చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి
మంత్రులు ఈటల, జగదీశ్‌రెడ్డిల డిమాండ్
హైదరాబాద్: ‘నూటికి నూరు శాతం ఈ తతంగాన్ని నడిపింది చంద్రబాబే. ఆయనే ప్రధాన కుట్రదారుడు. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్‌లో సైతం మాట్లాడారు. కుట్రదారుడు చంద్రబాబుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నోటుకు ఓటు కుంభకోణంపై సోమవారం ఆయన సచివాలయంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు.
ప్రజలు తిరస్కరించడంతో పదేళ్లు విపక్షంలో ఉన్న చంద్రబాబుకు ఇంకా జ్ఞానోదయం కాలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నించిన రేవంత్‌రెడ్డి ఒక్క నిమిషం కూడా ఎమ్మెల్యేగా కొనసాగడానికి వీలులేదని, ఆయనను తక్షణమే డిస్మిస్ చేయాలని అన్నారు. చంద్రబాబు రాజకీయాల్లోకి రావడమే తెలుగు ప్రజల దురదృష్టమని ఈ ఘటన ద్వారా స్పష్టమైందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో అవినీతి రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబేనన్నారు. రాజకీయాల్లో బేరాసారాలు చేయడం, డబ్బుతో కొనుగోలు చేయడం, మనుషులను జంతువులుగా పరిగణించడం చంద్రబాబు ద్వారానే దేశ రాజకీయాలకు అబ్బిందన్నారు.