కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు | Group differences in congress party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు

Published Tue, Apr 15 2014 1:07 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో తీవ్రస్థాయిలో నెలకొన్న గ్రూపు విభేదాలు ఆ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి నరేశ్ జాదవ్‌కు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో తీవ్రస్థాయిలో నెలకొన్న గ్రూపు విభేదాలు ఆ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి నరేశ్ జాదవ్‌కు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. రెండు గ్రూపుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే స్థాయిలో ఉంది. ఈ వర్గపోరు కారణంగా క్రాస్ ఓటింగ్ జరిగే ప్రమాదం ఉందని, దీనిని నివారించేందుకు నరేశ్‌జాదవ్ పడరాని పాట్లు పడుతున్నారు. ఇందులో భాగంగా వ్యతిరేక వర్గీయులైన ప్రేంసాగర్‌రావును కలిసి ఎన్నికల్లో తనకు సహకరించాలని అభ్యర్థించారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి ఇతర పార్టీ అభ్యర్థుల మద్దతు దేవుడెరుగు.. సొంత పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థుల మద్దతునే కూడ గట్టుకోవాల్సిన పరిస్థితి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రేంసాగర్‌రావు వర్గీయుల నుంచి సానుకూలంగా స్పందన వచ్చిందని నరేష్ జాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నా, అంతర్గత ఆందోళన వీడటం లేదు.

 వర్గపోరు ప్రభావం
 ఆదిలాబాద్ ఎంపీ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఒక్క నిర్మల్ స్థానం తనకు అనుకూలమైన ఎ.మహేశ్వర్‌రెడ్డికి దక్కింది. మిగిలిన ఆరు నియోజకవర్గాలు నరేష్ జాదవ్‌కు వ్యతిరేకవర్గమైన మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు వర్గీయులకే దక్కాయి. సిర్పూర్ నుంచి ప్రేంసాగర్‌రావు బరిలో దిగారు. ఆత్రం సక్కు(ఆసిఫాబాద్), అజ్మీరా హరినాయక్ (ఖానాపూర్), విఠల్‌రెడ్డి(ముథోల్), అనీల్‌జాదవ్(బోథ్), భార్గవ్‌దేశ్‌పాండే(ఆదిలాబాద్)లు అంతా ప్రేంసాగర్‌రావు వర్గీయులే. ఎంపీ అభ్యర్థి అయిన నరేష్‌జాదవ్ మాత్రం మహేశ్వర్‌రెడ్డి, సి.రాంచంద్రారెడ్డి వర్గీయుడు. ఈ రెండు వర్గాల మధ్య చాలాకాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం విధితమే. ఇప్పుడు వర్గపోరు నరేష్‌జాదవ్ గెలుపు అవకాశాలను దెబ్బతిసే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

 వ్యతిరేక వర్గం.. వ్యూహాత్మక ప్రచారం..
 ఎంపీ అభ్యర్థి విజయావకాశాలపై ఆ నియోజకవర్గ పరిధిలో ని ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రభావం ఉంటుంది. ఎంపీ అభ్యర్థి గె లుపు సునాయసం కావాలన్నా ఆయా నియోజకవర్గాల్లోని ప్రచారం తీరులో ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రేంసాగర్‌రావు వర్గీయులైన ఎమ్మెల్యే అభ్యర్థులు వ్యూహాత్మకంగా ప్ర చారం నిర్వహిస్తున్నారు. ఆదివారమే ప్రచారం ప్రారంభించి న ప్రేంసాగర్‌రావు వర్గీయులు ఎక్కడా ఎంపీ అభ్యర్థి నరేష్ జాదవ్ ప్రస్తావన పెద్దగా తీసుకురావడం లేదు. ఈ ఎన్నిక ల్లో తనను గెలిపించాలని, కాంగ్రెస్ మద్దతివ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారే తప్ప, ఎంపీ అభ్యర్థి ప్రస్తావన లేకపోవడం నరేష్‌జాదవ్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. ఖానాపూర్ అ భ్యర్థి హరినాయక్ ఆదివారం జన్నారంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి ప్రస్తావన ఏ మాత్రం రాకపోవడం గమనార్హం. పైగా ఈ సమావేశానికి ఏపీపీఎస్సీ డెరైక్టర్ రవీందర్‌రావు వర్గీయులు, ఖానాపూర్ బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సయ్యద్ ఇసాఖ్ వంటి నాయకులు దూరంగా ఉండటం గమనార్హం. ప్రేంసాగర్‌రా వు సిర్పూర్‌లో చేస్తున్న ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడా ఎంపీ అభ్యర్థి ప్రస్తావనే లేకపోవడం విశేషం. ఆదిలాబాద్ బరిలో ఉన్న భార్గవ్‌దేశ్‌పాండే కూడా ప్రేంసాగర్ వర్గీయుడిగానే ముద్ర పడినా, ఆయనకు మద్దతుగా డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి ప్రచారం నిర్వహిస్తుండటంతో నరేష్‌జాదవ్‌కు ప్రచారానికి ఇక్కడ ప్రస్తుతానికి అంతగా ఇబ్బంది లేదు. ఏడు నియోజకవర్గాల్లో ఐదింటిలోనూ నరేష్‌జాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రచారంపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement