
ఏసీబీ కోర్టుకు చేరుకున్నరేవంత్ బెయిల్ కాపీ
హైదరాబాద్:ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మంజూరైన బెయిల్ కాపీ ఏసీబీ కోర్టుకు చేరుకుంది. నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫన్సన్ కు రూ. 50 లక్షల ముడుపులు ఇవ్వజూపుతూ పట్టుబడిన రేవంత్ రెడ్డికి రాష్ట్ర హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే రేవంత్ బెయిల్ కాపీని ఏసీబీ కోర్టుకు అందజేశారు. అనంతరం ఈ బెయిల్ కాపీని రేవంత్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నచర్లపల్లి జైలుకు పంపనున్నారు.
రూ. 5 లక్షల పూచీకత్తుతో రేవంత్ కు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. పాస్ పోర్టు అప్పగించాలని... తన నియోజకవర్గం కొడంగల్ కే పరిమితం కావాలని ఆదేశించింది. విచారణకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేసే ఎలాంటి చర్యలు చేపట్టొద్దని ఆదేశించింది. ఈ కేసులో ఏసీబీ ఇప్పటికే ఆధారాలన్నీ సేకరించినందున తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా రేవంత్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ తీర్పు వెలువరించింది. ఉదయసింహా, సెబాస్టియన్ లకు కూడా కోర్టు బెయిలిచ్చింది.