సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు? తమ ఎమ్మెల్యే, ఎంపీలుగా ఎవరిని ఎన్నుకున్నారు? పోటీపడ్డ అభ్యర్థుల్లో విజయం ఎవరిని వరించింది? అదృష్టవంతులెవరు, పరాజితులెవరు? జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? ఈ రోజే తేలిపోతుంది. పదిహేను రోజులు ఉత్కంఠ రేపిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కొద్ది గంటల్లోనే వెలువడనున్నాయి? ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉండటంతో శరవేగంగా మధ్యాహ్నం రెండు గంటలకల్లా పూర్తి ఫలితాలు వెలువడే అవకాశముంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో జరిగిన ఎన్నికలు కావటంతో ఈ ఫలితాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వీటికి తోడుగా కొత్త రాష్ట్రంలో, కేంద్రంలో పరిపాలనా పగ్గాలు చేపట్టేదెవరనే తీర్పును చాటిచెప్పనుండటంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలు, 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీగా ఎన్నికల పోరు సాగింది. మొత్తం 202 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
రెండు లోక్‌సభ స్థానాలకు 34 మంది, 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు 168 మంది పోటీ పడ్డారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అన్ని స్థానాల్లో పోటీ పడ్డాయి. మిత్రపక్షాలుగా పొత్తు కూడిన బీజేపీ, టీడీపీ చెరో ఆరు స్థానాల్లో బరిలో నిలిచాయి. తొలిసారిగా వైఎస్సార్‌సీపీ పదకొండు అసెంబ్లీ స్థానాల్లో తలపడింది. స్వతంత్య్ర అభ్యర్థులు సైతం కొన్నిచోట్ల హడలెత్తించారు. జిల్లాలోనే అత్యధికంగా రామగుండం నియోజకవర్గంలో 27 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అత్యల్పంగా మంథని, హుజూరాబాద్‌లో తొమ్మిది మంది చొప్పున బరిలో ఉన్నారు.
ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్, మాజీ మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, ప్రవీణ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, కేటీఆర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, చెన్నమనేని రమేశ్‌బాబు, సోమారపు సత్యనారాయణ, ఎల్.రమణ, సిహెచ్.విజయరమణరావు, సుద్దాల దేవయ్య ఈ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో మరోసారి చట్టసభల్లో అడుగు పెట్టే అవకాశం ఎవరెవరికి దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
వీరితో పాటు మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్.విద్యాసాగర్‌రావు, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొమ్‌రెడ్డి రామ్‌లు, బొమ్మ వెంకటేశ్వర్లు, కేడీసీసీబీ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు, మాజీ మంత్రులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, జువ్వాడి రత్నాకర్‌రావు, చెల్మెడ ఆనందరావు, ముద్దసాని దామోదర్‌రెడ్డి తనయులు సతీష్‌బాబు, నర్సింగరావు, లక్ష్మీకాంతరావు, కశ్యప్‌రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో త్రుటిలో విజయం చేజార్చుకున్న ఆది శ్రీనివాస్, పుట్ట మధు, కోరుకంటి చందర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఈసారైనా జెండా ఎగరేస్తారా? అనేది ఆసక్తి రేపుతోంది. వీరితో పాటు ప్రధాన పార్టీల తరఫున తొలిసారి పోటీకి దిగిన అభ్యర్థుల్లో అసెంబ్లీ, పార్లమెంటులో అడుగుపెట్టేదెవరనే ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది.
జడ్జిమెంట్ డే
Published Fri, May 16 2014 2:57 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement