దశాబ్దకాలం తర్వాత మళ్లీ మంత్రి పదవి
హైదరాబాద్ : సరిగ్గా దశాబ్దకాలం తర్వాత తుమ్మల నాగేశ్వరరావు మళ్లీ మంత్రి పదవి అందుకున్నారు. ఆయన దాదాపు 40 సంవత్సరాలు జిల్లా రాజకీయాలపై తనదైన ముద్ర వేయగలిగారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో వివిధ హోదాల్లో కొనసాగి తాజాగా టీఆర్ఎస్ లో చేరారు. దీంతో తుమ్మల పది సంవత్సరాల తర్వాత మంగళవారం తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవిని చేపట్టారు.
టీడీపీలో కొనసాగినన్నాళ్లు తనదైన పంథాలో ముందుకెళ్లిన ఆయన పార్టీలో నెలకొన్న వర్గపోరు, ఇతర పరిణామాల కారణంగా నాలుగు నెలల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన తుమ్మల ఆయన పిలుపు మేరకు గులాబీ కండువా కప్పుకున్నారు. అప్పటినుంచే ఆయనను మంత్రిపదవి వరిస్తుందన్న ఊహాగానాలు విస్తృతంగా వ్యాపించాయి.
సత్తుపల్లి నుంచి రాజకీయ ప్రస్తానం ప్రారంభించిన తుమ్మల ఉమ్మడి రాష్ట్రంలో 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు హయాంలో తొలిసారిగా రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖామంత్రిగా కొనసాగారు. 1994, 1999లో సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంద్రబాబు మంత్రివర్గంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖామంత్రిగా, భారీ నీటి పారుదల శాఖామంత్రిగా, రహదారులు భవనాల శాఖామంత్రిగా పనిచేశారు. టీఆర్‌ఎస్‌లో చేరిన తుమ్మల జిల్లాలో టీడీపీకి భారీ గండి కొట్టిన నేతగా మెజార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలను తనతోపాటు టీఆర్‌ఎస్‌లోకి తీసుకెళ్లారు.