కర్నాటకలో సాధించిన విజయం తెలంగాణ కాంగ్రెస్‌లో ఎక్కడా లేని జోష్ నింపింది. దీంతో అన్ని జిల్లాల్లోనూ టిక్కెట్ల కోసం వార్ మొదలైంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మూడు వర్గాలుగా ఏర్పడి టిక్కెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మొన్నటి వరకు రెండే గ్రూపులుండేవి. తాజాగా గులాబీ పార్టీ నుంచి వచ్చిన మరో నేత కూడా సీటు నాదే అంటున్నారు. సత్తుపల్లి కాంగ్రెస్‌లో గ్రూప్ వార్ ఏ స్థాయిలో జరుగుతోందో చూద్దాం.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెట్ వార్ తారాస్థాయికి చేరింది. ముగ్గురు నాయకులు సొంతంగా గ్రూప్లు ఏర్పాటు చేసుకుని..పార్టీ కార్యక్రమాలు ఎవరికి వారుగా నిర్వహించుకుంటున్నారు. నిన్నా..మొన్నటి వరకు రెండు గ్రూప్‌లే ఉండేవి..అయితే తాజాగా అధికార పార్టీ నుంచి మరో నేత వచ్చి మూడో గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు.
ఇప్పుడు సత్తుపల్లి టిక్కెట్ కోసం ముగ్గురు నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేత, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్ మధ్య మొన్నటి వరకు ఆధిపత్య పోరు సాగింది. తాజాగా బీఆర్ఎస్ నేత మట్టా దయానంద్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మూడు వర్గాలుగా చీలిపోయింది. ఇంతకుముందు చంద్రశేఖర్, మానవతారాయ్ వెంట ఉన్నవారిలో కొందరు ఇప్పుడు దయానంద్ వర్గంలో చేరిపోయారు. ఇలా నాయకులు వర్గాలు మార్చడంతో సత్తుపల్లి కాంగ్రెస్లో వార్ మరింత ముదిరింది.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ మట్టా దయానంద్ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న సందర్భంలో సత్తుపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో మాజీ మంత్రి సంబానీ వర్గం, మానవతారాయ్ వర్గం వేరువేరుగా జెండా ఆవిష్కరణలు నిర్వహించారు. ఒకే ప్రాంతంలో ఒకే పార్టీలో ముగ్గురు నేతలు గ్రూప్లుగా విడిపోయి కార్యక్రమాలు చేస్తూ ఉండటంతో గ్రామస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. ఏ వర్గంతో ఉంటే తమకు ఉపయోగం ఉంటుందా అని కేడర్ కూడా ఆలోచిస్తోంది. కాని పార్టీ టిక్కెట్ ఎవరికి వస్తుందో తెలియదు గనుక ఏ వర్గానికి పనిచేయాలో తేల్చుకోలేక అయోమయానికి గురవుతున్నారు.
నియోజకవర్గంలో పట్టు సంపాదించిన కొత్తగా వచ్చిన డాక్టర్ మట్టా దయానంద్ కు టికెట్ వస్తుందా లేక సీనియర్ నాయకుడు సంబానీ చంద్రశేఖర్‌కు కేటాయిస్తారా? లేక విద్యార్థి నేతగా ఎదిగి, పార్టీలో పట్టు సంపాదిస్తున్న టిపిసిసి అధికార ప్రతినిధి మానవతారాయ్ కు టికెట్ వస్తుందా అనే చర్చ ఇప్పుడు సత్తుపల్లిలో హాట్ టాపిక్ గా మారింది.
అయితే టికెట్ తమకే ఇస్తారని ముగ్గురు నేతలు దీమాతో ఉన్నారు. సంబానీ చంద్రశేఖర్ తనకు టికెట్ ఖరారు అయిపోయిందనుకున్న తరుణంలో మట్టా దయానంద్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు సంభాని ఆందోళన చెందుతున్నారు. అసలు మట్టా దయానంద్ కాంగ్రెస్లో చేరుతున్న విషయం చివరి నిమిషం వరకు సంభానికి తెలియదట. దయానంద్ పార్టీలో చేరుతున్న సమయంలో అసలు సంభాని నియోజకవర్గంలోనే లేరు. దీంతో ఆయన అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. టిక్కెట్ విషయాన్ని హైకమాండ్ దగ్గరే తేల్చుకుందామని నిర్ణయించుకున్నారట సంభాని చంద్రశేఖర్.
గడచిన నాలుగేళ్ళలో లేని ఉత్సాహం కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. అదే సమయంలో టిక్కెట్ వార్ కూడా తీవ్రస్థాయికి చేరుతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ మూడు నాలుగు గ్రూప్లు తయారై టిక్కెట్ కోసం తలపడుతున్నాయి. సత్తుపల్లిలోని మూడు గ్రూప్లను ఎలా దారికి తెచ్చుకుంటారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment