సాక్షి, సంగారెడ్డి: సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఊపుతో జోరు మీద ఉన్న టీఆర్‌ఎస్ ఎన్నికలు ముగిశాకా కూడా సీట్ల వేటను కొనసాగిస్తోంది. ప్రత్యర్థి పార్టీల సభ్యులు, స్వంతంత్రులను బుట్టలో వేసుకుని హంగ్‌గా మారిన స్థానిక సంస్థలను కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. అధికారంలోకి రానున్న టీఆర్‌ఎస్‌తో జత కట్టి అధికారపక్షంలో భాగస్వామ్యం అయ్యేందుకు ఇతర పార్టీల సభ్యులూ ఉత్సాహాన్ని చూపుతున్నారు. ముగ్గురు కాంగ్రెస్ జెడ్పీటీసీలకు గాలం వేసిన టీఆర్‌ఎస్ నేతలు జిల్లా పరిషత్‌పై గులాబీ జెండాను ఎగుర వేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ఏ పార్టీ పూర్తి మెజారిటీ సాధించక ఊగిసలాడుతున్న మండలాలు, మున్సిపాలిటీలపై సైతం ఆకర్ష్ మంత్రం ద్వారా గులాబీ జెండాను ఎగుర వేసేందుకు పావులు కదుపుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని ప్రత్యర్థి పార్టీలు సతమతమవుతున్నాయి.
జెడ్పీ పీఠం టీఆర్‌ఎస్ వశం
జిల్లాలో 46 జెడ్పీటీసీ స్థానాలకు గత నెలలో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 21, కాంగ్రెస్ 21, టీడీపీ 4 జెడ్పీటీసీలను గెలుచుకున్నాయి. ఏ పార్టీ 24 సభ్యుల పూర్తి మెజారిటీ సాధించకపోవడంతో జిల్లా పరిషత్ హంగ్‌గా ఏర్పడడం అనివార్యమైంది. అయితే, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూకుంట నర్సారెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరడంతో జెడ్పీలో బలబలాలు మారిపోయాయి. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు జెడ్పీటీసీలు టీఆర్‌ఎస్‌లోకి చేరడంతో టీఆర్‌ఎస్ మేజిక్ ఫిగర్‌ను సాధించింది. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన మరికొంత మంది జెడ్పీటీసీలు సైతం టీఆర్‌ఎస్ అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో కొండాపూర్ జెడ్పీటీసీ పి.నాగరాణి జెడ్పీ చైర్‌పర్సన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణకు సమీప బంధువు కావడంతో ఆమెకే జెడ్పీ పీఠం కట్టబెట్టాలని పార్టీ నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది.
ఎంపీపీలు టీఆర్‘ఎస్’
జిల్లాలోని 685 ఎంపీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ 296 స్థానాలు, టీఆర్‌ఎస్ 215 స్థానాలను గెలుచుకున్నాయి. జిల్లాలోని 46 మండలాల్లో 20 మండలాల అధ్యక్ష స్థానాలను కాంగ్రెస్, 13 మండలాల అధ్యక్ష స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకోడానికి సరిపడ ఎంపీటీసీ స్థానాలను ఆయా పార్టీలు గెలుచుకున్నాయి. మిగిలిన 11 మండలాల్లో ఏ పార్టీ పూర్తి మెజారిటీ సాధించలేదు. దీంతో ఈ 11 మండలాల్లో గెలుపొందిన కాంగ్రెస్, టీడీపీ, స్వతంత్ర ఎంపీటీసీలకు టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు గాలం వేస్తున్నారు.
గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని గజ్వేల్, ములుగు మండలాల ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోడానికి ఏ పార్టీ పూర్తి మెజారిటీ సాధించలేదు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ రెండు మండలాలూ టీఆర్‌ఎస్ ఖాతాలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక స్వతంత్రులు అయితే మూకుమ్మడిగా టీఆర్‌ఎస్‌కే మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని మిరుదొడ్డి, అందోల్ నియోజకవర్గం పరిధిలోని టేక్మాల్ ఎంపీపీ స్థానాలను స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో టీఆర్‌ఎస్ సునాయాసంగా కైవసం చేసుకోబోతోంది.
మున్సిపాలిటీలూ గులాబీమయమే!
సంగారెడ్డి మున్సిపాలిటీలోని 31 వార్డుల్లో 11 వార్డులను కాంగ్రెస్, 8 వార్డులును ఎంఐఎం గెలుచుకుంది. ఇక్కడ ఏ పార్టీ మేజిక్ ఫిగర్‌ను సాధించకపోవడంతో చైర్మన్ సీటును కైవసం చేసుకోడానికి ఇరు పార్టీలు హోరాహోరీగా ప్రయత్నిస్తున్నాయి. టీఆర్‌ఎస్ నుంచి ఇద్దరు సభ్యుల మద్దతు టీఆర్‌ఎస్‌కే లభించనుండడంతో ఆ పార్టీ బలం 10కు పెరిగింది. ఇక ఇక్కడి నుంచి గెలిచిన 5 మంది స్వంతంత్ర సభ్యుల్లో ఇద్దరితో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు సైతం ఎంఐఎం వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీంతో 16 మంది సభ్యుల మద్దతుతో ఎంఐఎం చెర్మైన్ సీటును కైవసం చేసుకోబోతోందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సంగారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్‌కు దక్కకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న టీఆర్‌ఎస్ ఈ దిశగా ఎంఐఎంకు పూర్తి సహకారాన్ని అందిస్తుండడం గమనార్హం.
సదాశివపేట మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో కాంగ్రెస్ 13 వార్డులు గెలిచి పూర్తి మెజారిటీ సాధించినా, చైర్‌పర్సన్ ఎంపిక విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ఆ పార్టీ నుంచి గెలిచిన పట్నం విజయలక్ష్మికి చైర్‌పర్సన్ పదవిని కట్టబెట్టేందుకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మొగ్గు చూపగా..లింగాయత్ సామాజికవర్గానికి చెందిన శీల, పిల్లోడి జయమ్మ, ఆకుల మంజు తదితరులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఈ తిరుగుబాటును తెర వెనక నుంచి ప్రోత్సహించడం ద్వారా టీఆర్‌ఎస్ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోంది. టీఆర్‌ఎస్ 5 వార్డులను గెలుచుకోగా మరో 6 మంది సభ్యుల మద్దతును కూడగట్టుకుంటే ఆ పార్టీ చైర్‌పర్సన్ పదవిని కైవసం చేసుకునే అవకాశాలున్నాయి.
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో 20 వార్డుల్లో 10 వార్డులు టీడీపీ, 9 టీఆర్‌ఎస్, ఓ వార్డును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నర్సారెడ్డి చేరికతో టీఆర్‌ఎస్ బలం 10కి పెరిగింది. టీడీపీ నుంచి ఒకరిద్దరు టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
మెదక్ మున్సిపాలిటీలోని 27 వార్డుల్లో టీఆర్‌ఎస్ 11 వార్డులను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినా మేజిక్ ఫిగర్‌కు చేరుకోలేకపోయింది. అయితే, ఇక్కడి నుంచి గెలిచిన ముగ్గురు స్వంతంత్రులు, ఒక ఎంఐఎం సభ్యుడి మద్దతుతో టీఆర్‌ఎస్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోనుంది. కాంగ్రెస్ 6, టీడీపీ 5 వార్డులను గెలుచుకోగా.. ఈ రెండు పార్టీలకు చెందిన నలుగురు సభ్యులు కూడా టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
కారు.. ఫుల్‌జోరు
Published Wed, May 21 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM
Advertisement
Advertisement