The results of the general elections
-
మహానాడుకు తుమ్మల డుమ్మా
సాక్షి, ఖమ్మం: జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీ రాష్ట్ర మహానాడుకు హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీ యాంశమయింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ ప్రతి ష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహా నాడు మంగళవారం గండిపేటలో ప్రారంభమయింది. అయితే తెలంగాణలోనే అత్యంత కీలకనాయకునిగా గుర్తింపు ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మహానాడు తొలిరోజు వెళ్లలేదు. సోమవారం తన సమీప బంధువు కర్మకాండలు ఉండడంతో ఆయన సొంత నియోజకవర్గంలోనే ఉన్నారు. మంగళవారం కూడా పార్టీ సీనియర్ నేత ఒకరు మరణించడంతో తుమ్మల హైదరాబాద్‌కు వెళ్లలేదని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అయితే, మహానాడు లాంటి రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి తుమ్మల ఎందుకు వెళ్లలేదన్న దానిపై చర్చ జరుగుతోంది. గత ఎన్నికలలో తన ఓటమికి గల కారణాలను పూర్తి స్థాయిలో విశ్లేషించుకున్న ఆయన తన అసంతృప్తిని అధినేతకు తెలియజేసేందుకే తొలిరోజు మహానాడుకు వెళ్లలేదని సమాచారం. తాజా ఎన్నికలలో జిల్లాలో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల సమయంలో గ్రూపు తగాదాలను నిలువరించడంలో అధినేత వ్యవహారశైలి... తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని తన అసమ్మతిని తెలియజేయాలన్న ఆలోచనతోనే తుమ్మల తొలిరోజు భేటీకి వెళ్లలేదని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, రెండోరోజు కార్యక్రమానికి హాజరవుతారని కొందరు నాయకులు అంటున్నారు. ఆయన మహానాడులో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రమే హైదరాబాద్ వెళ్లారని, బుధవారం గండిపేట వెళతారని వారు చెబుతున్నారు. ఏదిఏమైనా సొంత పని కారణం చూపి మహానాడుకు వెళ్లకపోవడం ఒకరకంగా పార్టీ అధినాయకత్వానికి తుమ్మల ఇచ్చిన హెచ్చరిక సంకేతమే అనే చర్చ జరుగుతోంది. -
టీడీపీకి దిక్కెవరు?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పార్టీ ఆవిర్భావం నుంచి మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాల వరకు జిల్లాలో పెద్ద శక్తిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా కుదేలైంది. పటిష్టమైన క్షేత్రస్థాయి నిర్మాణంతో ఎప్పుడూ టీడీపీని ఆదరించే జిల్లా ప్రజానీకం ఈసారి ఆ పార్టీకి చుక్కలు చూపించారు. పార్టీ తరఫున పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఓటమి పాలు కాగా, చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని అత్తెసరు మెజారిటీతో దక్కించుకుంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా నైరాశ్యంలో కూరుకుపోయాయి. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని పార్టీని చక్కదిద్దుకునే పనిలో పడాల్సిన నాయకత్వం ఎప్పటిలాగే గ్రూపు తగాదాలకే ప్రాధాన్యం ఇస్తుండడంతో అసలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉన్నట్టా లేనట్టా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆ ఇద్దరే కారణమా? వాస్తవానికి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ చాలా బలీయంగా ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా క్షేత్రస్థాయిలో పటిష్టమైన పునాదులను ఏర్పరుచుకున్న తెలుగు తమ్ముళ్లు తమకు లభించిన ప్రజాబలంతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక పదవులు పొందారు. తొలి నుంచి జిల్లా పార్టీలో తుమ్మల నాగేశ్వరరావుదే ఆధిపత్యం ఉండేది. వరంగల్ జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త నామా నాగేశ్వరరావు 2004లో ఖమ్మం పార్లమెంటు స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేంతవరకు జిల్లాలో పార్టీని ఒంటిచేత్తో నడిపించారు తుమ్మల. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లలో మంత్రి పదవులు నిర్వహించిన ఆయన ఒకప్పుడు జిల్లా రాజకీయాలనే శాసించారు. జిల్లాలో ఏది జరగాలన్నా తుమ్మల గ్రీన్‌సిగ్నల్ ఉండాల్సిందే అన్న రీతిలో ఆయన రాజకీ యాలను నడిపించారు. అయితే, నామా ఎంట్రీ తుమ్మల ఆధిపత్యానికి గండికొట్టింది. ఆర్థికబలాన్ని ఉపయోగించుకుని జిల్లాలో తనదంటూ ఒక ప్రత్యేక గ్రూపును ఏర్పాటు చేసుకున్న నామా ఒకరకంగా తుమ్మలను ఏకాకిని చేసేంతవరకు తీసుకొచ్చారు. పార్టీ అధినేత వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని తుమ్మల హవా నడవకుండా అడ్డుకున్నారు. జిల్లాలో పార్టీకి సంబంధించిన పదవులను కూడా తుమ్మల వర్గానికి దక్కనీయలేదు. ఏకంగా తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తుమ్మల వర్గానికి లభించిన ఓ ఎమ్మెల్యే స్థానాన్ని రాత్రికి రాత్రే మార్పించి తన అనుచరురాలికి ఇప్పించుకున్నారు. ఆ స్థాయిలో నామా, తుమ్మల ఢీ అంటే ఢీ అనడంతో జిల్లాలో పార్టీ నిట్టనిలువునా చీలిపోయింది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అయితే ఇరు వర్గాలు బహిరంగంగానే వ్యతిరేకంగా పనిచేసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యర్థి వర్గం గెలవకూడదన్న పట్టుదలతో పనిచేసి ఇరు వర్గాలను ఓడించుకున్నాయి. అటు ఖమ్మం ఎంపీగా నామా, ఎమ్మెల్యేగా తుమ్మల ఇద్దరూ ఓటమిపాలయ్యారు. దీంతో ఇక అసలు జిల్లాలో పార్టీని పట్టించుకునేదెవరో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు వెలువడిన జిల్లా పరిషత్ ఫలితాలలో టీడీపీ స్పష్టమైన మెజార్టీని దక్కించుకుంది. అయితే, చైర్‌పర్సన్‌గా ఎవరుండాలన్న దానిపై రెండు గ్రూపుల మధ్య సయోధ్య కుదరడం లేదు. తమ వర్గానికంటే తమకేనంటూ రెండు వర్గాలు పట్టుబడుతుండడంతో అసలు ఆ తత ంగం ఎలా జరుగుతుందోనన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. భవిష్యత్తేంటి... ఇదిలా ఉంటే మళ్లీ ఎన్నికలు వచ్చేంతవరకు అసలు జిల్లాలో పార్టీని ఎలా నడుపుతారనేది ఇప్పుడు జిల్లా తెలుగుదేశం శ్రేణుల్లో అంతుపట్టని ప్రశ్నగా మిగిలింది. పార్టీని ఇప్పటివరకు నడిపించిన ఇద్దరు నాయకులు ఓడిపోవడంతో పార్టీని నడిపించే బాధ్యతను ఎవరు తీసుకుంటారనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. ఆ నిర్ణయానికి ఇరు వర్గాలూ కట్టుబడతాయా అనేది చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే దాదాపు పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ తెలంగాణలో మరో ఐదేళ్ల పాటు కూడా అదే పరిస్థితిలో ఉండనుంది. అధికారం వరుసగా 15 ఏళ్లు దూరమయ్యే పరిస్థితి ఉండడంతో పార్టీ ఆర్థికవనరులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు దాదాపు అన్ని ఎన్నికలు పూర్తవడంతో మళ్లీ రాజకీయంగా సందడి కూడా అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో కనీసం పార్టీ పిలుపులకైనా కేడర్ స్పందిస్తుందా? అసలు ఎవరు పార్టీని నడిపించాలి అనేది ఇప్పుడు ఖమ్మం జిల్లా టీడీపీ కేడర్‌ను వేధిస్తోంది. మరోవైపు పార్టీ జిల్లా అధ్యక్షుడిని మార్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే జిల్లా పగ్గాలు చేపట్టేందుకు ఎవరికి అవకాశం వస్తుంది.. ఐదేళ్లు పాటు సొంత ఖర్చులతో పార్టీని గట్టెక్కించేందుకు సదరు నేత అంగీకరిస్తారా? ఆయన అంగీకరించినా అందరూ సహకరిస్తారా? అసలు ఖమ్మం జిల్లాల్లో టీడీపీ భవిష్యత్తేంటి అనేది జిల్లా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. -
కారు.. ఫుల్జోరు
సాక్షి, సంగారెడ్డి: సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఊపుతో జోరు మీద ఉన్న టీఆర్ఎస్ ఎన్నికలు ముగిశాకా కూడా సీట్ల వేటను కొనసాగిస్తోంది. ప్రత్యర్థి పార్టీల సభ్యులు, స్వంతంత్రులను బుట్టలో వేసుకుని హంగ్‌గా మారిన స్థానిక సంస్థలను కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. అధికారంలోకి రానున్న టీఆర్ఎస్తో జత కట్టి అధికారపక్షంలో భాగస్వామ్యం అయ్యేందుకు ఇతర పార్టీల సభ్యులూ ఉత్సాహాన్ని చూపుతున్నారు. ముగ్గురు కాంగ్రెస్ జెడ్పీటీసీలకు గాలం వేసిన టీఆర్ఎస్ నేతలు జిల్లా పరిషత్‌పై గులాబీ జెండాను ఎగుర వేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ఏ పార్టీ పూర్తి మెజారిటీ సాధించక ఊగిసలాడుతున్న మండలాలు, మున్సిపాలిటీలపై సైతం ఆకర్ష్ మంత్రం ద్వారా గులాబీ జెండాను ఎగుర వేసేందుకు పావులు కదుపుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని ప్రత్యర్థి పార్టీలు సతమతమవుతున్నాయి. జెడ్పీ పీఠం టీఆర్ఎస్ వశం జిల్లాలో 46 జెడ్పీటీసీ స్థానాలకు గత నెలలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 21, కాంగ్రెస్ 21, టీడీపీ 4 జెడ్పీటీసీలను గెలుచుకున్నాయి. ఏ పార్టీ 24 సభ్యుల పూర్తి మెజారిటీ సాధించకపోవడంతో జిల్లా పరిషత్ హంగ్‌గా ఏర్పడడం అనివార్యమైంది. అయితే, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూకుంట నర్సారెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరడంతో జెడ్పీలో బలబలాలు మారిపోయాయి. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు జెడ్పీటీసీలు టీఆర్ఎస్లోకి చేరడంతో టీఆర్ఎస్ మేజిక్ ఫిగర్‌ను సాధించింది. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన మరికొంత మంది జెడ్పీటీసీలు సైతం టీఆర్ఎస్ అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో కొండాపూర్ జెడ్పీటీసీ పి.నాగరాణి జెడ్పీ చైర్పర్సన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణకు సమీప బంధువు కావడంతో ఆమెకే జెడ్పీ పీఠం కట్టబెట్టాలని పార్టీ నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది. ఎంపీపీలు టీఆర్‘ఎస్’ జిల్లాలోని 685 ఎంపీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ 296 స్థానాలు, టీఆర్ఎస్ 215 స్థానాలను గెలుచుకున్నాయి. జిల్లాలోని 46 మండలాల్లో 20 మండలాల అధ్యక్ష స్థానాలను కాంగ్రెస్, 13 మండలాల అధ్యక్ష స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోడానికి సరిపడ ఎంపీటీసీ స్థానాలను ఆయా పార్టీలు గెలుచుకున్నాయి. మిగిలిన 11 మండలాల్లో ఏ పార్టీ పూర్తి మెజారిటీ సాధించలేదు. దీంతో ఈ 11 మండలాల్లో గెలుపొందిన కాంగ్రెస్, టీడీపీ, స్వతంత్ర ఎంపీటీసీలకు టీఆర్ఎస్ ముఖ్యనేతలు గాలం వేస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని గజ్వేల్, ములుగు మండలాల ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోడానికి ఏ పార్టీ పూర్తి మెజారిటీ సాధించలేదు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో ఆ రెండు మండలాలూ టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక స్వతంత్రులు అయితే మూకుమ్మడిగా టీఆర్ఎస్కే మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని మిరుదొడ్డి, అందోల్ నియోజకవర్గం పరిధిలోని టేక్మాల్ ఎంపీపీ స్థానాలను స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో టీఆర్ఎస్ సునాయాసంగా కైవసం చేసుకోబోతోంది. మున్సిపాలిటీలూ గులాబీమయమే! సంగారెడ్డి మున్సిపాలిటీలోని 31 వార్డుల్లో 11 వార్డులను కాంగ్రెస్, 8 వార్డులును ఎంఐఎం గెలుచుకుంది. ఇక్కడ ఏ పార్టీ మేజిక్ ఫిగర్‌ను సాధించకపోవడంతో చైర్మన్ సీటును కైవసం చేసుకోడానికి ఇరు పార్టీలు హోరాహోరీగా ప్రయత్నిస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి ఇద్దరు సభ్యుల మద్దతు టీఆర్ఎస్కే లభించనుండడంతో ఆ పార్టీ బలం 10కు పెరిగింది. ఇక ఇక్కడి నుంచి గెలిచిన 5 మంది స్వంతంత్ర సభ్యుల్లో ఇద్దరితో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు సైతం ఎంఐఎం వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీంతో 16 మంది సభ్యుల మద్దతుతో ఎంఐఎం చెర్మైన్ సీటును కైవసం చేసుకోబోతోందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సంగారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్‌కు దక్కకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న టీఆర్ఎస్ ఈ దిశగా ఎంఐఎంకు పూర్తి సహకారాన్ని అందిస్తుండడం గమనార్హం. సదాశివపేట మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో కాంగ్రెస్ 13 వార్డులు గెలిచి పూర్తి మెజారిటీ సాధించినా, చైర్పర్సన్ ఎంపిక విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ఆ పార్టీ నుంచి గెలిచిన పట్నం విజయలక్ష్మికి చైర్పర్సన్ పదవిని కట్టబెట్టేందుకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మొగ్గు చూపగా..లింగాయత్ సామాజికవర్గానికి చెందిన శీల, పిల్లోడి జయమ్మ, ఆకుల మంజు తదితరులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఈ తిరుగుబాటును తెర వెనక నుంచి ప్రోత్సహించడం ద్వారా టీఆర్ఎస్ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్ 5 వార్డులను గెలుచుకోగా మరో 6 మంది సభ్యుల మద్దతును కూడగట్టుకుంటే ఆ పార్టీ చైర్పర్సన్ పదవిని కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో 20 వార్డుల్లో 10 వార్డులు టీడీపీ, 9 టీఆర్ఎస్, ఓ వార్డును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నర్సారెడ్డి చేరికతో టీఆర్ఎస్ బలం 10కి పెరిగింది. టీడీపీ నుంచి ఒకరిద్దరు టీఆర్ఎస్కు మద్దతిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మెదక్ మున్సిపాలిటీలోని 27 వార్డుల్లో టీఆర్ఎస్ 11 వార్డులను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినా మేజిక్ ఫిగర్‌కు చేరుకోలేకపోయింది. అయితే, ఇక్కడి నుంచి గెలిచిన ముగ్గురు స్వంతంత్రులు, ఒక ఎంఐఎం సభ్యుడి మద్దతుతో టీఆర్ఎస్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోనుంది. కాంగ్రెస్ 6, టీడీపీ 5 వార్డులను గెలుచుకోగా.. ఈ రెండు పార్టీలకు చెందిన నలుగురు సభ్యులు కూడా టీఆర్ఎస్కు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. -
సచివులు ఎవరో?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిందే తడువుగా శనివారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం, ఎల్పీ నేతగా కేసీఆర్ ఎన్నిక జరిగింది. ఈ నేపథ్యంలో కొత్తగా కొలువుదీరే కేసీఆర్ మంత్రివర్గంలో జిల్లా నుంచి మంత్రిగా ఎవరికీ అవకాశం దక్కుతుందనే అంశం చర్చనీయాంశగా మారింది. రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్లో ఇప్పుడు మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొందరు సీనియర్ల పేర్లను ప్రకటించారు. మోతె గ్రామంలో మట్టిముడు పు విప్పిన ఆయన రాబోయే టీఆర్ఎస్ ప్రభుత్వంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డిలాంటి సీనియర్లకు మంత్రిగా అవకాశం ఇచ్చి జిల్లాను అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నా రు. డిచ్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారసభలో బాజిరెడ్డి గోవర్ధన్‌ను డైనమిక్ లీడర్‌గా పేర్కొ న్న కేసీఆర్ ఆయనను గెలిపిస్తే తెలంగాణ స్థాయిలో పెద్ద పదవి కట్టబెట్టబెడతానని హామీ ఇచ్చారు. గోవర్ధన్‌కు కూడ సీనియర్ నేతగా రాజకీయ అనుభవం, జిల్లా మీద మంచి పట్టు కూడా ఉంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్న ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి నాలుగోసారి ఎల్లారెడ్డి నుంచి గెలుపొందారు. ఆయన పేరు కూడ మం త్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితాలో ఉంది. రేసులో గంప గోవర్ధన్, హన్మంత్ సింధే జిల్లాలో మొత్తం స్థానాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందడటం, పలువురు మంత్రి పదవిని ఆశిస్తుండడం పార్టీలో తర్జనభర్జనలకు కారణమవుతోంది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గోవర్ధన్, రవీందర్‌రెడ్డితో పాటు రెండుసార్లు కామారెడ్డి, జుక్కల్ నుంచి గెలుపొందిన గంప గోవర్ధన్, హన్మంత్ సింధే కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా బరిలో దిగిన ఈ ఇద్దరు నేతలు కూడ భారీ ఆధిక్యత నే సాధించారు. తొమ్మిదింటికి తొమ్మిది స్థానాలు గెలి చిన నేపథ్యంలో జిల్లాలో ఇద్దరికీ మంత్రి పదవి ఇ వ్వాలని అధినేత భావిస్తే, అగ్రవర్ణాల నుంచి ఒకరికి, ఇతర సామాజికవర్గాల నుంచి మరొకరికి అవకాశం ఉంటుందంటున్నారు. ఇదే జరిగితే నాలుగు పర్యా యాలు టీఆర్ఎస్ నుంచి గెలిచిన రవీందర్‌రెడ్డి, లేదా పోచారం శ్రీనివాస్‌రెడ్డిలో ఒకరికి దక్కితే, ఎస్సీ రిజ ర్వుడు నియోజకవర్గం జుక్కల్ నుంచి గెలుపొందిన హన్మంత్ సింధే పేరును పరిశీలించే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. మైనార్టీ నుంచి అవకాశం దక్కితే బోధన్ ఎమ్మెల్యే షకీల్‌కు, వైశ్య సామాజికి వర్గానికి ఇవ్వాలను కుంటే అర్బన్ ఎమ్మెల్యే బిగాల కు అవకాశం రావచ్చు. ఇవేమీ ప్రాతిపదిక కా దు, భవిష్యత్‌లో తెలంగాణ పునర్నిర్మాణం, పార్టీ ప టిష్టం నేపథ్యంలో చురుకైన పాత్రను పోషించే యువకులకు కూడ కేసీఆర్ అవకాశం కల్పించవచ్చన్న చర్చ కూడ ఉంది. ఏదేమైనా శనివారం టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం చోటు చేసుకున్న పరిణామా ల నేపథ్యంలో మంత్రి పదవులు ఎవరికీ దక్కుతాయ న్న ఊహాగానాలు జోరందుకున్నాయి. -
కాంగ్రెస్‌లో నైరాశ్యం
సాక్షి, సంగారెడ్డి: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ తీశాయి. ఫలితాలు పరేషాన్ చేయడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలు గెలిచి ప్రభంజనం సృష్టిస్తే ..ఈసారి రెండు స్థానాలకే పరిమితమైంది. ఓ వైపు టీఆర్ఎస్ గాలి వీచినా ఎవరూ ఊహించని రీతిలో కాంగ్రెస్ సిట్టింగ్ శాసన సభ్యుల్లో ఆరు మంది ఘోరపరాజయాన్ని మూటగట్టుకోవడం స్వయం కృతాపరాధమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార దర్పంతో అభ్యర్థులు వ్యవహరించిన తీరు, పార్టీ అంతర్గత కుమ్ములాటలతో పాటు ఇతర ఆంశాలు జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి దోహదపడ్డాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆయా సిట్టింగ్ అభ్యర్థుల ఓటమికి ప్రధాన కారణాలను ఓ సారి విశ్లేషిస్తే... జగ్గారెడ్డి.. జిత్తులు సంగారెడ్డి .. ఈ పేరు వినగానే రాష్ట్రంలో ఎవరికైనా ఠక్కున గుర్తుకొచ్చే పేరు జగ్గారెడ్డి. విలక్షణ వ్యవహార శైలీతో గత కొన్నేళ్లుగా వార్తల్లో నిలిచిన జగ్గారెడ్డి ఈ ఎన్నికల్లో ఘోరపరాభవాన్ని ఎదుర్కొన్నారు. దీనికి కారణం ఆ వ్యవహార శైలే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2004లో టీఆర్ఎస్, 2009లో కాంగ్రెస్ తరఫున వరుసగా రెండుసార్లు నెగ్గిన జగ్గారెడ్డి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ చేతిలో 29,814 భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయానికి టీ-కాంగ్రెస్ నేతలందరూ తెలంగాణవాదాన్ని అందుపుచ్చుకున్నారు. వీరికి భిన్నంగా జగ్గారెడ్డి సమైక్యవాదాన్ని వినిపిస్తూ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. నాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి వీర వీధేయుడిగా వ్యవహరించారు. కిరణ్‌పై మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహతో సహా ఇతర టీ-కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టుతూ జగ్గారెడ్డి వార్తల్లో ఉండేవారు. జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా .. అందరినీ తోసిరాజని పరిపాలనా వ్యవహారల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేయడంతో కథ అడ్డం తిరిగింది. ఈ అనూహ్య పరిణామంతో జగ్గారెడ్డి వ్యూహం బెడిసికొట్టింది. సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేసిన క్షణం నుంచి జగ్గారెడ్డి పతనం ఆరంభమైంది. టీ-కాంగ్రెస్ నేతల్లో ఆయన ఒంటరిగా మిగిలారు. రెండేళ్ల కింద సంగారెడ్డిలో జరిగిన అల్లర్ల ఘటన అనంతరం జగ్గారెడ్డి వ్యవహార శైలిలో వచ్చిన వ్యూహాత్మక మార్పు సైతం ఆయన వ్యక్తిగత ఇమేజ్‌పై ప్రభావం చూపింది. దామెదరను కలవాలంటేనే డర్ మరో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ వ్యవహారశైలే ఆయన్ను ఓటమి పాలు చేసిందని పలువురు భావిస్తున్నారు. ఆయన 1989, 2004, 2009 ఎన్నికల్లో అందోల్ స్థానం నుంచి మూడుసార్లు గెలుపొందారు. పార్టీ అధిష్టానం ఆశీర్వాదంతో కిరణ్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఆయనలో అధికార దర్పం పెరిగిపోయిందని విమర్శలున్నాయి. తనను కలవడానికి వచ్చే అధికార, అనధికారులు, సామాన్య ప్రజలతో ఆయన పద్ధతి సరిగ్గా ఉండేది కాదని ఆరోపణలున్నాయి. ఇక ఆయన తన పదవి కాలంలో సింహభాగం నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉన్నారు. హైదరాబాద్- ఢిల్లీల మధ్య చక్కర్లు కొడుతూ ఎక్కువ సమయం గడిపారు. నియోజకవర్గంలో కాంట్రాక్టులన్నీ ఆయన సమీప బంధువుకు ఇప్పించగా ఆ పనుల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని తీవ్ర ఆరోపణలున్నాయి. 2009 ఎన్నికల్లో జోగిపేట ప్రజలు తనకు ఓట్లు వేయలేదని కారణంతో పట్టణంలో ఆయన అభివృద్ధి పనులు చేపట్టలేదు. దీంతో పోలింగ్ రోజు స్థానిక ఓటర్లు మధ్యాహ్నం 3 గంటల వరకు ఓట్లు వేయకుండా నిరసన తెలిపారు. వీరిలో కొందరు తమకు డబ్బులు ఇస్తేనే ఓటేస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. టీఆర్ఎస్ గాలితో పాటు తాను చేసుకున్న స్వీయ పొరపాట్లే దామోదరను నట్టేట ముంచాయని పలువురు పేర్కొంటున్నారు. విభేదాలతోనే సునీత ఓటమి నర్సాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన సునీతా లక్ష్మారెడ్డి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చిలుమల మదన్ రెడ్డి చేతిలో 14,217 ఓట్ల తేడాతో పరాజయం చెందారు. తన పదవి కాలంలో ఎక్కువ సమయాన్ని ప్రజల్లో తిరగడానికి కేటాయించినప్పటికీ, ఆమె ఓడిపోవడానికి పార్టీలో అంతర్గత విభేదాలే కారణమని తెలుస్తోంది. ప్రధానంగా ఆమె అన్నీ వర్గాల ప్రజల మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణ ఉంది. అదే విధంగా తన చుట్టూ ఓ కోటరీని ఏర్పాటు చేసుకుని పనులను వారికే ఇచ్చేవారని విమర్శలున్నాయి. నియోజకవర్గంలోని కొంత మంది కాంగ్రెస్ నాయకులు లోపాయికారిగా టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడంతో ఆయా నేతల స్వగ్రామాల్లో టీఆర్ఎస్ మెజారిటీ ఓట్లను సాధించింది. నియోజకవర్గంలో బలంగా ఉన్న సీపీఐ ముఖ్య నేతలు కాంగ్రెస్‌తో పొత్తును విభేదిస్తూ టీఆర్ఎస్లో చేరడం కూడా సునీతా రెడ్డి ఓటమికి దారితీసిందని చెప్పవచ్చు. ‘చెరుకు’....మాటలు కరుకు దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యే చెరుకు మత్యంరెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా కృషి చేసినా ఓడిపోడానికి ఆయన నోటి దురుసే కారణమైంది. ఈ వ్యవహార శైలి నచ్చకే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాలుగు వర్గాలుగా చీలిపోయింది. ఎన్నికలకు ముందు మిగిలిన మూడు వర్గాలు ఏకమై ముత్యంరెడ్డిని ఓడించేందుకు శతవిధాల ప్రయత్నించాయి. దీనికి తోడు టీఆర్ఎస్ గాలివీచడంతో ముత్యం రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి సొలిపేట లింగారెడ్డి చేతిలో 37,899 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. పూర్వం దొమ్మాట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున 1989-99 మధ్యకాలంలో వరుసగా మూడుసార్లు నెగ్గారు. 2004 ఎన్నికలు, 2008 ఉప ఎన్నికల్లో రెండుసార్లు టీఆర్ఎస్ అభ్యర్థి సొలిపేట చేతిలో ఓడిపోయారు. ఆయన 2009లో దొమ్మాట రద్దయి దుబ్బాక నియోజకవర్గం ఆవిర్భవించాకా కాంగ్రెస్‌లో చేరి ఆ ఎన్నికల్లో మళ్లీ సొలిపేటపై 2,649 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వ్యవహార శైలిపై తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారని చర్చ జరుగుతోంది. నందీశ్వర్ వర్సెస్ డీసీసీ పటాన్చెరు, రామచంద్రాపురం, జిన్నారం మండలాలను కలుపుకుని 2009లో పటాన్చెరు నియోజకవర్గం కొత్తగా ఆవిర్భవించింది. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ టీడీపీ అభ్యర్థి సపాన్‌దేవ్‌పై నెగ్గారు. తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి టీడీపీ అభ్యర్థి సపన్దేవ్పై గెలుపొందగా సిట్టింగ్ కాంగ్రెస్ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ మూడో స్థానంలో నిలిచారు. డీసీసీ అధ్యక్షుడు కె భూపాల్ రెడ్డి వర్గంతో విభేదాలు, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే ఆయన్ను మూడోస్థానంలో దిగజార్చిందని విమర్శలు ఎదుర్కొంటున్నారు. నర్సారెడ్డి ..కబ్జాలు? ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, నగర పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 వేల ఓట్లను సాధించి గజ్వేల్ నియోజకవర్గంలో అగ్రస్థానంలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఆ పార్టీ సిట్టింగ్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి 33,998 ఓట్లు మాత్రమే సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు టీడీపీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డి ఇచ్చిన పోటీని సైతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా నర్సారెడ్డి ఇవ్వలేకపోయారు. నర్సారెడ్డి దురుస వైఖరితో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలను సైతం ఆయన విస్మరించడంతో వారంతా టీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. గజ్వేల్ పట్టణంలో ప్రభుత్వ, వక్ఫ్ భూ కబ్జాలను ప్రోత్సహించారని నర్సారెడ్డికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఉద్యమించాయి. పత్తి, మొక్కజొన్న రైతుల సమస్యలను సైతం ఎన్నాడు పట్టించుకోలేదని ఆయనపై ఆరోపణలున్నాయి. -
ఆదిలాబాద్‌లో భారీగా క్రాస్ ఓటింగ్
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మినహాయించి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నగేష్‌కు నియోజకవర్గంలో 72,673 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ అభ్యర్థికి 56,906 ఓట్లు మాత్రమే వచ్చాయి. నగేష్‌కు ఓటు వేసిన వారిలో 15,767 మంది అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్నకు ఓటు వేయలేదు. ఆ ఓట్లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మళ్లాయి. క్రాస్ ఓటింగ్ కానిపక్షంలో ఆ ఓట్లతో కలుపుకుంటే సుమారు 30 వేల మెజార్టీ రామన్నకు దక్కేది. గత ఉప ఎన్నికల్లో 33 వేల మెజార్టీ సాధించిన రామన్న 14,711 మాత్రమే సాధించడం గమనార్హం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఆదిలాబాద్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి పాయల శంకర్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి రాథోడ్ రమేశ్(టీడీపీ) పోటీ చేశారు. పాయల శంకర్‌కు 43,664, రాథోడ్ రమేశ్‌కు 21,555 ఓట్లు మాత్రమే వచ్చాయి. శంకర్‌కు పడిన ఓట్ల నుంచి 22,109 ఓట్లు టీడీపీకి కాకుండా ఇతరులకు మళ్లాయి. టీఆర్ఎస్ ఈ ఓట్లు భారీగా దక్కించుకుంది. కాంగ్రెస్ నుంచి ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థి భార్గవ్‌దేశ్‌పాండేకు 29,964 ఓట్లు రాగా అదే పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థి నరేష్ జాదవ్‌కు 37,488 ఓట్లు పడ్డాయి. భార్గవ్ కంటే 7,524 ఓట్లు నరేష్‌కు అధికంగా వచ్చాయి. ఈ ఓట్లు కూడా టీఆర్ఎస్కే మళ్లాయి. -
జడ్జిమెంట్ డే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు? తమ ఎమ్మెల్యే, ఎంపీలుగా ఎవరిని ఎన్నుకున్నారు? పోటీపడ్డ అభ్యర్థుల్లో విజయం ఎవరిని వరించింది? అదృష్టవంతులెవరు, పరాజితులెవరు? జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? ఈ రోజే తేలిపోతుంది. పదిహేను రోజులు ఉత్కంఠ రేపిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కొద్ది గంటల్లోనే వెలువడనున్నాయి? ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉండటంతో శరవేగంగా మధ్యాహ్నం రెండు గంటలకల్లా పూర్తి ఫలితాలు వెలువడే అవకాశముంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో జరిగిన ఎన్నికలు కావటంతో ఈ ఫలితాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వీటికి తోడుగా కొత్త రాష్ట్రంలో, కేంద్రంలో పరిపాలనా పగ్గాలు చేపట్టేదెవరనే తీర్పును చాటిచెప్పనుండటంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలు, 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీగా ఎన్నికల పోరు సాగింది. మొత్తం 202 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రెండు లోక్‌సభ స్థానాలకు 34 మంది, 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు 168 మంది పోటీ పడ్డారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్ అన్ని స్థానాల్లో పోటీ పడ్డాయి. మిత్రపక్షాలుగా పొత్తు కూడిన బీజేపీ, టీడీపీ చెరో ఆరు స్థానాల్లో బరిలో నిలిచాయి. తొలిసారిగా వైఎస్సార్సీపీ పదకొండు అసెంబ్లీ స్థానాల్లో తలపడింది. స్వతంత్య్ర అభ్యర్థులు సైతం కొన్నిచోట్ల హడలెత్తించారు. జిల్లాలోనే అత్యధికంగా రామగుండం నియోజకవర్గంలో 27 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అత్యల్పంగా మంథని, హుజూరాబాద్‌లో తొమ్మిది మంది చొప్పున బరిలో ఉన్నారు. ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్, మాజీ మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, ప్రవీణ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, కేటీఆర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, చెన్నమనేని రమేశ్‌బాబు, సోమారపు సత్యనారాయణ, ఎల్.రమణ, సిహెచ్.విజయరమణరావు, సుద్దాల దేవయ్య ఈ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో మరోసారి చట్టసభల్లో అడుగు పెట్టే అవకాశం ఎవరెవరికి దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. వీరితో పాటు మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్.విద్యాసాగర్‌రావు, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొమ్‌రెడ్డి రామ్‌లు, బొమ్మ వెంకటేశ్వర్లు, కేడీసీసీబీ అధ్యక్షుడు కొండూరి రవీందర్రావు, మాజీ మంత్రులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, జువ్వాడి రత్నాకర్‌రావు, చెల్మెడ ఆనందరావు, ముద్దసాని దామోదర్‌రెడ్డి తనయులు సతీష్‌బాబు, నర్సింగరావు, లక్ష్మీకాంతరావు, కశ్యప్‌రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో త్రుటిలో విజయం చేజార్చుకున్న ఆది శ్రీనివాస్, పుట్ట మధు, కోరుకంటి చందర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఈసారైనా జెండా ఎగరేస్తారా? అనేది ఆసక్తి రేపుతోంది. వీరితో పాటు ప్రధాన పార్టీల తరఫున తొలిసారి పోటీకి దిగిన అభ్యర్థుల్లో అసెంబ్లీ, పార్లమెంటులో అడుగుపెట్టేదెవరనే ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. -
పందేనికి సై
సత్తుపల్లి, న్యూస్‌లైన్: పందేలకు పెట్టింది పేరైన సత్తుపల్లి నియోజకవర్గంలో మరోమారు ఆ సంస్కృతి ఊపందుకుంది. వరుస ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. మొన్నటి వరకు క్రికెట్ బెట్టింగ్‌లు మాత్రమే నిర్వహించిన ఈ ప్రాంత బుకీలు ఇప్పుడు ఎన్నికల రిజల్ట్స్‌పై దృష్టిపెట్టారు. సోమవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మొదలు ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల ఫలితాల వరకు ఒకదాని తర్వాత ఒకటి వెలువడనున్న నేపథ్యంలో పందెం రాయుళ్లకు చేతినిండా పనిదొరికింది. సంపాదనే ధ్యేయంగా పార్టీలకతీతంగా పందెంరాయుళ్లు బెట్టింగ్ నిర్వహణకు పూనుకున్నారు. సీమాంధ్రలో 7వ తేదీ ఎన్నికలు పూర్తయిన కొద్దిక్షణాల్లోనే సత్తుపల్లిలో పందేలు జోరందుకున్నాయి. అక్కడి ఎన్నికల సరళిని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ హవా కొనసాగిం దని, ఫ్యాన్‌గాలి జోరుగా వీచిందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే పందే లు జోరందుకున్నాయి. వైఎస్ఆర్సీపీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మెజార్టీపైనా జోరు గా పందేలు సాగుతున్నాయి. లక్షకు పైగా ఆయన మెజార్టీ సాధిస్తారని లక్ష రూపాయల వరకు కొందరు బెట్టింగ్ పెడుతున్నారు. అందుకు ఒక్క ఓటైనా తక్కువ వస్తుందని మరికొందరు పందెం కాస్తున్నారు. కొందరు రూ.లక్షలు వడ్డీకి తెచ్చి బెట్టింగ్‌కు దిగుతున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సత్తుపల్లి నియోజకవర్గంలో ముప్పైవేలకు పైగా మెజార్టీ వస్తుందని.. లక్ష ఓట్లతో ఎంపీగా గెలుస్తారంటూ పందేలు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే లక్షల రూపాయల్లో పందేలు వేసినట్లు సమాచారం. శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలోని కల్లూరు మండలం నారాయణపురం గ్రామవాసి కావటంతో ఈ ప్రాంతంలో రాజకీయాలకు అతీతంగా ఎంపీ ఓట్లు క్రాస్ అయినట్లు రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు. సీమాంధ్రలో పోలింగ్ జరుగుతుండగానే ఆ ప్రాంతానికి జగన్ సీఎం అవుతారని పందేలు జోరుగా నడిచాయి. ఫలానా జిల్లాలో వైఎస్ఆర్సీపీకి ఇన్ని, టీడీపీకి ఇన్ని సీట్లు వస్తాయని, కాంగ్రెస్ పరిస్థితి ఇలావుంటుందని లెక్కలు కట్టి మరీ 7వ తేదీ నుంచే పందేలకు పదును పెట్టినట్లు తెలుస్తోంది. సీమాంధ్రప్రాంతంలో ఉన్న సన్నిహితులు, బంధువుల నుంచి సమాచారం తెప్పించుకొని పందేలకు దిగుతున్నట్లు సమాచారం. చంద్రబాబునాయుడు సీఎం అవుతారని మాత్రం ఏ ఒక్కరూ పందెం కాయడానికి ముందుకు రావటంలేదని తెలిసింది. టీడీపీకి వచ్చే సీట్లపైన మాత్రం పందేలు కాస్తున్నట్లు సమాచారం. సత్తుపల్లి అసెంబ్లీ ఫలితంపై ఊపందుకుంటున్న పందేలు.. సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఎవరు ఎన్నికవుతారనే విషయంపైనా పందేలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. సత్తుపల్లి అసెంబ్లీ ఫలితంపై 2009 అసెంబ్లీ ఎన్నికలప్పుడు రూ.కోట్లలో జరిగిన పందేలు మొన్న టి వరకు స్తబ్దుగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యల్లో గెలుపు ఎవరిదో అర్థంకాని స్థితిలో పందెంరాయుళ్లు మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్నారు. సెలైంట్ ఓటింగ్, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దయానంద్ స్థానికు డు కావటం వల్ల ఓటర్లపై ఏమేరకు ప్రభావం పడిం దో అర్థంకాక పందెం రాయుళ్ళు తలలు పట్టుకున్నా రు. ఓట్ల చీలికపై లెక్కలు వేసుకున్న టీడీపీ నేతలు కొందరు తమ పార్టీ అభ్యర్థి గెలుపుపై పందెం కాయకుండా మెజార్టీపై పందెం కాస్తామంటూ ముందుకు వస్తున్నట్లు సమాచారం. కొందరు ధైర్యం చేసి గెలపోటములపైనా పందెం కాస్తున్నట్లు తెలుస్తోంది. సొంత సర్వేలతోనే.. ఎప్పుడు సంస్థలు చేసే సర్వే, ఇంటెలిజెన్స్ రిపోర్టలపైనే ఆధారపడే అభ్యర్థులు ఈసారి సొంతంగా సర్వేలు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికోసం కొంతమందిని నియమించి గ్రామాల వారీగా ఓటర్ల నాడిని కనుక్కునే ప్రయత్నం చేశారని సమాచారం. అభ్యర్థులు చేయించిన సర్వేల ఫలితాలను తెప్పించుకొని, మీడియా సంస్థల అంచనాలను సరిపోల్చుకొని కొందరు బెట్టింగ్‌కు దిగుతున్నట్లు తెలిసింది. కొందరు సొంతంగా సర్వేలు చేయించుకొని పందేలు కాస్తున్నారని సమాచారం. గతంలో పందేలు కాసి నష్టపోయిన పలువురు ‘తమ్ముళ్లు’ ఈసారి జాగ్రత్తపడుతున్నట్లు వినికిడి.