
ఆ ముగ్గురూ మా పార్టీ వాళ్లే: సెబాస్టియన్
ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మత్తయ్య, జిమ్మిబాబు, రేవంత్ రెడ్డిలు టీడీపీ పార్టీకి చెందిన వారేనని సెబాస్టియన్ పేర్కొన్నారు.
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మత్తయ్య, జిమ్మిబాబు, రేవంత్ రెడ్డిలు తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని ఈ కేసులో నిందితుడు సెబాస్టియన్ పేర్కొన్నారు. సోమవారం ఏసీబీ కార్యాలయం వెలుపల సెబాస్టియన్ మీడియాతో మాట్లాడారు. ఆ ముగ్గురు వ్యక్తులూ తమ పార్టీకి చెందిన వారేనని స్పష్టం చేశారు. బెయిల్ మీద విడుదలైన తర్వాత ప్రతిరోజూ తప్పనిసరిగా ఏసీబీ కార్యాలయానికి వచ్చి సంతకం చేయాలన్న నిబంధనకు అనుగుణంగా ఆయన ఏసీబీ కార్యాలయానికి వచ్చారు.
ఈ సందర్భంగా మీడియా ఆయనపై పలు ప్రశ్నలు సంధించింది. దానికి సమాధానంగా మాట్లాడుతూ, తాను నివసిస్తున్న ఇంటిని కబ్జా చేశారన్న వార్తలను సెబాస్టియన్ ఖండించాడు. ఆ ఇంటిని కబ్జా చేయలేదని.. అది తనే ఇల్లేనని పేర్కొన్నారు. ఇంటిని కబ్జా చేశారంటూ ఆరోపించిన వారిపై ఇప్పటికే ఫిర్యాదు చేశానన్నారు.