ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మినహాయించి టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి నగేష్‌కు నియోజకవర్గంలో 72,673 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ అభ్యర్థికి 56,906 ఓట్లు మాత్రమే వచ్చాయి. నగేష్‌కు ఓటు వేసిన వారిలో 15,767 మంది అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్నకు ఓటు వేయలేదు. ఆ ఓట్లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మళ్లాయి. క్రాస్ ఓటింగ్ కానిపక్షంలో ఆ ఓట్లతో కలుపుకుంటే సుమారు 30 వేల మెజార్టీ రామన్నకు దక్కేది. గత ఉప ఎన్నికల్లో 33 వేల మెజార్టీ సాధించిన రామన్న 14,711 మాత్రమే సాధించడం గమనార్హం.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఆదిలాబాద్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి పాయల శంకర్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి రాథోడ్ రమేశ్(టీడీపీ) పోటీ చేశారు. పాయల శంకర్‌కు 43,664, రాథోడ్ రమేశ్‌కు 21,555 ఓట్లు మాత్రమే వచ్చాయి. శంకర్‌కు పడిన ఓట్ల నుంచి 22,109 ఓట్లు టీడీపీకి కాకుండా ఇతరులకు మళ్లాయి. టీఆర్‌ఎస్ ఈ ఓట్లు భారీగా దక్కించుకుంది. కాంగ్రెస్ నుంచి ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థి భార్గవ్‌దేశ్‌పాండేకు 29,964 ఓట్లు రాగా అదే పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థి నరేష్ జాదవ్‌కు 37,488 ఓట్లు పడ్డాయి. భార్గవ్ కంటే 7,524 ఓట్లు నరేష్‌కు అధికంగా వచ్చాయి. ఈ ఓట్లు కూడా టీఆర్‌ఎస్‌కే మళ్లాయి.
ఆదిలాబాద్‌లో భారీగా క్రాస్ ఓటింగ్
Published Sat, May 17 2014 1:06 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement