సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ నెల 8న తుది విచారణ నేపథ్యంలో ఈ కేసులో ఫిర్యాదుదారైన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్, అతడి మిత్రుడు, కేసులో ప్రధాన సాక్షి మాల్కం టేలర్లు సోమవారం ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. తెలంగాణలో బలం లేకున్నా 2015 మేలో ఎమ్మెల్సీ బరిలో దిగిన టీడీపీ.. పలువురు ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరలేపింది. ఈ విషయం కాస్తా ఏసీబీకి లీకవడంతో రహస్యంగా సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. మే 31న ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఆయన మిత్రుడు మాల్కం టేలర్ ఇంట్లో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు లంచం ఇస్తుండగా రెడ్ çహ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇది అప్పట్లో జాతీయ రాజకీయాలను కుదిపేసింది.
మొదట అలాంటిదేమీ లేదంటూ బుకాయించిన టీడీపీ నేతలు.. రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలిస్తూ స్టీఫెన్‌సన్‌ను మభ్యపెడుతున్న వీడియోలు, స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు బయటికి రావడంతో ఆత్మరక్షణలో పడిపోయారు. ఈ కేసులో రేవంత్‌రెడ్డి, హ్యరీ సెబాస్టియన్, ఉదయసింహా, జెరుసలేం మత్తయ్యలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. కొంతకాలం దర్యాప్తు బాగానే సాగినా.. తర్వాత ఈ కేసుపై తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. అయితే నేతలపై ఉన్న కేసుల విచారణ వేగవంతం చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ కేసు విచారణ తిరిగి ప్రారంభమైంది.
ఐదున్నర గంటలపాటు మాక్ డ్రిల్
స్టీఫెన్‌సన్, మాల్కం టేలర్లు మంగళవారం ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అధికారులు వీరికి పలు సూచనలు ఇచ్చారు. ఆ రోజు ఏం జరిగింది? ప్రత్యర్థి లాయర్లు ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశముంది తదితర అంశాలపై క్రాస్ ఎగ్జామినేషన్‌లో లాయర్లు ప్రశ్నించే అవకాశముంది. ఆ సమయంలో స్టీఫెన్‌సన్, మాల్కం టేలర్ తడబడకుండా.. తగిన సూచనలు ఇచ్చారు. దీనిపై మాక్ డ్రిల్ నిర్వహించినట్లు సమాచారం. ఈ మాక్‌డ్రిల్‌లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అశోక్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్‌రావు పాల్గొన్నట్లు తెలిసింది. ఈ కేసులో మొత్తం 418 పేజీల చార్జిషీటును ఏసీబీ దాఖలు చేసింది. కేసు దర్యాప్తు అధికారితో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఫిర్యాదుదారులు, ప్రధాన సాక్షులు ప్రభావితం కూడా వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు మాక్‌డ్రిల్స్ చేపడుతున్నారు.
బాబే సూత్రధారి అని మత్తయ్య వాంగ్మూలం
ఈ వ్యవహారంలో ఈడీ కూడా విచారణ చేస్తోంది. స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు ఎవరు సమకూర్చారన్న దానిపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ విషయంలో టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డిని గతంలోనే విచారించిన ఈడీ గతేడాది డిసెంబర్‌లో ఓటుకు కోట్లు కేసు లో ఏ–4 నిందితుడిగా ఉన్న మత్తయ్య వాంగ్మూలం తీసుకుంది. తాను ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని మత్తయ్య మీడియాకు విడుదల చేశాడు. అందులో మొత్తం వ్యవహారానికి సూత్రధారి అప్పటి ఏపీ సీఎం చంద్రబాబేనని, గండిపేటలో మహానాడు వేదిక వెనుక గదిలో రేవంత్‌రెడ్డి, చంద్రబాబును కలిశానని, స్టీఫెన్‌సన్‌ను టీడీపీకి అనుకూలంగా ఓటేసేలా ఒప్పిస్తే.. రూ.50 లక్షలు ఇస్తామని ఆశ జూపారని అందుకే, ఈ పనికి అంగీకరించానని పేర్కొన్నాడు.
తుది దశకు ఓటుకు కోట్లు కేసు
Published Wed, Mar 3 2021 2:48 AM | Last Updated on Wed, Mar 3 2021 2:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment