
స్టీఫెన్‌సన్‌కు హైకోర్టులో ఊరట
‘ఓటుకు కోట్లు’ కేసులో ఫిర్యాదుదారు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు హైకోర్టు ధర్మాసనం ఊరటనిచ్చింది.
సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలు నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఫిర్యాదుదారు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు హైకోర్టు ధర్మాసనం ఊరటనిచ్చింది. కోర్టు ధిక్కార కేసు విషయంలో ఆయనకు బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేసింది. శుక్రవారం ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ అనిస్‌తో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఓటుకు కోట్లు’కు సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ ప్రధాన నిందితుల్లో ఒకరైన జెరుసులేం మత్తయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతున్న సమయంలో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో కేసు విచారణ నుంచి తప్పుకోవాలని న్యాయమూర్తిని కోరుతూ స్టీఫెన్‌సన్ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు, కేసు విచారణ నుంచి తప్పుకునేందుకు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్టీఫెన్‌సన్ చర్యలు కోర్టు ధిక్కారమే అవుతాయని, అందుకు ఆయన శిక్షార్హుడని తేల్చారు. ఇటీవల కోర్టు ధిక్కార వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు, కోర్టు ముందు హాజరు కానందుకు స్టీఫెన్‌సన్‌కు బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ స్టీఫెన్‌సన్ ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.