Sattupalli constituency
-
కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందింది: ఎంపీ పార్థసారథిరెడ్డి
-
సత్తుపల్లి కాంగ్రెస్‌లో వార్.. మూడుగా చీలిపోయిన పార్టీ
కర్నాటకలో సాధించిన విజయం తెలంగాణ కాంగ్రెస్‌లో ఎక్కడా లేని జోష్ నింపింది. దీంతో అన్ని జిల్లాల్లోనూ టిక్కెట్ల కోసం వార్ మొదలైంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మూడు వర్గాలుగా ఏర్పడి టిక్కెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మొన్నటి వరకు రెండే గ్రూపులుండేవి. తాజాగా గులాబీ పార్టీ నుంచి వచ్చిన మరో నేత కూడా సీటు నాదే అంటున్నారు. సత్తుపల్లి కాంగ్రెస్‌లో గ్రూప్ వార్ ఏ స్థాయిలో జరుగుతోందో చూద్దాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెట్ వార్ తారాస్థాయికి చేరింది. ముగ్గురు నాయకులు సొంతంగా గ్రూప్‌లు ఏర్పాటు చేసుకుని..పార్టీ కార్యక్రమాలు ఎవరికి వారుగా నిర్వహించుకుంటున్నారు. నిన్నా..మొన్నటి వరకు రెండు గ్రూప్‌లే ఉండేవి..అయితే తాజాగా అధికార పార్టీ నుంచి మరో నేత వచ్చి మూడో గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు సత్తుపల్లి టిక్కెట్ కోసం ముగ్గురు నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేత, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్ మధ్య మొన్నటి వరకు ఆధిపత్య పోరు సాగింది. తాజాగా బీఆర్ఎస్ నేత మట్టా దయానంద్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మూడు వర్గాలుగా చీలిపోయింది. ఇంతకుముందు చంద్రశేఖర్, మానవతారాయ్ వెంట ఉన్నవారిలో కొందరు ఇప్పుడు దయానంద్ వర్గంలో చేరిపోయారు. ఇలా నాయకులు వర్గాలు మార్చడంతో సత్తుపల్లి కాంగ్రెస్‌లో వార్ మరింత ముదిరింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ మట్టా దయానంద్ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న సందర్భంలో సత్తుపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో మాజీ మంత్రి సంబానీ వర్గం, మానవతారాయ్ వర్గం వేరువేరుగా జెండా ఆవిష్కరణలు నిర్వహించారు. ఒకే ప్రాంతంలో ఒకే పార్టీలో ముగ్గురు నేతలు గ్రూప్‌లుగా విడిపోయి కార్యక్రమాలు చేస్తూ ఉండటంతో గ్రామస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. ఏ వర్గంతో ఉంటే తమకు ఉపయోగం ఉంటుందా అని కేడర్ కూడా ఆలోచిస్తోంది. కాని పార్టీ టిక్కెట్ ఎవరికి వస్తుందో తెలియదు గనుక ఏ వర్గానికి పనిచేయాలో తేల్చుకోలేక అయోమయానికి గురవుతున్నారు. నియోజకవర్గంలో పట్టు సంపాదించిన కొత్తగా వచ్చిన డాక్టర్ మట్టా దయానంద్ కు టికెట్ వస్తుందా లేక సీనియర్ నాయకుడు సంబానీ చంద్రశేఖర్‌కు కేటాయిస్తారా? లేక విద్యార్థి నేతగా ఎదిగి, పార్టీలో పట్టు సంపాదిస్తున్న టిపిసిసి అధికార ప్రతినిధి మానవతారాయ్ కు టికెట్ వస్తుందా అనే చర్చ ఇప్పుడు సత్తుపల్లిలో హాట్ టాపిక్ గా మారింది. అయితే టికెట్ తమకే ఇస్తారని ముగ్గురు నేతలు దీమాతో ఉన్నారు. సంబానీ చంద్రశేఖర్ తనకు టికెట్ ఖరారు అయిపోయిందనుకున్న తరుణంలో మట్టా దయానంద్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు సంభాని ఆందోళన చెందుతున్నారు. అసలు మట్టా దయానంద్ కాంగ్రెస్‌లో చేరుతున్న విషయం చివరి నిమిషం వరకు సంభానికి తెలియదట. దయానంద్ పార్టీలో చేరుతున్న సమయంలో అసలు సంభాని నియోజకవర్గంలోనే లేరు. దీంతో ఆయన అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. టిక్కెట్ విషయాన్ని హైకమాండ్ దగ్గరే తేల్చుకుందామని నిర్ణయించుకున్నారట సంభాని చంద్రశేఖర్. గడచిన నాలుగేళ్ళలో లేని ఉత్సాహం కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. అదే సమయంలో టిక్కెట్ వార్ కూడా తీవ్రస్థాయికి చేరుతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ మూడు నాలుగు గ్రూప్‌లు తయారై టిక్కెట్ కోసం తలపడుతున్నాయి. సత్తుపల్లిలోని మూడు గ్రూప్‌లను ఎలా దారికి తెచ్చుకుంటారో చూడాలి. -
పందేనికి సై
సత్తుపల్లి, న్యూస్‌లైన్: పందేలకు పెట్టింది పేరైన సత్తుపల్లి నియోజకవర్గంలో మరోమారు ఆ సంస్కృతి ఊపందుకుంది. వరుస ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. మొన్నటి వరకు క్రికెట్ బెట్టింగ్‌లు మాత్రమే నిర్వహించిన ఈ ప్రాంత బుకీలు ఇప్పుడు ఎన్నికల రిజల్ట్స్‌పై దృష్టిపెట్టారు. సోమవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మొదలు ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల ఫలితాల వరకు ఒకదాని తర్వాత ఒకటి వెలువడనున్న నేపథ్యంలో పందెం రాయుళ్లకు చేతినిండా పనిదొరికింది. సంపాదనే ధ్యేయంగా పార్టీలకతీతంగా పందెంరాయుళ్లు బెట్టింగ్ నిర్వహణకు పూనుకున్నారు. సీమాంధ్రలో 7వ తేదీ ఎన్నికలు పూర్తయిన కొద్దిక్షణాల్లోనే సత్తుపల్లిలో పందేలు జోరందుకున్నాయి. అక్కడి ఎన్నికల సరళిని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ హవా కొనసాగిం దని, ఫ్యాన్‌గాలి జోరుగా వీచిందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే పందే లు జోరందుకున్నాయి. వైఎస్ఆర్సీపీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మెజార్టీపైనా జోరు గా పందేలు సాగుతున్నాయి. లక్షకు పైగా ఆయన మెజార్టీ సాధిస్తారని లక్ష రూపాయల వరకు కొందరు బెట్టింగ్ పెడుతున్నారు. అందుకు ఒక్క ఓటైనా తక్కువ వస్తుందని మరికొందరు పందెం కాస్తున్నారు. కొందరు రూ.లక్షలు వడ్డీకి తెచ్చి బెట్టింగ్‌కు దిగుతున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సత్తుపల్లి నియోజకవర్గంలో ముప్పైవేలకు పైగా మెజార్టీ వస్తుందని.. లక్ష ఓట్లతో ఎంపీగా గెలుస్తారంటూ పందేలు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే లక్షల రూపాయల్లో పందేలు వేసినట్లు సమాచారం. శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలోని కల్లూరు మండలం నారాయణపురం గ్రామవాసి కావటంతో ఈ ప్రాంతంలో రాజకీయాలకు అతీతంగా ఎంపీ ఓట్లు క్రాస్ అయినట్లు రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు. సీమాంధ్రలో పోలింగ్ జరుగుతుండగానే ఆ ప్రాంతానికి జగన్ సీఎం అవుతారని పందేలు జోరుగా నడిచాయి. ఫలానా జిల్లాలో వైఎస్ఆర్సీపీకి ఇన్ని, టీడీపీకి ఇన్ని సీట్లు వస్తాయని, కాంగ్రెస్ పరిస్థితి ఇలావుంటుందని లెక్కలు కట్టి మరీ 7వ తేదీ నుంచే పందేలకు పదును పెట్టినట్లు తెలుస్తోంది. సీమాంధ్రప్రాంతంలో ఉన్న సన్నిహితులు, బంధువుల నుంచి సమాచారం తెప్పించుకొని పందేలకు దిగుతున్నట్లు సమాచారం. చంద్రబాబునాయుడు సీఎం అవుతారని మాత్రం ఏ ఒక్కరూ పందెం కాయడానికి ముందుకు రావటంలేదని తెలిసింది. టీడీపీకి వచ్చే సీట్లపైన మాత్రం పందేలు కాస్తున్నట్లు సమాచారం. సత్తుపల్లి అసెంబ్లీ ఫలితంపై ఊపందుకుంటున్న పందేలు.. సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఎవరు ఎన్నికవుతారనే విషయంపైనా పందేలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. సత్తుపల్లి అసెంబ్లీ ఫలితంపై 2009 అసెంబ్లీ ఎన్నికలప్పుడు రూ.కోట్లలో జరిగిన పందేలు మొన్న టి వరకు స్తబ్దుగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యల్లో గెలుపు ఎవరిదో అర్థంకాని స్థితిలో పందెంరాయుళ్లు మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్నారు. సెలైంట్ ఓటింగ్, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దయానంద్ స్థానికు డు కావటం వల్ల ఓటర్లపై ఏమేరకు ప్రభావం పడిం దో అర్థంకాక పందెం రాయుళ్ళు తలలు పట్టుకున్నా రు. ఓట్ల చీలికపై లెక్కలు వేసుకున్న టీడీపీ నేతలు కొందరు తమ పార్టీ అభ్యర్థి గెలుపుపై పందెం కాయకుండా మెజార్టీపై పందెం కాస్తామంటూ ముందుకు వస్తున్నట్లు సమాచారం. కొందరు ధైర్యం చేసి గెలపోటములపైనా పందెం కాస్తున్నట్లు తెలుస్తోంది. సొంత సర్వేలతోనే.. ఎప్పుడు సంస్థలు చేసే సర్వే, ఇంటెలిజెన్స్ రిపోర్టలపైనే ఆధారపడే అభ్యర్థులు ఈసారి సొంతంగా సర్వేలు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికోసం కొంతమందిని నియమించి గ్రామాల వారీగా ఓటర్ల నాడిని కనుక్కునే ప్రయత్నం చేశారని సమాచారం. అభ్యర్థులు చేయించిన సర్వేల ఫలితాలను తెప్పించుకొని, మీడియా సంస్థల అంచనాలను సరిపోల్చుకొని కొందరు బెట్టింగ్‌కు దిగుతున్నట్లు తెలిసింది. కొందరు సొంతంగా సర్వేలు చేయించుకొని పందేలు కాస్తున్నారని సమాచారం. గతంలో పందేలు కాసి నష్టపోయిన పలువురు ‘తమ్ముళ్లు’ ఈసారి జాగ్రత్తపడుతున్నట్లు వినికిడి. -
మీసేవ చుట్టూ పరుగో పరుగు
సత్తుపల్లి, న్యూస్‌లైన్: స్థానిక సంస్థల అభ్యర్థులను ఆయా పార్టీలు ఆఖరి నిమిషంలో ప్రకటిస్తుండటంతో రిజర్వ్ స్థానాల్లో పోటీచేసే సంబంధిత అభ్యర్థులు కులధ్రువీకరణ పత్రాల కోసం మీసేవా కేంద్రాలు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ పరుగులు పెడుతున్నారు. నామినేషన్లకు గురువారం చివరి రోజు కావటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. కుల ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందక పోవటంతో అభ్యర్థుల స్థానంలో కొందరు డమ్మీ అభ్యర్థులను నిలబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఆఖరి నిమిషంలోనైనా అవకాశం వస్తే పోటీ చేసేందుకు కొందరు ఆశావాహులు కులధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 75 ఎంపీటీసీలు, ఐదు జెడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఐదు జెడ్పీటీసీలు ఎస్టీలకు రిజర్వ్ కావటంతో అభ్యర్థుల కోసం పార్టీలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దొరక్కదొరక్క దొరికిన అభ్యర్థి కులధ్రువీకరణ ప్రతం తేవడం కష్టంగా మారింది. దీనికితోడు పంచాయతీ ఇంటి, నీటి పన్నుల బకాయిల చెల్లింపుల నోడ్యూస్ సర్టిఫికెట్ల కోసం పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. చాలా పంచాయతీలలో కార్యదర్శుల కొరత ఉండటంతో మరింత ఆలస్యమవుతోంది. ఎన్నికల నిబంధనలు తెలియని గ్రామీణ ప్రాంత అభ్యర్థులైతే మరింత ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఫలితాల ప్రభావం.. సార్వత్రిక ఎన్నికలకు ముందు, కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలు నిర్వహిస్తుండటంతో వీటి ప్రభావం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై ఎక్కడ పడుతుందోననే ఆందోళనలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఉన్నారు. ఇప్పటికే నగరపంచాయతీ ఎన్నికలతో బిజీబిజీగా ఉన్న నేతలు పార్టీ గుర్తులతో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బలాబలాలను లెక్కలువేస్తూ.. అభ్యర్థుల ఎంపికపై ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. రిజర్వ్ స్థానాలలో అభ్యర్థుల ఎంపిక బాధ్యత మండల నాయకత్వం మీదనే పెట్టారు. ఓవైపు మున్సిపాలిటీ, మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు వరుస ఎన్నికలు రావటంతో అభ్యర్థుల ఎంపిక తలకుమించిన భారంగా మారింది. ప్రాదేశిక ఎన్నికల ఖర్చును కూడా భరించాల్సి రావడం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు భారంగా మారింది. -
ఢీ అంటే ఢీ!
ఖమ్మంరూరల్/సత్తుపల్లి, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గపోరు మరింత రాజుకుంటోంది. పార్టీలో రెండు శిబిరాలకు నాయకత్వం వహిస్తున్న ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావులు ఎక్కడా వెనక్కు తగ్గకుండా వ్యవహరిస్తుండడంతో తెలుగుతమ్ముళ్లు ఢీ అంటే ఢీ అంటున్నారు. శుక్రవారం ఎంపీ నామా నాగేశ్వరరావు జిల్లాలో రెండు చోట్ల పర్యటించగా, ఆ రెండు కార్యక్రమాలనూ తుమ్మల వర్గీయులు బహిష్కరించారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు కోట అయిన సత్తుపల్లి నియోజకవర్గంలో అయితే ఓరకంగా ఫైటింగే జరిగింది. నామా వస్తున్న విషయం తమకు తెలియదని, తమకు చెప్పని కార్యక్రమాలకు ఎందుకు వెళతామని తుమ్మల వర్గీయులు కార్యక్రమానికి డుమ్మా కొట్టగా, తుమ్మల మేనల్లుడు ఏకంగా నామా కాన్వాయ్‌కే అడ్డం తిరిగాడు. నామా వర్గీయులు ఆయనను తోసేసి ముందుకెళ్లారు. అయితే, సత్తుపల్లిలో తాము పార్టీ కార్యక్రమానికి వెళ్లలేదని, తమ ట్రస్ట్ కార్యక్రమానికి వెళ్లామని ఎంపీ నామా వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా, కూసుమంచిలో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి తుమ్మల వర్గం ఎందుకు డుమ్మా కొట్టిందనేదానికి మాత్రం సమాధానం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ రెండు గ్రూపులు మరిన్ని జగడాలకు దిగుతాయని, ఈ ప్రభావం ఎన్నికల్లో విజయావకాశాలపై తప్పకుండా ఉంటుందని క్షేత్రస్థాయి తలలు పట్టుకుంటోంది. ముఖ్యనాయకులు వచ్చినా... కూసుమంచి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన ఆ పార్టీ పాలేరు నియోజకవర్గ స్థాయి సమావేశంలో తుమ్మల వర్గానికి చెందిన ఏ ఒక్క నాయకుడు, కార్యకర్త పాల్గొనకపోవడం గమనార్హం. ఈ సమావేశానికి ఆ పార్టీ ఎన్నికల పరిశీలకులు, జిల్లా అధ్యక్షుడు, ఆ పార్టీ ఎంపీ తదితర నాయకులు హాజరైనా తుమ్మల వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు అటువైపు కన్నెత్తి చూడలేదు. అసలు తమకు ఈ సమావేశానికి ఆహ్వానమే లేదని తుమ్మల వర్గానికి చెందిన ఓ నాయకుడు వాపోయాడు. పై స్థాయి నాయకులు వర్గాలుగా విడిపోయి పార్టీని భ్రష్ఠుపట్టిస్తున్నారని ఆ నాయకుడు ఆవేదన వ్యక్తం చేయడం విశేషం. అయితే, తుమ్మల వర్గీయులు లేకుండా నామా వర్గమే ఈ సమావేశాన్ని తూతూమంత్రంగా ముగించుకుని వెళ్లిపోయింది. నామా వాహనాన్ని అడ్డగించిన తుమ్మల మేనల్ల్లుడు.. ఆటోడ్రైవర్లకు యూనిఫాం పంపిణీ చేసేందుకని ఎంపీ నామా శుక్రవారం సత్తుపల్లిలో పర్యటించగా తుమ్మల వర్గం తన ప్రతాపాన్ని చూపింది. తుమ్మల మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించడం, ఇప్పుడు కూడా ఆయన వర్గీయుడు సండ్ర ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడంతో ఇక్కడ తుమ్మల వర్గానిదే పైచేయి. అయితే, కావాలని నామా వర్గీయులు ఎంపీని సత్తుపల్లికి రప్పించారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ కార్యక్రమానికి తుమ్మల గ్రూపును ఆహ్వానించకుండానే పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. నామా నాగేశ్వరరావు ప్రదర్శనగా ఓపెన్‌టాప్ జీప్‌లో బయలుదేరి వెళ్తుండగా రామాలయం వద్ద తుమ్మల నాగేశ్వరరావు మేనల్లుడు కొప్పుల ప్రవీణ్ నామా వాహనానికి అడ్డంగా నిల్చొని హల్చల్ చేశారు. దీంతో నామాకు రక్షణగా వచ్చిన కార్యకర్తలు ఆయనను పక్కకు తోసేశారు. అయినా సభావేదిక వద్దకు వచ్చి ఘర్షణ పడ్డాడు. నామా నాగేశ్వరరావు ప్రదర్శనకు అడ్డుపడతారనే ప్రచారం జరగటంతో వెదురు కర్రలతో ప్రదర్శన మొత్తం పదిమంది కార్యకర్తలు రక్షణగా వెళ్లారు. పార్టీ కార్యక్రమం కాదు: ఎంపీ నామా ఇది పార్టీ కార్యక్రమం కాదు.. దయచేసి వివాదం చేయకండి అంటూ ఎంపీ నామా నాగేశ్వరరావు విలేకరుల సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీ వేరు.. సామాజిక కార్యక్రమం వేరు. ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తారని నేను ఊహించలేదంటూ బదులిచ్చారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరా... ఎంపీ నామా నాగేశ్వరరావు పర్యటనపై సండ్ర వెంకటవీరయ్య ఎప్పటికప్పుడు ఆరా తీసే పనిలో పడ్డారు. ఎవరెవరూ నామా వెంట ఉన్నారు.. అనే సమాచారాన్ని సేకరించే పనిలో ఆయన అనుచరులు నిమగ్నమయ్యారు.