
ఈ కేసు నుంచి తప్పుకోండి
మరో సంచలనానికి తెరలేపిన స్టీఫెన్‌సన్
న్యాయమూర్తి శివశంకరరావుకు స్టీఫెన్‌సన్ విజ్ఞప్తి
మత్తయ్య పిటిషన్ విచారణ తీరు అభ్యంతరకరం
మీరు విచారణలో కొనసాగితే న్యాయం జరగదు
అనుబంధ పిటిషన్ దాఖలు.. నేడు విచారణ
రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పైనా విచారణ
సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఇరుకునపెట్టి సంచలనం సృష్టించిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఇప్పుడు మరో సంచలనానికి తెర లేపారు. ఓటుకు నోటు వ్యవహారంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన జెరూసలెం మత్తయ్య తనపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై గత వారం హైకోర్టు జరిపిన విచారణ తీరుపై ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని మత్తయ్య కేసును విచారిస్తున్న న్యాయమూర్తి డాక్టర్ శివశంకరరావును కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టుపై తమకు ఎటువంటి దురభిప్రాయం లేదని, కేవలం న్యాయం కోసమే తాను ఈ అభ్యర్థన చేస్తున్నానని స్టీఫెన్‌సన్ పేర్కొన్నారు. ‘...ఈ కేసులో నిందితుడిగా ఉన్న మత్తయ్య 25 రోజులకు పైగా తప్పించుకు తిరుగుతున్నారు.
విజయవాడలో ఆశ్రయం పొందుతున్నారని తెలిసింది. పరారీలో ఉన్న మత్తయ్య తెలంగాణ ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తూ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకే ఆయన ఇలా చేస్తున్నారు. మత్తయ్య తనపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరారీలో ఉన్న మత్తయ్య ఈ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేశారు. హైకోర్టులో ఈ నెల 18న పిటిషన్ విచారణకు వచ్చే విషయంలో ఆ రోజు జస్టిస్ శివశంకరరావు కోర్టులో మత్తయ్య పిటిషన్ 157వ ఐటమ్‌గా ఉంది. సాధారణ పరిస్థితుల్లో ఈ కేసు ఆ రోజు విచారణకు నోచుకునే పరిస్థితే లేదు. ఈ నేపథ్యంలో ఉదయం 8.30 గంటలకు ఏపీ అదనపు ఏజీ కార్యాలయం నుంచి తెలంగాణ ఏసీబీ తరఫు న్యాయవాది రవికిరణ్‌రావుకు ఫోన్ వచ్చింది. మత్తయ్య కేసును విచారణకు స్వీకరించాలని న్యాయమూర్తిని కోరనున్నామని జూనియర్ కౌన్సిల్ చెప్పారు. ఇందులో భాగంగా మత్తయ్య తరఫున ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉదయం 10.30కు కేసు గురించి ప్రస్తావించి, మత్తయ్య పిటిషన్‌పై విచారణ చేపట్టాలని కోరారు. ఏపీ పీపీకి మత్తయ్య తరఫున ఎటువంటి వకాలత్ లేదు. ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఓ నిందితుడి తరఫున హాజరు కావడం అసాధారణ విషయం. మత్తయ్య పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలన్న అభ్యర్థనను రవికిరణ్‌రావు వ్యతిరేకించారు.
అయితే, ఈ కోర్టు మత్తయ్య పిటిషన్‌ను సాయంత్రం 4 గంటలకు విచారిస్తామని తెలిపింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఓ నిందితుని తరఫున కేసు గురించి ప్రస్తావించడంపై కోర్టు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సాయంత్రం 4 గంటలకు ఈ కేసు తప్ప మరో కేసును విచారణకు తీసుకోలేదు. అంతేకాక కోర్టులో ఉన్న న్యాయవాదులందరినీ కోర్టు విడిచి వెళ్లాలని పలుమార్లు న్యాయమూర్తి ఆదేశించారు. లేని పక్షంలో తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇలా చేయడమూ అసాధారణమే. వాదనలు వినకుండానే మత్తయ్య అరెస్ట్‌పై స్టే ఇస్తామన్నారు. అడ్వొకేట్ జనరల్ వ్యతిరేకించినా మత్తయ్య అరెస్ట్‌పై స్టే ఇచ్చారు. 18న కోర్టులో జరిగిన పరిణామాలను బట్టి తన ఫిర్యాదును కోర్టు కొట్టేసే అవకాశం ఉందని పలువురు న్యాయవాదులు చెప్పారు. ఈ నేపథ్యంలో నాకున్న ఆందోళననే ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నా’ అని స్టీఫెన్‌సన్ తన అనుబంధ పిటిషన్‌లో పేర్కొన్నారు.
నేడు విచారణకు రానున్న అన్ని పిటిషన్లు
ఓటుకు కోట్లు కేసులో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రధాన నిందితులైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహా వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. కాజ్‌లిస్ట్‌లో ఈ రెండు పిటిషన్లు 12, 13గా ఉన్నాయి. వీటిని జస్టిస్ రాజా ఇలంగో విచారించనున్నారు. మత్తయ్య పిటిషన్ జస్టిస్ శివశంకరరావు విచారించనున్నారు. ఈ పిటిషన్ కాజ్‌లిస్ట్‌లో 95వ ఐటమ్‌గా ఉంది. కోర్టు ఆదేశాల మేరకు రేవంత్ పిటిషన్‌పై ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. మత్తయ్య పిటిషన్‌పైనా కౌంటర్ దాఖలు చేశారు.