ఖమ్మంరూరల్/సత్తుపల్లి, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గపోరు మరింత రాజుకుంటోంది. పార్టీలో రెండు శిబిరాలకు నాయకత్వం వహిస్తున్న ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావులు ఎక్కడా వెనక్కు తగ్గకుండా వ్యవహరిస్తుండడంతో తెలుగుతమ్ముళ్లు ఢీ అంటే ఢీ అంటున్నారు. శుక్రవారం ఎంపీ నామా నాగేశ్వరరావు జిల్లాలో రెండు చోట్ల పర్యటించగా, ఆ రెండు కార్యక్రమాలనూ తుమ్మల వర్గీయులు బహిష్కరించారు.
ఇక తుమ్మల నాగేశ్వరరావు కోట అయిన సత్తుపల్లి నియోజకవర్గంలో అయితే ఓరకంగా ఫైటింగే జరిగింది. నామా వస్తున్న విషయం తమకు తెలియదని, తమకు చెప్పని కార్యక్రమాలకు ఎందుకు వెళతామని తుమ్మల వర్గీయులు కార్యక్రమానికి డుమ్మా కొట్టగా, తుమ్మల మేనల్లుడు ఏకంగా నామా కాన్వాయ్‌కే అడ్డం తిరిగాడు. నామా వర్గీయులు ఆయనను తోసేసి ముందుకెళ్లారు.
అయితే, సత్తుపల్లిలో తాము పార్టీ కార్యక్రమానికి వెళ్లలేదని, తమ ట్రస్ట్ కార్యక్రమానికి వెళ్లామని ఎంపీ నామా వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా, కూసుమంచిలో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి తుమ్మల వర్గం ఎందుకు డుమ్మా కొట్టిందనేదానికి మాత్రం సమాధానం లేదు.
ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ రెండు గ్రూపులు మరిన్ని జగడాలకు దిగుతాయని, ఈ ప్రభావం ఎన్నికల్లో విజయావకాశాలపై తప్పకుండా ఉంటుందని క్షేత్రస్థాయి తలలు పట్టుకుంటోంది.
ముఖ్యనాయకులు వచ్చినా...
కూసుమంచి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన ఆ పార్టీ పాలేరు నియోజకవర్గ స్థాయి సమావేశంలో తుమ్మల వర్గానికి చెందిన ఏ ఒక్క నాయకుడు, కార్యకర్త పాల్గొనకపోవడం గమనార్హం. ఈ సమావేశానికి ఆ పార్టీ ఎన్నికల పరిశీలకులు, జిల్లా అధ్యక్షుడు, ఆ పార్టీ ఎంపీ తదితర నాయకులు హాజరైనా తుమ్మల వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు అటువైపు కన్నెత్తి చూడలేదు.
అసలు తమకు ఈ సమావేశానికి ఆహ్వానమే లేదని తుమ్మల వర్గానికి చెందిన ఓ నాయకుడు వాపోయాడు. పై స్థాయి నాయకులు వర్గాలుగా విడిపోయి పార్టీని భ్రష్ఠుపట్టిస్తున్నారని ఆ నాయకుడు ఆవేదన వ్యక్తం చేయడం విశేషం. అయితే, తుమ్మల వర్గీయులు లేకుండా నామా వర్గమే ఈ సమావేశాన్ని తూతూమంత్రంగా ముగించుకుని వెళ్లిపోయింది.
నామా వాహనాన్ని అడ్డగించిన తుమ్మల మేనల్ల్లుడు..
ఆటోడ్రైవర్లకు యూనిఫాం పంపిణీ చేసేందుకని ఎంపీ నామా శుక్రవారం సత్తుపల్లిలో పర్యటించగా తుమ్మల వర్గం తన ప్రతాపాన్ని చూపింది. తుమ్మల మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించడం, ఇప్పుడు కూడా ఆయన వర్గీయుడు సండ్ర ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడంతో ఇక్కడ తుమ్మల వర్గానిదే పైచేయి. అయితే, కావాలని నామా వర్గీయులు ఎంపీని సత్తుపల్లికి రప్పించారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఈ కార్యక్రమానికి తుమ్మల గ్రూపును ఆహ్వానించకుండానే పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. నామా నాగేశ్వరరావు ప్రదర్శనగా ఓపెన్‌టాప్ జీప్‌లో బయలుదేరి వెళ్తుండగా రామాలయం వద్ద తుమ్మల నాగేశ్వరరావు మేనల్లుడు కొప్పుల ప్రవీణ్ నామా వాహనానికి అడ్డంగా నిల్చొని హల్‌చల్ చేశారు. దీంతో నామాకు రక్షణగా వచ్చిన కార్యకర్తలు ఆయనను పక్కకు తోసేశారు. అయినా సభావేదిక వద్దకు వచ్చి ఘర్షణ పడ్డాడు. నామా నాగేశ్వరరావు ప్రదర్శనకు అడ్డుపడతారనే ప్రచారం జరగటంతో వెదురు కర్రలతో ప్రదర్శన మొత్తం పదిమంది కార్యకర్తలు రక్షణగా వెళ్లారు.
పార్టీ కార్యక్రమం కాదు: ఎంపీ నామా
ఇది పార్టీ కార్యక్రమం కాదు.. దయచేసి వివాదం చేయకండి అంటూ ఎంపీ నామా నాగేశ్వరరావు విలేకరుల సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీ వేరు.. సామాజిక కార్యక్రమం వేరు. ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తారని నేను ఊహించలేదంటూ బదులిచ్చారు.
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరా...
ఎంపీ నామా నాగేశ్వరరావు పర్యటనపై సండ్ర వెంకటవీరయ్య ఎప్పటికప్పుడు ఆరా తీసే పనిలో పడ్డారు. ఎవరెవరూ నామా వెంట ఉన్నారు.. అనే సమాచారాన్ని సేకరించే పనిలో ఆయన అనుచరులు నిమగ్నమయ్యారు.
ఢీ అంటే ఢీ!
Published Sat, Feb 1 2014 7:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
Advertisement
Advertisement