
పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు?
హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఫోన్ లో సంభాషిస్తూ దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏసీబీ నోటిసులిస్తుందనే భయంతోనే జిల్లాల్లో పర్యటన చేపట్టినట్లు వైఎస్సార్ సీపీ అధికారి ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఆదివారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అంబటి.. ఓటుకు కోట్లు కేసులో ఆడియో టేపులో సంభాషణలు చంద్రబాబువా?కాదా?అనే దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఇచ్చిన రూ.50 లక్షల ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు.చంద్రబాబూ.. రేవంత్ రెడ్డి బాస్ నువ్వా?కాదా? అని విషయం కూడా ప్రజలకు చెప్పాలన్నారు. చంద్రబాబుపై కేసు పెట్టిన తర్వాతే సెక్షన్-8 గుర్తుకొచ్చిందా?అని అంబటి నిలదీశారు. సెక్షన్-8, యూటీ పేరుతో టీడీపీ నేతలు గందరగోళం చేస్తున్నారని మండిపడ్డారు.
నటుడు పవన్ కల్యాణ్ ఓటుకు కోట్లు వ్యవహారంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం బాధాకరమన్నారు. రెండు జాతుల మధ్య వైరంగా పోల్చి నెల్సన్ మండేలాను వివాదంలోకి లాగడం దురదృష్టకరమన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఇంతవరకూ పవన్ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. చంద్రబాబుకు పవన్ పెయిడ్ ఆర్టిస్టుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో గెస్ట్ ఆర్టిస్టులు పని చేయరన్నారు. రాజధాని భూములు విషయంలో చంద్రబాబును ప్రశ్నిస్తానన్న పవన్ మాటలు ఏమైపోయాయన్నారు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు. సమస్యలపై ప్రశ్నించకపోతే ప్రజలు పవన్ కల్యాణ్ ను క్షమించరని అంబటి తెలిపారు.