సత్తుపల్లి, న్యూస్‌లైన్: పందేలకు పెట్టింది పేరైన సత్తుపల్లి నియోజకవర్గంలో మరోమారు ఆ సంస్కృతి ఊపందుకుంది. వరుస ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. మొన్నటి వరకు క్రికెట్ బెట్టింగ్‌లు మాత్రమే నిర్వహించిన ఈ ప్రాంత బుకీలు ఇప్పుడు ఎన్నికల రిజల్ట్స్‌పై దృష్టిపెట్టారు. సోమవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మొదలు ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల ఫలితాల వరకు ఒకదాని తర్వాత ఒకటి వెలువడనున్న నేపథ్యంలో పందెం రాయుళ్లకు చేతినిండా పనిదొరికింది. సంపాదనే ధ్యేయంగా పార్టీలకతీతంగా పందెంరాయుళ్లు బెట్టింగ్ నిర్వహణకు పూనుకున్నారు.
సీమాంధ్రలో 7వ తేదీ ఎన్నికలు పూర్తయిన కొద్దిక్షణాల్లోనే సత్తుపల్లిలో పందేలు జోరందుకున్నాయి. అక్కడి ఎన్నికల సరళిని బట్టి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ హవా కొనసాగిం దని, ఫ్యాన్‌గాలి జోరుగా వీచిందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే పందే లు జోరందుకున్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మెజార్టీపైనా జోరు గా పందేలు సాగుతున్నాయి. లక్షకు పైగా ఆయన మెజార్టీ సాధిస్తారని లక్ష రూపాయల వరకు కొందరు బెట్టింగ్ పెడుతున్నారు. అందుకు ఒక్క ఓటైనా తక్కువ వస్తుందని మరికొందరు పందెం కాస్తున్నారు. కొందరు రూ.లక్షలు వడ్డీకి తెచ్చి బెట్టింగ్‌కు దిగుతున్నట్లు తెలుస్తోంది.
పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సత్తుపల్లి నియోజకవర్గంలో ముప్పైవేలకు పైగా మెజార్టీ వస్తుందని.. లక్ష ఓట్లతో ఎంపీగా గెలుస్తారంటూ పందేలు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే లక్షల రూపాయల్లో పందేలు వేసినట్లు సమాచారం. శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలోని కల్లూరు మండలం నారాయణపురం గ్రామవాసి కావటంతో ఈ ప్రాంతంలో రాజకీయాలకు అతీతంగా ఎంపీ ఓట్లు క్రాస్ అయినట్లు రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు.
సీమాంధ్రలో పోలింగ్ జరుగుతుండగానే ఆ ప్రాంతానికి జగన్ సీఎం అవుతారని పందేలు జోరుగా నడిచాయి. ఫలానా జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీకి ఇన్ని, టీడీపీకి ఇన్ని సీట్లు వస్తాయని, కాంగ్రెస్ పరిస్థితి ఇలావుంటుందని లెక్కలు కట్టి మరీ 7వ తేదీ నుంచే పందేలకు పదును పెట్టినట్లు తెలుస్తోంది. సీమాంధ్రప్రాంతంలో ఉన్న సన్నిహితులు, బంధువుల నుంచి సమాచారం తెప్పించుకొని పందేలకు దిగుతున్నట్లు సమాచారం. చంద్రబాబునాయుడు సీఎం అవుతారని మాత్రం ఏ ఒక్కరూ పందెం కాయడానికి ముందుకు రావటంలేదని తెలిసింది. టీడీపీకి వచ్చే సీట్లపైన మాత్రం పందేలు కాస్తున్నట్లు సమాచారం.
సత్తుపల్లి అసెంబ్లీ ఫలితంపై ఊపందుకుంటున్న పందేలు..
సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఎవరు ఎన్నికవుతారనే విషయంపైనా పందేలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. సత్తుపల్లి అసెంబ్లీ ఫలితంపై 2009 అసెంబ్లీ ఎన్నికలప్పుడు రూ.కోట్లలో జరిగిన పందేలు మొన్న టి వరకు స్తబ్దుగా ఉన్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యల్లో గెలుపు ఎవరిదో అర్థంకాని స్థితిలో పందెంరాయుళ్లు మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్నారు. సెలైంట్ ఓటింగ్, వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి దయానంద్ స్థానికు డు కావటం వల్ల ఓటర్లపై ఏమేరకు ప్రభావం పడిం దో అర్థంకాక పందెం రాయుళ్ళు తలలు పట్టుకున్నా రు. ఓట్ల చీలికపై లెక్కలు వేసుకున్న టీడీపీ నేతలు కొందరు తమ పార్టీ అభ్యర్థి గెలుపుపై పందెం కాయకుండా మెజార్టీపై పందెం కాస్తామంటూ ముందుకు వస్తున్నట్లు సమాచారం. కొందరు ధైర్యం చేసి గెలపోటములపైనా పందెం కాస్తున్నట్లు తెలుస్తోంది.
సొంత సర్వేలతోనే..
ఎప్పుడు సంస్థలు చేసే సర్వే, ఇంటెలిజెన్స్ రిపోర్టలపైనే ఆధారపడే అభ్యర్థులు ఈసారి సొంతంగా సర్వేలు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికోసం కొంతమందిని నియమించి గ్రామాల వారీగా ఓటర్ల నాడిని కనుక్కునే ప్రయత్నం చేశారని సమాచారం. అభ్యర్థులు చేయించిన సర్వేల ఫలితాలను తెప్పించుకొని, మీడియా సంస్థల అంచనాలను సరిపోల్చుకొని కొందరు బెట్టింగ్‌కు దిగుతున్నట్లు తెలిసింది. కొందరు సొంతంగా సర్వేలు చేయించుకొని పందేలు కాస్తున్నారని సమాచారం. గతంలో పందేలు కాసి నష్టపోయిన పలువురు ‘తమ్ముళ్లు’ ఈసారి జాగ్రత్తపడుతున్నట్లు వినికిడి.
పందేనికి సై
Published Sun, May 11 2014 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM
Advertisement
Advertisement