీ కార్యాలయం నుంచి తెలంగాణ ఏసీబీ తరఫు న్యాయవాది రవికిరణ్‌రావుకు ఫోన్ వచ్చింది. మత్తయ్య కేసును విచారణకు స్వీకరించాలని న్యాయమూర్తిని కోరనున్నామని జూనియర్ కౌన్సిల్ చెప్పారు. ఇందులో భాగంగా మత్తయ్య తరఫున ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉదయం 10.30కు కేసు గురించి ప్రస్తావించి, మత్తయ్య పిటిషన్‌పై విచారణ చేపట్టాలని కోరారు. ఏపీ పీపీకి మత్తయ్య తరఫున ఎటువంటి వకాలత్ లేదు. ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఓ నిందితుడి తరఫున హాజరు కావడం అసాధారణ విషయం. మత్తయ్య పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలన్న అభ్యర్థనను రవికిరణ్‌రావు వ్యతిరేకించారు. అయితే, ఈ కోర్టు మత్తయ్య పిటిషన్‌ను సాయంత్రం 4 గంటలకు విచారిస్తామని తెలిపింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఓ నిందితుని తరఫున కేసు గురించి ప్రస్తావించడంపై కోర్టు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సాయంత్రం 4 గంటలకు ఈ కేసు తప్ప మరో కేసును విచారణకు తీసుకోలేదు. అంతేకాక కోర్టులో ఉన్న న్యాయవాదులందరినీ కోర్టు విడిచి వెళ్లాలని పలుమార్లు న్యాయమూర్తి ఆదేశించారు. లేని పక్షంలో తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇలా చేయడమూ అసాధారణమే. వాదనలు వినకుండానే మత్తయ్య అరెస్ట్‌పై స్టే ఇస్తామన్నారు. అడ్వొకేట్ జనరల్ వ్యతిరేకించినా మత్తయ్య అరెస్ట్‌పై స్టే ఇచ్చారు. 18న కోర్టులో జరిగిన పరిణామాలను బట్టి తన ఫిర్యాదును కోర్టు కొట్టేసే అవకాశం ఉందని పలువురు న్యాయవాదులు చెప్పారు. ఈ నేపథ్యంలో నాకున్న ఆందోళననే ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నా’ అని స్టీఫెన్సన్ తన అనుబంధ పిటిషన్లో పేర్కొన్నారు. నేడు విచారణకు రానున్న అన్ని పిటిషన్లు ఓటుకు కోట్లు కేసులో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రధాన నిందితులైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహా వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. కాజ్‌లిస్ట్‌లో ఈ రెండు పిటిషన్లు 12, 13గా ఉన్నాయి. వీటిని జస్టిస్ రాజా ఇలంగో విచారించనున్నారు. మత్తయ్య పిటిషన్ జస్టిస్ శివశంకరరావు విచారించనున్నారు. ఈ పిటిషన్ కాజ్‌లిస్ట్‌లో 95వ ఐటమ్‌గా ఉంది. కోర్టు ఆదేశాల మేరకు రేవంత్ పిటిషన్‌పై ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. మత్తయ్య పిటిషన్‌పైనా కౌంటర్ దాఖలు చేశారు. -
చంద్రబాబు రాజీనామా చేయాలి
* వైఎస్సార్సీపీ డిమాండ్ * నేడు నియోజకవర్గాల కేంద్రాల్లో ధర్నాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ మాట్లాడిన టెలిఫోన్ సంభాషణ బట్టబయలైన నేపథ్యంలో దానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్‌పై మంగళవారం (9 వ తేదీన) అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎం.వీ.మైసూరారెడ్డి సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు కె.పార్థసారథి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, అత్తారు చాంద్బాషలతో కలసి విలేకరులతో మాట్లాడారు. అనైతిక చర్యలకు పాల్పడిన చంద్రబాబు తక్షణం రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై ధర్నాలకు పిలుపునిచ్చినట్టు మైసూరారెడ్డి చెప్పారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం 11 గంటలకు ధర్నాలు జరుగుతాయన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అవినీతిని ప్రోత్సహించడం అవినీతి నిరోధక చట్టం కిందకు వస్తుందని, ఆయన ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేనే లేదని మైసూరా చెప్పారు. ఓటుకు నోటు వ్యవహారంలో తన పాత్ర ఏమిటో విచారణ కోరి నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాల్సిన చంద్రబాబు, టీడీపీ నేతలు ఆ అంశాన్ని మొత్తం రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వివాదంగా మార్చి పక్కదోవ పట్టించే యత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇదెంత మాత్రం రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సమస్య కాదని, ఇది ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉన్న సమస్య అని ఆయన స్పష్టం చేశారు. విచారణ కోరండి: పార్థసారథి తాను నిప్పులాంటి మనిషినని పదే పదే చెప్పుకొనే చంద్రబాబు.. ఓటుకు నోటు వ్యవహారంలో ధైర్యంగా విచారణ జరిపించుకోవాలే తప్ప సాకులు వెద కడం సరికాదని పార్థసారథి అన్నారు. స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడనేలేదని కొందరు, అసలు ముఖ్యమంత్రి ఫోన్‌ను ఎలా ట్యాప్ చేస్తారని ఇంకొందరు, అక్కడక్కడా మాట్లాడింది చేర్చి టేపులు తయారు చేశారని మరి కొందరు మాట్లాడ్డం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలో టీడీపీ మిత్రపక్షం బీజేపీ ప్రభుత్వమే ఉంది కాబట్టి చంద్రబాబు స్వయంగా ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరాలను సారథి డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిపోతే ఇతరులపై నిందలు వేయడం చూస్తుంటే, దొంగే...దొంగ, దొంగ అని అరిచిన చందంగా ఉందని ఆయన అన్నారు. చంద్రబాబును అరెస్టు చేయాలి: నల్లా ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుపై కేసు పెట్టి తక్షణం అరెస్టు చేయాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో నిగ్గు తేల్చడానికి సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా కేంద్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కోరాలని సూర్యప్రకాశ్ విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు తెలంగాణ ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రలోభపెట్టే ఆడియో టేపులు బట్టబయలైనందున ఆయన పదవి నుంచి తప్పుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజీనామా డిమండ్ చేస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి రూరల్ మండలం మల్లంగుంట సర్కిల్లోని జాతీయ రహదారిపై అవినీతి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. విశాఖ జిల్లాలో ఆందోళన నిర్వహించిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
రాజకీయ కుట్రగా తిప్పికొట్టండి
రేవంత్ ఉదంతంపై పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశం హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటు కొనుగోలుకు పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ప్రయోగించిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ వ్యూహం బెడిసికొట్టడంతో న ష్ట నివారణ చర్యలపై దృష్టిపెట్టారు. దీన్ని రాజకీయ కుట్రగా తిప్పికొట్టాలంటూ నేతలను ఆదేశించారు. రేవంత్ నేరుగా వెళ్లడం పొరపాటన్నారు. టీవీల్లో రేవంత్ డీల్ వీడియో పుటేజ్ చూసి బాబు సహా పసుపు శిబిరం తెల్లబోయింది. రాజకీయ కుట్రగా అప్పటి వరకు ఆందోళనలు జరిపిన నాయకులు, వీడియోను చూసి నోరు మెదపలేదు. టీవీ ప్రసారాలు చూసిన చంద్రబాబు పార్టీ నాయకులను ఇంటికి పిలిపించి సమాలోచనలు జరిపారు. ‘కామన్సెన్స్ ఉన్న ఎవ్వరూ ఇంత అడ్డంగా దొరకరు’ అన్నారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము 2 గంటల వరకు, మళ్లీ సోమవారం ఉదయం ఏడింటికే మరోసారి చర్చలు సాగించారు. -
చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి
మంత్రులు ఈటల, జగదీశ్‌రెడ్డిల డిమాండ్ హైదరాబాద్: ‘నూటికి నూరు శాతం ఈ తతంగాన్ని నడిపింది చంద్రబాబే. ఆయనే ప్రధాన కుట్రదారుడు. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్లో సైతం మాట్లాడారు. కుట్రదారుడు చంద్రబాబుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నోటుకు ఓటు కుంభకోణంపై సోమవారం ఆయన సచివాలయంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. ప్రజలు తిరస్కరించడంతో పదేళ్లు విపక్షంలో ఉన్న చంద్రబాబుకు ఇంకా జ్ఞానోదయం కాలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నించిన రేవంత్‌రెడ్డి ఒక్క నిమిషం కూడా ఎమ్మెల్యేగా కొనసాగడానికి వీలులేదని, ఆయనను తక్షణమే డిస్మిస్ చేయాలని అన్నారు. చంద్రబాబు రాజకీయాల్లోకి రావడమే తెలుగు ప్రజల దురదృష్టమని ఈ ఘటన ద్వారా స్పష్టమైందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో అవినీతి రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబేనన్నారు. రాజకీయాల్లో బేరాసారాలు చేయడం, డబ్బుతో కొనుగోలు చేయడం, మనుషులను జంతువులుగా పరిగణించడం చంద్రబాబు ద్వారానే దేశ రాజకీయాలకు అబ్బిందన్నారు. -
టీఆర్ఎస్తో బేరసారాలు నిజమే!
టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి అంగీకారం రేవంత్ భేటీ అందులో భాగమేనని వ్యాఖ్య హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపిన మాట వాస్తవమేనని, అందులో భాగంగానే తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో సమావేశమయ్యారని టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం చెప్పుకొచ్చారు. రేవంత్‌రెడ్డి ఉదంతం వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది కదా అని విలేకరులు ప్రశ్నించగా అదంతా విచారణలో తేలుతుందని వ్యాఖ్యానించారు. తాను కూడా 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడానని, వారిలో చాలా మంది ఓటేసేందుకు కూడా ఒప్పుకున్నారని చెప్పారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చు చేసిందని ఆయన ఆరోపించారు. 63 మంది ఎమ్మెల్యేలతో ముగ్గురు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న చోట ఐదుగురిని నిలబెట్టి కొనుగోళ్లకు దిగిందని విమర్శించారు. టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన సీఎం కేసీఆర్.... సొంత పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలకు కూడా రూ. 5 కోట్ల చొప్పున ఇచ్చారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే రేవంత్‌రెడ్డిని కావాలని కేసీఆర్ ఏసీబీ కేసులో ఇరికించారని దుయ్యబట్టారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని, అప్పుడే నిజానిజాలు తెలుస్తాయని డిమాండ్ చేశారు.