VoteForNote
-
ఏసీబీ ముందుకు శ్రీనివాస్ నాయుడు
హైదరాబాద్: దివంగత మాజీ ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడు కుమారుడు శ్రీనివాస్ నాయుడు మంగళవారం ఉదయం బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఓటుకు కోట్లు కేసులో 160సీఆర్సీసీ కింద సోమవారం శ్రీనివాస్ నాయుడుకు తెలంగాణ ఏసీబీ నోటీసులు ఇచ్చింది. శ్రీనివాస్ నాయుడు కార్యాలయ ఉద్యోగి విష్ణుచైతన్యను కూడా ఏసీబీ విచారిస్తోంది. ప్రస్తుతం శ్రీనివాస్ నాయుడు కర్ణాటకలోని ఓ బెవరేజస్ కంపెనీకి ఎండీగా ఉన్నారు. -
'చంద్రబాబు దొరికారు.. కేసీఆర్ దొరకలేదు'
ఢిల్లీ:ఓటుకు కోట్లు కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ మరోసారి డిమాండ్ చేసింది. ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) వేస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికితే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం దొరకలేదని దిగ్విజయ్ ఎద్దేవా చేశారు. నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో మాట్లాడింది చంద్రబాబా కాదా అన్నది ఆయనే స్పష్టం చేయాలన్నారు. -
ఏసీబీ కోర్టుకు చేరుకున్నరేవంత్ బెయిల్ కాపీ
హైదరాబాద్:ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మంజూరైన బెయిల్ కాపీ ఏసీబీ కోర్టుకు చేరుకుంది. నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫన్సన్ కు రూ. 50 లక్షల ముడుపులు ఇవ్వజూపుతూ పట్టుబడిన రేవంత్ రెడ్డికి రాష్ట్ర హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే రేవంత్ బెయిల్ కాపీని ఏసీబీ కోర్టుకు అందజేశారు. అనంతరం ఈ బెయిల్ కాపీని రేవంత్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నచర్లపల్లి జైలుకు పంపనున్నారు. రూ. 5 లక్షల పూచీకత్తుతో రేవంత్ కు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. పాస్ పోర్టు అప్పగించాలని... తన నియోజకవర్గం కొడంగల్ కే పరిమితం కావాలని ఆదేశించింది. విచారణకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేసే ఎలాంటి చర్యలు చేపట్టొద్దని ఆదేశించింది. ఈ కేసులో ఏసీబీ ఇప్పటికే ఆధారాలన్నీ సేకరించినందున తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా రేవంత్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ తీర్పు వెలువరించింది. ఉదయసింహా, సెబాస్టియన్ లకు కూడా కోర్టు బెయిలిచ్చింది.