revanth reddys case
-
ఆ ముగ్గురూ మా పార్టీ వాళ్లే: సెబాస్టియన్
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మత్తయ్య, జిమ్మిబాబు, రేవంత్ రెడ్డిలు తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని ఈ కేసులో నిందితుడు సెబాస్టియన్ పేర్కొన్నారు. సోమవారం ఏసీబీ కార్యాలయం వెలుపల సెబాస్టియన్ మీడియాతో మాట్లాడారు. ఆ ముగ్గురు వ్యక్తులూ తమ పార్టీకి చెందిన వారేనని స్పష్టం చేశారు. బెయిల్ మీద విడుదలైన తర్వాత ప్రతిరోజూ తప్పనిసరిగా ఏసీబీ కార్యాలయానికి వచ్చి సంతకం చేయాలన్న నిబంధనకు అనుగుణంగా ఆయన ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ఆయనపై పలు ప్రశ్నలు సంధించింది. దానికి సమాధానంగా మాట్లాడుతూ, తాను నివసిస్తున్న ఇంటిని కబ్జా చేశారన్న వార్తలను సెబాస్టియన్ ఖండించాడు. ఆ ఇంటిని కబ్జా చేయలేదని.. అది తనే ఇల్లేనని పేర్కొన్నారు. ఇంటిని కబ్జా చేశారంటూ ఆరోపించిన వారిపై ఇప్పటికే ఫిర్యాదు చేశానన్నారు. -
రేవంత్ బెయిల్ రద్దు పిటిషన్ పై రేపు సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. రేవంత్ బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ రేపు సుప్రీంలో మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. రేవంత్ బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ అడ్వకేట్ జనరల్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి, ఉదయ్‌సింహా, సెబాస్టియన్లకు బెయిల్ రద్దు చేయాలని ఏసీబీ అధికారులు ఈ పిటిషన్లో పేర్కొన్నారు. -
'చంద్రబాబు దొరికారు.. కేసీఆర్ దొరకలేదు'
ఢిల్లీ:ఓటుకు కోట్లు కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ మరోసారి డిమాండ్ చేసింది. ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) వేస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికితే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం దొరకలేదని దిగ్విజయ్ ఎద్దేవా చేశారు. నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో మాట్లాడింది చంద్రబాబా కాదా అన్నది ఆయనే స్పష్టం చేయాలన్నారు. -
ఏసీబీ కోర్టుకు చేరుకున్నరేవంత్ బెయిల్ కాపీ
హైదరాబాద్:ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మంజూరైన బెయిల్ కాపీ ఏసీబీ కోర్టుకు చేరుకుంది. నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫన్సన్ కు రూ. 50 లక్షల ముడుపులు ఇవ్వజూపుతూ పట్టుబడిన రేవంత్ రెడ్డికి రాష్ట్ర హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే రేవంత్ బెయిల్ కాపీని ఏసీబీ కోర్టుకు అందజేశారు. అనంతరం ఈ బెయిల్ కాపీని రేవంత్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నచర్లపల్లి జైలుకు పంపనున్నారు. రూ. 5 లక్షల పూచీకత్తుతో రేవంత్ కు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. పాస్ పోర్టు అప్పగించాలని... తన నియోజకవర్గం కొడంగల్ కే పరిమితం కావాలని ఆదేశించింది. విచారణకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేసే ఎలాంటి చర్యలు చేపట్టొద్దని ఆదేశించింది. ఈ కేసులో ఏసీబీ ఇప్పటికే ఆధారాలన్నీ సేకరించినందున తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా రేవంత్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ తీర్పు వెలువరించింది. ఉదయసింహా, సెబాస్టియన్ లకు కూడా కోర్టు బెయిలిచ్చింది. -
'బెయిల్ వస్తుందని ముందే ఊహించాం'
హైదరాబాద్:ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందని ముందే ఊహించినట్లు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు తెలిపారు. మంగళవారం రేవంత్ కు హైకోర్టు లో షరతులతో కూడిన బెయిల్ మంజూరైన అనంతరం అడిషనల్ ఏజీ మీడియాతో మాట్లాడారు. రేవంత్ కు బెయిల్ వస్తుందనే విషయాన్ని తాము ముందే ఊహించామని.. దానిలో భాగంగానే ఈ కేసుకు సంబంధించిన పత్రాలను ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్న తమ న్యాయవాదులకు చేరవేశామన్నారు. ఈ కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వడం బాధాకరమన్నారు. కేసు విచారణలో ఉండగా నిందితులకు బెయిల్ ఇవ్వడం సరికాదన్నారు. ఈ కేసులో నిందితులకు ఏపీ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోందన్నారు. ఓటుకు కోట్లు కేసులో నిందితులగా ఉన్న మత్తయ్య, సండ్ర వెంకట వీరయ్యలు విచారణకు సహకరించడం లేదని విషయాన్ని సుప్రీంకోర్టుకు తీసుకువెళ్తామన్నారు. నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలు.. ఇస్తామన్న మరో నాలుగున్నర కోట్ల రూపాయిలు ఎక్కడి నుంచి వచ్చాయో విచారించాల్సి ఉందన్నారు. రేవంత్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ రేపు లేదా ఎల్లుండి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని రామచంద్రరావు తెలిపారు. -
'ఏడాది తర్వాత సెక్షన్-8 గుర్తుకు రావడం విడ్డూరం'
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన ఏడాది తర్వాత సెక్షన్ -8 గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. పదమూడు నెలలుగా హైదరాబాద్ నగరంలో ఉంటున్న ఆంధ్రా ప్రజలకు ఎటువంటి హానీ జరగలేదని జేపీ స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కొందరు ప్రజల మధ్య ఎంతగా చిచ్చు పెడితే అంతలా రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్ర విభజన జరిగిన ఏడాది తర్వాత సెక్షన్-8 గుర్తుకు రావడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారంతో పాటు, ట్యాపింగ్ కేసులను సీబీఐకి అప్పగించాలని జేపీ విజ్ఞప్తి చేశారు. -
పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు?
హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఫోన్ లో సంభాషిస్తూ దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏసీబీ నోటిసులిస్తుందనే భయంతోనే జిల్లాల్లో పర్యటన చేపట్టినట్లు వైఎస్సార్ సీపీ అధికారి ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఆదివారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అంబటి.. ఓటుకు కోట్లు కేసులో ఆడియో టేపులో సంభాషణలు చంద్రబాబువా?కాదా?అనే దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఇచ్చిన రూ.50 లక్షల ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు.చంద్రబాబూ.. రేవంత్ రెడ్డి బాస్ నువ్వా?కాదా? అని విషయం కూడా ప్రజలకు చెప్పాలన్నారు. చంద్రబాబుపై కేసు పెట్టిన తర్వాతే సెక్షన్-8 గుర్తుకొచ్చిందా?అని అంబటి నిలదీశారు. సెక్షన్-8, యూటీ పేరుతో టీడీపీ నేతలు గందరగోళం చేస్తున్నారని మండిపడ్డారు. నటుడు పవన్ కల్యాణ్ ఓటుకు కోట్లు వ్యవహారంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం బాధాకరమన్నారు. రెండు జాతుల మధ్య వైరంగా పోల్చి నెల్సన్ మండేలాను వివాదంలోకి లాగడం దురదృష్టకరమన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఇంతవరకూ పవన్ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. చంద్రబాబుకు పవన్ పెయిడ్ ఆర్టిస్టుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో గెస్ట్ ఆర్టిస్టులు పని చేయరన్నారు. రాజధాని భూములు విషయంలో చంద్రబాబును ప్రశ్నిస్తానన్న పవన్ మాటలు ఏమైపోయాయన్నారు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు. సమస్యలపై ప్రశ్నించకపోతే ప్రజలు పవన్ కల్యాణ్ ను క్షమించరని అంబటి తెలిపారు. -
'చంద్రబాబును జాతి క్షమించదు'
విజయవాడ: ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడును జాతి క్షమించదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు. చంద్రబాబు చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పాతి చింతకాయ పచ్చడి వంటిదన్నారు. ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయని, ప్రతి కాల్‌ను రికార్డు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉన్నప్పుడు ట్యాపింగ్‌కు అవకాశమేలేదన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఈ కేసు పూర్తిగా తెలంగాణదని, మన రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. కానీ ఈ కేసులో ఇరు రాష్ట్రాల నుంచి ఒకే విధమైన స్పందన కనిపిస్తోందన్నారు. ఈ కేసు పుణ్యమా అని ఏడాది తర్వాత ఏపీ సీఎం సెక్షన్ -8 గురించి ప్రస్తావించారన్నారు. చంద్రబాబు టీడీపీ అధ్యక్షుడిగానే తప్ప సీఎంగా వ్యవహరించడం లేదన్నారు. రాష్ర్టం విడిపోయి కష్టాల్లో ఉన్న ప్రజలు చంద్రబాబుకు మాత్రమే ఆ కష్టాల నుంచి బయటవేయగల అనుభవం ఉందని భావించి గెలిపించారన్నారు. గెలిచిన వెంటనే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి రాష్ట్ర పునర్నిర్మాణానికి సహకరించాలని కోరతారని అందరూ భావించారని, కానీ అలా జరగలేదన్నారు. -
ఈ కేసు నుంచి తప్పుకోండి
మరో సంచలనానికి తెరలేపిన స్టీఫెన్సన్ న్యాయమూర్తి శివశంకరరావుకు స్టీఫెన్సన్ విజ్ఞప్తి మత్తయ్య పిటిషన్ విచారణ తీరు అభ్యంతరకరం మీరు విచారణలో కొనసాగితే న్యాయం జరగదు అనుబంధ పిటిషన్ దాఖలు.. నేడు విచారణ రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పైనా విచారణ సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఇరుకునపెట్టి సంచలనం సృష్టించిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఇప్పుడు మరో సంచలనానికి తెర లేపారు. ఓటుకు నోటు వ్యవహారంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన జెరూసలెం మత్తయ్య తనపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై గత వారం హైకోర్టు జరిపిన విచారణ తీరుపై ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని మత్తయ్య కేసును విచారిస్తున్న న్యాయమూర్తి డాక్టర్ శివశంకరరావును కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టుపై తమకు ఎటువంటి దురభిప్రాయం లేదని, కేవలం న్యాయం కోసమే తాను ఈ అభ్యర్థన చేస్తున్నానని స్టీఫెన్సన్ పేర్కొన్నారు. ‘...ఈ కేసులో నిందితుడిగా ఉన్న మత్తయ్య 25 రోజులకు పైగా తప్పించుకు తిరుగుతున్నారు. విజయవాడలో ఆశ్రయం పొందుతున్నారని తెలిసింది. పరారీలో ఉన్న మత్తయ్య తెలంగాణ ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తూ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకే ఆయన ఇలా చేస్తున్నారు. మత్తయ్య తనపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరారీలో ఉన్న మత్తయ్య ఈ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేశారు. హైకోర్టులో ఈ నెల 18న పిటిషన్ విచారణకు వచ్చే విషయంలో ఆ రోజు జస్టిస్ శివశంకరరావు కోర్టులో మత్తయ్య పిటిషన్ 157వ ఐటమ్‌గా ఉంది. సాధారణ పరిస్థితుల్లో ఈ కేసు ఆ రోజు విచారణకు నోచుకునే పరిస్థితే లేదు. ఈ నేపథ్యంలో ఉదయం 8.30 గంటలకు ఏపీ అదనపు ఏజీ కార్యాలయం నుంచి తెలంగాణ ఏసీబీ తరఫు న్యాయవాది రవికిరణ్‌రావుకు ఫోన్ వచ్చింది. మత్తయ్య కేసును విచారణకు స్వీకరించాలని న్యాయమూర్తిని కోరనున్నామని జూనియర్ కౌన్సిల్ చెప్పారు. ఇందులో భాగంగా మత్తయ్య తరఫున ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉదయం 10.30కు కేసు గురించి ప్రస్తావించి, మత్తయ్య పిటిషన్‌పై విచారణ చేపట్టాలని కోరారు. ఏపీ పీపీకి మత్తయ్య తరఫున ఎటువంటి వకాలత్ లేదు. ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఓ నిందితుడి తరఫున హాజరు కావడం అసాధారణ విషయం. మత్తయ్య పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలన్న అభ్యర్థనను రవికిరణ్‌రావు వ్యతిరేకించారు. అయితే, ఈ కోర్టు మత్తయ్య పిటిషన్‌ను సాయంత్రం 4 గంటలకు విచారిస్తామని తెలిపింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఓ నిందితుని తరఫున కేసు గురించి ప్రస్తావించడంపై కోర్టు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సాయంత్రం 4 గంటలకు ఈ కేసు తప్ప మరో కేసును విచారణకు తీసుకోలేదు. అంతేకాక కోర్టులో ఉన్న న్యాయవాదులందరినీ కోర్టు విడిచి వెళ్లాలని పలుమార్లు న్యాయమూర్తి ఆదేశించారు. లేని పక్షంలో తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇలా చేయడమూ అసాధారణమే. వాదనలు వినకుండానే మత్తయ్య అరెస్ట్‌పై స్టే ఇస్తామన్నారు. అడ్వొకేట్ జనరల్ వ్యతిరేకించినా మత్తయ్య అరెస్ట్‌పై స్టే ఇచ్చారు. 18న కోర్టులో జరిగిన పరిణామాలను బట్టి తన ఫిర్యాదును కోర్టు కొట్టేసే అవకాశం ఉందని పలువురు న్యాయవాదులు చెప్పారు. ఈ నేపథ్యంలో నాకున్న ఆందోళననే ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నా’ అని స్టీఫెన్సన్ తన అనుబంధ పిటిషన్లో పేర్కొన్నారు. నేడు విచారణకు రానున్న అన్ని పిటిషన్లు ఓటుకు కోట్లు కేసులో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రధాన నిందితులైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహా వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. కాజ్‌లిస్ట్‌లో ఈ రెండు పిటిషన్లు 12, 13గా ఉన్నాయి. వీటిని జస్టిస్ రాజా ఇలంగో విచారించనున్నారు. మత్తయ్య పిటిషన్ జస్టిస్ శివశంకరరావు విచారించనున్నారు. ఈ పిటిషన్ కాజ్‌లిస్ట్‌లో 95వ ఐటమ్‌గా ఉంది. కోర్టు ఆదేశాల మేరకు రేవంత్ పిటిషన్‌పై ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. మత్తయ్య పిటిషన్‌పైనా కౌంటర్ దాఖలు చేశారు.