
మత్తయ్య కేసు విచారణ ఆడియో, వీడియో రికార్డింగ్
సాక్షి, హైదరాబాద్: ఓ కేసు విచారణ సందర్భంగా శుక్రవారం హైకోర్టులో జరిగిన వాద, ప్రతివాదనలను ఆడియో, వీడియోల్లో రికార్డ్ చేశారు. విచారణ ప్రక్రియను ఇలా రికార్డ్ చేయడం హైకోర్టు చరిత్రలో ఇదే మొదటిసారి. అంతేకాక పిటిషనర్, ప్రతివాదుల తరఫు న్యాయవాదులు మినహా, మీడియా ప్రతినిధులతో సహా మిగిలిన వారందరినీ బయటకు పంపి, ఇన్ కెమెరా (రహస్య పద్ధతిన) ద్వారా విచారణ చేపట్టడం విశేషం. ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన జెరుసలెం మత్తయ్య.. ఏసీబీ అధికారులు తనపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ కీలక ఘట్టం చోటుచేసుకుంది.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ బులుసు శివశంకరరావు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. మత్తయ్య గత జూన్ 17న పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి శివశంకరరావు తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు మత్తయ్యను అరెస్ట్ చేయవద్దని ఏసీబీ అధికారులను ఆదేశిస్తూ జూన్ 18న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. అయితే 18న విచారణ జరిగిన తీరును, ఆ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను బట్టి.. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ శివశంకరరావుపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ, కేసు విచారణ నుంచి తప్పుకోవాలని న్యాయమూర్తిని అభ్యర్థిస్తూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరుపక్షాల వాదనల అనంతరం స్టీఫెన్‌సన్ అభ్యర్థనను న్యాయమూర్తి కొట్టేశారు. అదే సమయంలో ప్రధాన న్యాయమూర్తి అనుమతినిస్తే ఈ కేసులో పారదర్శకత కోసం కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్‌ను ఆడియో, వీడియో ద్వారా రికార్డ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు తగిన అనుమతులు తీసుకుని ఏర్పాట్లు చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
వెబ్ కెమెరాల్లో రికార్డింగ్
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అనుమతిని వ్వడంతో ఆడియో, వీడియో రికార్డింగ్‌కు వీలుగా రిజిస్ట్రీ కోర్టు హాలులో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మత్తయ్య పిటిషన్ శుక్రవారం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున న్యాయవాదులు కనకమేడల రవీంద్రకుమార్, జి.సుబ్బారావు, మరొకరిని న్యాయమూర్తి శివశంకరరావు అనుమతించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి, ఆయన సహాయకులు, ఏసీబీ న్యాయవాది వి.రవికిరణ్‌రావును అనుమతించినట్లు సమాచారం. రవికిరణ్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేశామ ని, కాబట్టి విచారించడానికి ఏమీ లేదని తెలిపా రు.
ఈ మేరకు ఓ మెమోను కోర్టు ముందుంచా రు. అయితే మెమోను రిజిస్ట్రీలో దాఖలు చేయాల్సిందిగా న్యాయమూర్తి సూచించారు. మెమో దాఖలు చేసిన విషయాన్ని మాత్రం రికార్డ్ చేశా రు. తర్వాత మత్తయ్య తరఫున కనకమేడల రవీంద్రకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఇదే కేసులోని మరో నిందితుడి బెయిల్ పిటిషన్ విచార ణకొచ్చిన సమయంలో చార్జిషీట్ దాఖలు చేయలేదని ఏసీబీ అధికారులు కోర్టుకు నివేదించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9కల్లా చార్జిషీట్ కాపీని పిటిషనర్ తరఫు న్యాయవాదులకు ఇవ్వాలని రవికిరణ్‌రావుకు న్యాయమూర్తి సూచించారు. 12వ తేదీకి అభ్యంతరాలను దాఖ లుచేయాలని సుబ్బారావుకు చెప్పారు.