అమాత్య తుమ్మల!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సరిగ్గా దశాబ్దకాలం తర్వాత రాష్ట్ర మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మళ్లీ మంత్రి పదవి చేపట్టనున్నారు. తుమ్మల దాదాపు 40 సంవత్సరాలు జిల్లా రాజకీయాలపై తనదైన ముద్ర వేయగలిగారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో వివిధ హోదాల్లో కొనసాగిన ఆయన పది సంవత్సరాల తర్వాత మంగళవారం మంత్రి పదవిని చేపట్టనున్నారు. టీడీపీలో కొనసాగినన్నాళ్లు తనదైన పంథాలో ముందుకెళ్లిన ఆయన పార్టీలో నెలకొన్న వర్గపోరు, ఇతర పరిణామాల కారణంగా నాలుగు నెలల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన తుమ్మల ఆయన పిలుపు మేరకు గులాబీ కండువా కప్పుకున్నారు. అప్పటినుంచే ఆయనను మంత్రిపదవి వరిస్తుందన్న ఊహాగానాలు విస్తృతంగా వ్యాపించాయి.
సత్తుపల్లి నుంచి రాజకీయ ప్రస్తానం ప్రారంభించిన తుమ్మల ఉమ్మడి రాష్ట్రంలో 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు హయాంలో తొలిసారిగా రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖామంత్రిగా కొనసాగారు. 1994, 1999లో సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంద్రబాబు మంత్రివర్గంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖామంత్రిగా, భారీ నీటి పారుదల శాఖామంత్రిగా, రహదారులు భవనాల శాఖామంత్రిగా పనిచేశారు. టీఆర్‌ఎస్‌లో చేరిన తుమ్మల జిల్లాలో టీడీపీకి భారీ గండి కొట్టిన నేతగా మెజార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలను తనతోపాటు టీఆర్‌ఎస్‌లోకి తీసుకెళ్లారు. కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం, తుమ్మలకు మంత్రిగా గతంలో ఉన్న సుదీర్ఘ అనుభవం జిల్లా అభివృద్ధి మరింత వేగంగా జరగడానికి దోహదపడుతుందని జిల్లా ప్రజానీకం భావిస్తోంది.
తుమ్మల ముందున్న అభివృద్ధి..
బయ్యారంలో ఉక్కు కర్మాగారం, దు మ్ముగూడెం ప్రాజెక్టు పూర్తి చేయడం, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం, సింగరేణి గనుల విస్తరణ, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆధునికీకరణ, జిల్లాలో రహదారుల విస్తరణ వంటి అభివృద్ధి పనులు తుమ్మల ముందున్న కర్తవ్యాలు. ఆయనకు కేబినెట్‌లో చోటు ఖాయమైనప్పటినుంచే ఏ శాఖను కేటాయిస్తారన్న అంశంపై పెద్ద ఎత్తున జిల్లాలో చర్చ జరుగుతోంది. సత్తుపల్లి నియోజకవర్గంలోనైతే ఆయనకు శాఖల కేటాయింపుపై హోరాహోరీగా బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి.తుమ్మలకు హోం, విద్యుత్, ఆర్‌అండ్‌బీ వంటి కీలక శాఖలను కేటాయించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. చాలాకాలం తర్వాత తుమ్మలకు మంత్రిపదవి లభిస్తుండటంతో జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ శ్రేణులు, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలేందుకు భారీ ఏర్పాటు చేస్తున్నారు.
వేలాదిగా కార్యకర్తలను తరలించేందుకు పార్టీ నియోజకవర్గాల బాధ్యులు ఇప్పటికే సమాయత్తం అయ్యారు. తుమ్మల మంగళవారం ఉదయం మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక, ఆయనను కలవడానికి హైదరాబాద్ వెళ్లిన జిల్లాకు చెందిన కార్యకర్తలతో సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ సమీపంలో ఉన్న జయగార్డెన్స్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా నుంచి టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, డీసీఎంఎస్ చైర్మన్ ఎగ్గడి అంజయ్య, పార్టీ నేతలు కొండబాల కోటేశ్వరరావు, ఆర్‌జేసీ కృష్ణ తదితరులు హైదరాబాద్ తరలివెళ్లారు.
తుమ్మలకు మంత్రి పదవి ఖాయమవుతుండటంతో వివిధ రాజకీయ పక్షాల్లో ఆదరణకు నోచుకోని నాయకులు సైతం టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జిల్లా రాజకీయాల్లో నెలకొన్న స్తబ్దత తుమ్మల మంత్రిపదవి చేపట్టిన అనంతరం తొలగిపోతుందని విశ్లేషకుల భావన. ఇప్పటికే పలువురు జిల్లా అధికారులు, టీఆర్‌ఎస్ నేతలు, తుమ్మలతో అనుబంధం ఉన్న వివిధ రాజకీయ పక్షాల కార్యకర్తలు, నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.