అధినేత చంద్రబాబు తీరుపై టీడీపీ నేతల్లో అసంతృప్తి
కోటరీకే పీట వేస్తున్నారని.. డబ్బే కొలమానంగా మారిందని ఆగ్రహం
టికెట్ కోసం గరికపాటి యత్నాలు.. అడ్డుకునేందుకు సుజనా వ్యూహం
బాలకృష్ణను రాజ్యసభకు పంపించే ఎత్తుగడలో చంద్రబాబునాయుడు
బాలయ్యను పార్టీకి దూరంగా ఉంచి.. ప్రచారానికే వాడుకునే ఎత్తుగడ!
రాజ్యసభపై హామీ లభించకపోవటంతో మోత్కుపల్లి అసంతృప్తి గళం
మరోసారి సీటు ఆశిస్తున్న కంభంపాటి.. ‘రాజగురువు’ ద్వారా సిఫారసు!
రేసులో మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, పలువురు వ్యాపార ప్రముఖులు
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ టికెట్ల విషయమై తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు తీవ్రమైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ భవిష్యత్తెలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్న నేతలు ఈసారి ఎలాగైనా రాజ్యసభ సీటు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునేందుకు ఒక నేత రాష్ట్ర రాజధానిలోని ఒక స్టార్ హోటల్‌లో విందు మంత్రాంగం నిర్వహించారు. పార్టీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న రెండు కళ్ల సిద్ధాంతం రాజ్యసభకూ వర్తింపచేస్తుండటం ఆ నేతకు తలనొప్పిగా తయారైంది.
మరోవైపు చంద్రబాబు తన సన్నిహితులకు, డబ్బున్న వారికి టికెట్లు ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిసారీ డబ్బు కొలమానంగా మారిందని, ఈసారీ అలాంటి అభ్యర్థులే ఎంపికకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పైగా ప్రతిసారీ ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారని, చంద్రబాబు కోటరీలో ఒకరికి టికెట్ ఇస్తున్నారని పార్టీ నేతల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. సుదీర్ఘ కాలంగా పార్టీలో ఉంటూ ఎన్నో విధాలుగా నష్టపోయిన వారికి గుర్తింపు ఉండట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పారిశ్రామికవేత్తలఢీ అంటే ఢీ
టీడీపీ రాజకీయాలను శాసిస్తూ పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న ఇద్దరు పారిశ్రామికవేత్తలు రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఒకరికొకరు ఢీఅంటే ఢీ అనే పరిస్థితికి వచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహన్‌రావుకు రాజ్యసభ సీటు ఇవ్వాలని పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తుంటే.. ఆయనకు టికెట్ రాకుండా చేయాలని రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి.. చంద్రబాబు కుమారుడు లోకేష్ ద్వారా అడ్డుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. గరికపాటిని రాజ్యసభకు ఎంపిక చేస్తే పార్టీలో, ఢిల్లీలో తన ప్రాధాన్యత తగ్గుతుందని ఆయన భావనగా చెప్తున్నారు. గరికపాటికి చెక్ పెట్టేందుకే రాజ్యసభకు బాలకృష్ణ, మోత్కుపల్లి నర్సింహులు పేర్లు ఖరారయ్యాయని సుజనాచౌదరికి చెందిన టీవీ చానెల్‌లో విస్తృత ప్రచారం చేస్తుండటం విశేషం.
బాలకృష్ణను తెరపైకి తెచ్చిన బాబు...
మరోవైపు.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా పార్టీ మీద పట్టు సాధించుకోవాలని భావిస్తున్న నందమూరి బాలకృష్ణను ఎలాగైనా రాజ్యసభకు పంపించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విషయం నేరుగా బాలకృష్ణకు చెప్తే అంగీకరించే అవకాశం లేనందున ఎన్‌టీఆర్ కుటుంబం నుంచి ఒకరిని రాజ్యసభకు పంపించాలంటూ పార్టీ నేతల ద్వారా డిమాండ్ చేయిస్తున్నారు. అందులో భాగంగానే తన సన్నిహితుడి టీవీ చానల్‌లో బాలకృష్ణకు రాజ్యసభ సీటు ఖరారైందనే వార్తలను ప్రసారం చేయించినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రాజ్యసభకు పంపడం ద్వారా పార్టీలో బాలకృష్ణ జోక్యం ఉండకుండా దూరం చేయడం, ఎన్నికల్లో ప్రచారానికి ఉపయోగించుకోవడం వరకు పరిమితం చేయొచ్చని చంద్రబాబు భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెప్పారు.
అసంతృప్తి గళమిప్పిన మోత్కుపల్లి
రాజ్యసభ టికెట్ విషయంలో చంద్రబాబు నుంచి ఎలాంటి హామీ రాకపోవటంతో తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం అసంతృప్తి గళం విప్పారు. గరికపాటి మోహనరావుకు టిక్కెట్టు దాదాపు ఖరారైందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు బిల్యానాయక్‌తో పాటు పలువురు నేతలతో హైదరాబాద్‌లో ఒక సమావేశం నిర్వహించి సమాలోచనలు జరిపారు. ఆ తర్వాత మోత్కుపల్లి తరఫున ఆ నాయకులు చంద్రబాబును కలిశారు. నల్గొండ జిల్లా నేతలు చాలా మంది వెళ్లినా ఉమా మాధవరెడ్డి, వేనేపల్లి చందర్‌రావు మాత్రం రాలేదు.
రేసులో చాలా మందే..
సీమాంధ్ర ప్రాంతం నుంచి మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ (బాబ్జీ), నారాయణ విద్యా సంస్థల అధిపతి నారాయణ, పార్టీ ప్రధాన కార్యదర్శి బోండా ఉమామహేశ్వరరావు, పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు సీతామాల క్ష్మి టీడీపీ నుంచి రాజ్యసభకు టికెట్ కోసం పోటీపడుతున్నారు. పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరు కూడా రాజ్యసభ టికెట్‌ను ఆశిస్తున్నారు. గతంలో ఎంపీగా పనిచేసి మరోసారి సీటు ఆశిస్తున్న పార్టీ ఉపాధ్యక్షుడు కంభంపాటి రామ్మోహనరావు జాతీయ పార్టీల నేతలతో పాటు పార్టీకి రాజగురువుగా ఉన్న ఒక పత్రికాధిపతి ద్వారా గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
గడిచిన మూడు దశాబ్దాల కాలంలో కరీంనగర్ జిల్లాకు రాజ్యసభ, ఎమ్మెల్సీ వంటి పదవులేవీ ఇవ్వలేదని, ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న తమకు అవకాశం కల్పించాలని ఆ జిల్లా పార్టీ నాయకురాలు గండ్ర నళిని ఇటీవలే చంద్రబాబును కలసి వివరించారు. అలాగే విశాఖపట్నం మాజీ ఎంపీ ఎం.వి.వి.ఎస్.మూర్తి కోసం మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య, మాజీ ఎంపీ కిమిడి కళావెంకట్రావు ప్రయత్నిస్తున్నారు. వీరితో పాటు మాజీ మంత్రులు కావలి ప్రతిభాభారతి, జె.ఆర్.పుష్పరాజ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.షరీఫ్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బీద రవిచంద్రయాదవ్, పంచుమర్తి అనూరాధ, ఎం.అరవిందకుమార్‌గౌడ్ పేర్లను చంద్రబాబు పరిశీలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
పెద్దల సీటు కోసం ‘తమ్ముళ్ల’ పోరు
Published Sat, Jan 25 2014 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM
Advertisement
Advertisement