మేమున్నాం..అధైర్యపడొద్దు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తుమ్మల నాగేశ్వరరావు పార్టీని వీడినంత మాత్రాన ఉల్లిగడ్డ మీద పొట్టే పోయిందని, జిల్లాలో కార్యకర్తలు అధైర్య పడవద్దని టీడీపీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉపనేత రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఖమ్మం నగర సమీపంలోని గణేష్ గార్డెన్‌లో శుక్రవారం నిర్వహించిన ఆ పార్టీ జిల్లా విస్తృతస్తాయి సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 32 ఏళ్లు నేతగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా కార్యకర్తలు తుమ్మలకు గుర్తింపు తెచ్చి, ఆయనను భుజానికి ఎత్తుకుని మోస్తే చివరకు మంత్రి పదవి కోసం వారి గుండెలనే తన్ని కేసీఆర్ పంచన చేరాడని, ఇంతకంటే మోసకారి ఇంకెవరూ ఉండరని ధ్వజమెత్తారు. కేసీఆర్ మోసకారి అని, అన్నం పెట్టిన పార్టీకి తుమ్మల సున్నం పెడితే.. ఆయనకు కూడా మంత్రి పదవి పేరు చెప్పి కేసీఆర్ సున్నం పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేసిన వారికి ఎప్పటికైనా ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తుమ్మలకు దమ్ముంటే ముఖ్యమంత్రితో చర్చించి ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు పెట్టించాలని, అప్పుడు టీడీపీ సత్తా ఏమిటో చూపిస్తామని సవాల్ విసిరారు. తెలంగాణ గురించి ఎప్పుడు మీటింగ్ పెట్టినా తుమ్మల వ్యతిరేకించే వారని పేర్కొన్నారు. ఆయన పార్టీని వీడటంతో జిల్లాకు పట్టిన శనిపోయినట్టేనని వ్యాఖ్యానించారు. తుమ్మల వల్లే నామా ఓటమిపాలయ్యారని, ఆయనకు ఒక గుర్తింపు వచ్చేలా పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో మాట్లాడతామని చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదులో తెలంగాణలోని పది జిల్లాల్లో ఖమ్మం ముందంజలో ఉండటం శుభ పరిణామమన్నారు. ఎప్పటికీ ఇలాగే అగ్రస్థానంలో ఉండాలన్నారు. సభ్యత్వ నమోదు అంతగా లేని నియోజకవర్గ నేతలు ఇకనుంచి హైదరాబాద్ ఎక్కువగా రావద్దని, పార్టీ సభ్యత్వ నమోదు వేగిరం చేయాలని సూచించారు.
రాజకీయ వ్యభిచారం చేశారు..
టీడీపీ కార్యకర్తల కష్టార్జితంతో ప్రజా నేతలుగా ఎదిగి ఇప్పుడు రాజకీయ వ్యభిచారం చేశారని తుమ్మల, ఆయన అనుచరులనుద్దేశించి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. నీతి, నిజాయితీ, ధైర్యం ఉంటే టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన వారు త మ పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ అన్నం పెట్టిన పార్టీకి ద్రోహం చేయడం తుమ్మలకు తగదన్నారు. తుమ్మల మంత్రిగా ఉండి కూడా సత్తుపల్లి నియోజకవర్గంలో ఏనాడూ ఐదు ఎంపీపీలు, ఐదు జెడ్పీటీసీలు, మున్సిపాలిటీని దక్కించుకోలేదని, తాను ఎమ్మెల్యేగా ఉండగా ఈ ఘనత సాధించానని అన్నారు.
ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ తుమ్మలకు పార్టీ, చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, కానీ టీడీపీ అభ్యర్థులను ఓడించడానికి...తనతోపాటు తమ్మినేని, వెంకటరెడ్డి, రేణుకా చౌదరిల గెలుపు కోసం ఎంతో శ్రమపడేవారని ఎద్దేవా చేశారు. 30 ఏళ్లు ఆయనను పార్టీ గౌరవిస్తే వెన్నుపోటు పొడిచారన్నారు. పార్టీ రాష్ట్ర నేత, సభ్యత్వ నమోదు ఇంచార్జి పెద్దిరెడ్డి మాట్లాడుతూ సభ్యత్వ నమోదును జిల్లాలో ఇంకా పెంచాలన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి..
సమావేశానికి హాజరైన బీజేపీ జాతీయ కార్యదర్శి నల్లు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ టీడీపీ మద్దతుతో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న రామ్మోహన్‌రావును గెలిపించాలని కోరారు. ఖమ్మం జిల్లాలో పట్టభద్రుల ఓటు నమోదుకు అధికార యంత్రాంగం సహకరించడం లేదని, ఈ విషయంపై ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. రాష్ట్రంలో పిట్టల దొర పాలనలా కేసీఆర్ వ్యవహారశైలి ఉందని విమర్శించారు.
అనంతరం ఆత్మహత్య చేసుకున్న 18 మంది రైతు కుటంబాలకు రూ.50 వేల చొప్పున టీడీపీ నేతలు చెక్కులను అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్రనేతలు బడుగుల లింగయ్య యాదవ్, మోహన్‌లాల్, పాలేరు నియోజకవర్గ ఇంచార్జి మద్దినేని బేబి స్వర్ణకుమారి, ఫణీశ్వరమ్మ, కోనేరు చిన్ని, కిలారు నాగేశ్వరరావు, చావా కిరణ్మయి, హరిప్రియ, భవాని శంకర్, నాగప్రసాద్, రామనాధం, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్మోహన్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.