
'చంద్రబాబును జాతి క్షమించదు'
విజయవాడ: ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడును జాతి క్షమించదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు. చంద్రబాబు చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పాతి చింతకాయ పచ్చడి వంటిదన్నారు. ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఉన్నాయని, ప్రతి కాల్‌ను రికార్డు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉన్నప్పుడు ట్యాపింగ్‌కు అవకాశమేలేదన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమం శుక్రవారం జరిగింది.
ఆయన మాట్లాడుతూ ఈ కేసు పూర్తిగా తెలంగాణదని, మన రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. కానీ ఈ కేసులో ఇరు రాష్ట్రాల నుంచి ఒకే విధమైన స్పందన కనిపిస్తోందన్నారు. ఈ కేసు పుణ్యమా అని ఏడాది తర్వాత ఏపీ సీఎం సెక్షన్ -8 గురించి ప్రస్తావించారన్నారు. చంద్రబాబు టీడీపీ అధ్యక్షుడిగానే తప్ప సీఎంగా వ్యవహరించడం లేదన్నారు. రాష్ర్టం విడిపోయి కష్టాల్లో ఉన్న ప్రజలు చంద్రబాబుకు మాత్రమే ఆ కష్టాల నుంచి బయటవేయగల అనుభవం ఉందని భావించి గెలిపించారన్నారు. గెలిచిన వెంటనే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి రాష్ట్ర పునర్నిర్మాణానికి సహకరించాలని కోరతారని అందరూ భావించారని, కానీ అలా జరగలేదన్నారు.